TDP: ఆర్థిక క్రమశిక్షణ లేని బడ్జెట్... అమరావతిని అటకెక్కించారన్న టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2023-03-16T12:21:00+05:30 IST
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన 2023- 24 వార్షిక బడ్జెట్‌పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly) లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister buggan Rajendranath Reddy) ప్రవేశపెట్టిన 2023- 24 వార్షిక బడ్జెట్ (AP Budget)పై టీడీపీ నేతలు (TDP Leaders) విమర్శలు గుప్పించారు. ఆర్ధిక క్రమశిక్షణ లేని బడ్జెట్‌ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (YS jaganmohan Reddy) పాలన మోనార్కిజంలా సాగుతోందని విమర్శించారు. ఆదాయం ఎంతో ఖర్చు ఎంతో చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. అప్పులు పట్టించుకోవటం కోసం ప్రజల్ని మోసగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో అవి నిర్వీర్యమైపోతున్నాయని తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల కోసం నడిచే ఆసుపత్రికే నిధులు లేక మందులు ఇవ్వట్లేదంటే, ఇక ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఏంటి అని గోరంట్ల ప్రశ్నించారు.
నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. బుగ్గన ఆర్థిక శాఖా మంత్రిగా కంటే అప్పుల శాఖా మంత్రిగా పేరు తెచ్చుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేసిన 9 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో చూపిన కేటాయింపులకు తగ్గట్టు ఖర్చులు లేకనే రైతులు పంటల విరామం ప్రకటిస్తున్నారన్నారు. మూడు రాజధానులకు మూడు ఇటుకలు కూడా పెట్టకుండా అమరావతిని అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.