అన్నదాత విలవిల
ABN , First Publish Date - 2023-01-17T23:28:34+05:30 IST
ధాన్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట పండించడమే ప్రహసనమైతే.. పండిన పంటను అమ్ముకోవడం అంతకుమించిన కష్టంగా మారింది. మండూస్ తుపాను కారణంగా రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయలేమని, ఎఫ్‌సీఐ బియ్యం సేకరణలో నిబంధనలను సడలిస్తే తప్ప తాము ఽధాన్యం మిల్లింగ్ చేయలేమని మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. మరోపక్క రంగు మారిన ధాన్యానికి తేమ శాతం ఆధారంగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అది ఎక్కడా అమలు కావడం లేదు.

రంగుమారిన ధాన్యం అమ్ముకోలేక అవస్థలపాలు
బస్తా రూ.900 మించి కొనుగోలు చేయలేమంటున్న మిల్లర్లు
తేమ శాతం ఆధారంగా మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం
10 శాతం రంగు మారితే బస్తా ధాన్యం మద్దతు ధర రూ.1325
40 శాతంపైగా రంగు మారితే వెయ్యి రూపాయలు
అదీ అమలు కాని దైన్యం
ధాన్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట పండించడమే ప్రహసనమైతే.. పండిన పంటను అమ్ముకోవడం అంతకుమించిన కష్టంగా మారింది. మండూస్ తుపాను కారణంగా రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయలేమని, ఎఫ్‌సీఐ బియ్యం సేకరణలో నిబంధనలను సడలిస్తే తప్ప తాము ఽధాన్యం మిల్లింగ్ చేయలేమని మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. మరోపక్క రంగు మారిన ధాన్యానికి తేమ శాతం ఆధారంగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అది ఎక్కడా అమలు కావడం లేదు.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : జిల్లాలో ఈ ఏడాది ఎకరానికి 35 బస్తాల సరాసరి దిగుబడి నమోదైంది. 9.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం 5.50 లక్షల టన్నుల ముతక రకం ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతోంది. మాండూస్ తుపాను కారణంగా డిసెంబరులో కురిసిన భారీవర్షాలకు 4,161.77 ఎకరాల్లో వరి పంట పనలపై ఉండి తడిచినట్టు వ్యవసాయశాఖ అధికారులు లెక్కతేల్చారు. 3,445 మంది రైతులకు చెందిన పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. వీరికి రూ.2.49 కోట్ల మేర పంట నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పొందుపరిచారు. ఎకరానికి రూ.6వేల చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వనున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో మాండూస్ తుపాను కారణంగా డిసెంబరు 9, 10 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. 40 వేల ఎకరాలకుపైగా పంటనష్టం జరిగింది. కలెక్టర్ రంజిత్‌బాషా, జేసీ అపరాజిత సింగ్, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు శ్రీధర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మనోహరరావు పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి పంటనష్టం జరిగిన తీరును పరిశీలించారు. కోతకోసి పనలపై ఉన్న ధాన్యం మొక్క మొలిచిన తీరును రైతులు అధికారులకు చూపారు. అధికారులు కూడా 30 శాతానికిపైగా ధాన్యం దెబ్బతింటుందని అంచనాకు వచ్చారు. అయితే పంటనష్టం అంచనాలను మాత్రం 4,161 ఎకరాలకు మాత్రమే కుదించారు. అప్పట్లో లక్ష టన్నులకుపైగా ధాన్యం రంగు మారుతుందని, రంగు మారిన ధాన్యం కొనుగోలు నిమిత్తం ప్రభుత్వానికి లేఖ రాస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు.
కొనుగోళ్లు ప్రశ్నార్థకం
రంగు మారిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో మిల్లర్లు కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు ధాన్యాన్ని పరిశీలించి ధరను నిర్ణయించాలని ప్రభుత్వం సూచన చేసింది. తడిచిన ధాన్యం తాము కొనుగోలు చేయమని, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి, మరపట్టి ఆ బియ్యాన్ని తామెక్కడ విక్రయించాలని మిల్లర్లు అంటున్నారు. రైతులు ప్రస్తుతం కుప్పనూర్పిళ్లు చేస్తుండటంతో రంగు మారిన ధాన్యం కొనుగోలు ఎంతమేర చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల రైతులు స్పందన కార్యక్రమానికి వచ్చి రంగు మారిన ధాన్యం బస్తాకు రూ.900 మత్రమే ఇస్తామని మిల్లర్లు చెబుతున్నారని అధికారులకు తెలిపారు.
3.17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే పేర్ని నాని జేసీ చాంబరులో జేసీ అపరాజిత సింగ్, పౌరసఫరాలశాఖ జిల్లా మేనేజరు శ్రీధర్‌లతో మంగళవారం సమావేశమయ్యారు. కుప్పనూర్పిళ్లు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. రైతులకు మేలు జరిగే విధంగా మిల్లర్లతో మాట్లాడి రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 34,600 మంది రైతుల నుంచి 3.17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, భోగి ముందు రోజు రూ.43 కోట్లు, కనుమ రోజున రూ.164 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని జేసీ చెప్పారు.
తేమ శాతం ఆధారంగా మద్దతు ధర ఇలా..
రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు రాసిన లేఖతో ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ధాన్యంలో 10 శాతం నుంచి 20 శాతం వరకు రంగు మారితే 75 కిలోల బస్తాకు రూ.1325 మద్దతు ధరగా చెల్లించాలని నిర్ణయించింది. 20 శాతం నుంచి 30 శాతం వరకు రంగు మారితే బస్తాకు రూ.1150, 30 శాతం నుంచి 40 శాతం వరకు ధాన్యం రంగు మారితే బస్తాకు రూ.1050, 40 శాతంకు పైబడి ఽధాన్యం రంగు మారితే వెయ్యి రూపాయలుగా మద్దతు ధరను నిర్ణయించింది.