దళారుల చేతిలో పుసుపు రైతు
ABN , First Publish Date - 2023-04-11T00:37:45+05:30 IST
పసుపు రైతులకు మళ్లీ కష్టాలొచ్చాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లేక దళారులకు పంటను తెగనమ్ముకున్న రైతులకు ఈ ఏడాదీ అదే దుస్థితి ఎదురవుతోంది. దానికితోడు గతేడాది కంటే ధర కూడా తగ్గింది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

రెండు నెలల నుంచి పసుపు తవ్వకాలు మొదలు
అయినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని మార్క్‌ఫెడ్
దళారులకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి
గతేడాదీ ఇదే తీరు..
గతం కన్నా తగ్గిన ధర
పసుపు రైతులకు మళ్లీ కష్టాలొచ్చాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లేక దళారులకు పంటను తెగనమ్ముకున్న రైతులకు ఈ ఏడాదీ అదే దుస్థితి ఎదురవుతోంది. దానికితోడు గతేడాది కంటే ధర కూడా తగ్గింది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తోట్లవల్లూరు, ఏప్రిల్ 10 : తోట్లవల్లూరు మండలంలో ఈ ఏడాది 2,619 ఎకరాల్లో పసుపు సాగైంది. రెండు నెలల నుంచి పసుపు తవ్వకాలు మొదలయ్యాయి. గతేడాది క్వింటా గతేడాది రూ.6 వేలు ఉంటే ఈ ఏడాది రూ.5వేలే ఉంది. పచ్చి పసుపు క్వింటా రూ.1400 మ్రాతమే. కనీసం రూ.2500 ఉంటేనే పెట్టుబడులైనా వస్తాయి. ధరల్లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. రైతులు దళారులను ఆశ్రయించక తప్పటం లేదని తోట్లవల్లూరుకు చెందిన రైతు జి.రమేష్ వాపోయాడు.
గతంలో ఎన్నడూ లేని నష్టాలను చవిచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం చాగంటిపాడులో, గతేడాది కంకిపాడులో మార్క్‌ఫెడ్ పసుపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి దళారులకే ఉపయోగపడ్డాయి. ఈ ఏడాది కూడా అలాగే చేస్తే తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని రైతులు వాపోతున్నారు.
కొనేవారి కోసం తిరుగుతున్నా
తోట్లవల్లూరులో నాలుగెకరాల కౌలు పొలంలో పసుపు సాగు చేశా. పచ్చిపసుపుని ఉడికించి ఎండబెట్టి కల్లంలో ఉంచాను. భూ యజమానికి ఎకరానికి 5.5 క్వింటాళ్ల చొప్పున ఎండు పసుపు కాటావేసి ఇచ్చా. ఇంకా 40 క్వింటాళ్ల ఎండు పసుపు పది రోజులుగా కల్లంలో ఉంది. కంకిపాడు ప్రైవేటు వ్యాపారి వద్దకు వెళితే గోనె సంచులు లేవన్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉంటే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను ఎవ్వరికి అమ్మాలో తెలియని దౌర్భాగ్యం నెలకొంది.
- గొరిపర్తి నాగశ్రీను, తోట్లవల్లూరు