13న జాతీయ లోక్‌అదాలత్
ABN , First Publish Date - 2023-05-09T01:22:31+05:30 IST
జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 13వతేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 29 బెంచ్‌ల ఏర్పాటు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి వెల్లడి
ఒంగోలు (కలెక్టరేట్), మే 8: జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 13వతేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి తెలిపారు. మొత్తం 29 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి కక్షిదారులంతా సహకరించాలన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, వాహన ప్రమాద, బీమా పరిహారం చెల్లింపు, చెక్‌బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలతోపాటు సివిల్ కేసులను ఇరువురి ఆమోదంతో పరిష్కరిస్తామని తెలిపారు. లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల్లో అప్పీళ్లకు వెళ్లే అవకాశం లేదన్నారు. అలాగే కోర్టులలో చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని తెలిపారు. న్యాయస్థానా లకు ప్రత్యక్షంగా హాజరుకాలేని వారు దృశ్యవీక్షణ ద్వారా కూడా వ్యాజ్యాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పోలీస్, ప్రభుత్వ అధికారులు, న్యాయవా దులు ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు. అలాగే చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుల గడువు ఈనెల 18 వరకు పొడిగించినట్లు తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఎటువంటి పైరవీలకు తావు లేకుండా న్యాయవాదుల ఎంపిక జరుగుతుందని భారతి తెలిపారు.