గ్రామీణంలోనే అధిక పోలింగ్
ABN , First Publish Date - 2023-03-15T01:56:48+05:30 IST
తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే అధికశాతం పోలింగ్ నమోదైంది.

ఎస్‌ఎన్‌పాడులో పట్టభద్రులు, వైపాలెంలో ఉపాధ్యాయులు అధికం
రెండింటిలోనూ ఒంగోలులోనే తక్కువశాతం
రేపు చిత్తూరులో ఓట్ల లెక్కింపు
17న ఫలితం వచ్చే అవకాశం
ఒంగోలు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే అధికశాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అనంతరం ఆలస్యంగా మంగళవారం ఉదయం అఽధికారులు ప్రకటించిన తుది పోలింగ్ శాతం వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో నమోదైన ఓటింగ్ శాతం చూస్తే పట్టభద్రుల్లో సంతనూతలపాడులోనూ, ఉపాధ్యాయుల్లో ఎర్రగొండపాలెంలోనూ అధికంగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఓట్లు ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో జిల్లా సగటు కన్నా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. పట్టణాల్లో ఇళ్ల నుంచి పది నిమిషాల్లో చేరుకునే విధంగా పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంది. మండలకేంద్రాలలో మాత్రమే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాల ఓటర్లు మండల కేంద్రానికి వచ్చి ఓటు వేయాలి. ఒక్కో మండలంలో 20 నుంచి 25 గ్రామాలు ఉండటంతోపాటు అధిక గ్రామాలు 10 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొన్ని మండలాల్లో 35 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో కూడా గ్రామాలు ఉన్నాయి. అయినప్పటికీ మూడొంతులకుపైగా గ్రామీణ ప్రాంతాలు ఉండే వైపాలెం, ఎస్‌ఎన్‌పాడు, కొండపి, దర్శి వంటి నియోజకవర్గాల్లో అధిక శాతం పోలింగ్ జరగడం విశేషం.
ఒంగోలులో అత్యల్పంగా..
మొత్తం ఓటర్లలో నాల్గో వంతు ఉన్న ఒంగోలులో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఒక మోస్తరు పట్టణాలైన గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోనూ గ్రామీణ ప్రాంతాల కన్నా తక్కువ పోలింగ్ జరిగినట్లు కనిపిస్తోంది. మార్కాపురం, పొదిలి వంటి రెండు ప్రధాన పట్టణాలు ఉండే మార్కాపురం నియోజకవర్గంలో మాత్రం ఇతర వాటి కన్నా మెరుగ్గా పోలింగ్ నమోదైంది. మరోవైపు పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో మొత్తం 82,225 మంది ఓటర్లలో 55,703 మంది పురుషులు 26,517 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 72.72 శాతంతో 59,835 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారిలో 41,175(73,91) పురుషులు ఓటింగ్‌లో పాల్గొనగా 18,660(70.30శాతం) మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పెరిగిన పోలింగ్ శాతం
ఉపాధ్యాయ స్థానంలో మొత్తం 5,789 మంది ఓటర్లు ఉండగా 5,322 (91.93శాతం)మంది ఓటు వేశారు. పురుష ఓటర్లు 3,691 మందికి 3,428 (92.87శాతం), 2,098 మంది మహిళా ఓటర్లలో 1,894 (90.27శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బ్యాలెట్ బాక్సులన్నీ చిత్తూరుకు చేరాయి. ఈనెల 16న అక్కడ లెక్కింపు జరగనుంది. ఫలితం 17వతేదీకి అందుతుందని సమాచారం.