AP News: ఏపీలో స్విచ్ వేయకుండానే ప్రజలకు కరెంట్ షాక్‌లు: కళావెంకట్రావు
ABN , First Publish Date - 2023-08-13T10:14:41+05:30 IST
అమరావతి: అప్రకటిత కరెంటు కోతలు, అడ్డగోలు బిల్లుల మోతలతో జగన్ రికార్డులు సృష్టిస్తున్నారని.. లోడ్ రిలీఫ్ పేరుతో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు విమర్శించారు.
అమరావతి: అప్రకటిత కరెంటు కోతలు (Power Cuts), అడ్డగోలు బిల్లుల మోతలతో జగన్ (Jagan) రికార్డులు సృష్టిస్తున్నారని.. లోడ్ రిలీఫ్ పేరుతో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు (Kimidi Kalavenkatarao) విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం, అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణకు నాలుగేళ్లుగా నిధులు కేటాయించలేదని, రాష్ట్రంలో కరెంటు కోతలు లేని గ్రామం, నగరం గానీ లేదని అన్నారు. స్విచ్ వేయకుండానే ప్రజలకు కరెంట్ షాక్‌లు కొడుతున్నాయన్నారు. గజదొంగలు సైతం విస్తుపోయేలా ప్రజలను జగన్ దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్ ఈ నాలుగేళ్లలోనే 8 సార్లు ఛార్జీలు పెంచి రూ.57 వేల కోట్లకు పైగా ప్రజలపై భారం మోపారని, విద్యుత్ ఛార్జీలు 4 రెట్లు పెరిగాయన్నారు.
టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని కళావెంకట్రావు స్పష్టం చేశారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండా.. వినియోగదారుల నుంచి కనీస వినియోగ ఛార్జీ ఏ విధంగా వసూల్ చేస్తారని ప్రశ్నించారు. కొత్త కొత్త రూపాలలో, మోసపూరిత పద్ధతుల్లో భారం వేస్తున్నారన్నారు. ఫిక్స్‌డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, విద్యుత్ సుంకాలు ట్రూ అప్, సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజల నడ్డివిరుస్తున్నారని దుయ్యబట్టారు. అదనపు లోడ్ పేరుతో డెవలప్‌మెంట్ చార్జీలంటూ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని, కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్‌డ్ ఛార్జీలు, సర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ లాంటి పేర్లతో దాదాపు 80 శాతం బిల్లు వాడకుండానే వినియోగదారులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం బిల్లులో 50 శాతం ట్రూ అప్ భారాలు ఉండటం ప్రభుత్వం దోపిడీకి నిదర్శనం కాదా?.. జె టాక్స్ భారం ప్రజలపై వేస్తారా? అంటూ కళావెంకట్రావు మండిపడ్డారు.