ఊరచెరువులో ‘చెత్త’ రగడ

ABN , First Publish Date - 2023-09-22T23:38:08+05:30 IST

ఊర్లో చెత్తను ఊరచెరువులో పోస్తుండటంతో కంపు భరించలేకపోతున్నామని, అందరూ వ్యాధుల బారిన పడుతున్నారని చేపల వ్యాపారులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. నగరంలోని పారిశుధ్య విభాగం చెత్త ట్రాక్టర్లు, వాహనాల ద్వారా ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకుండా, ఊరచెరువులో పోయడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఊరచెరువులో ‘చెత్త’ రగడ
అధికారులను నిలదీస్తున్న మహిళలు

వ్యర్థాలు వేయవద్దంటూ చేపల వ్యాపారుల నిరసన

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 22 : ఊర్లో చెత్తను ఊరచెరువులో పోస్తుండటంతో కంపు భరించలేకపోతున్నామని, అందరూ వ్యాధుల బారిన పడుతున్నారని చేపల వ్యాపారులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. నగరంలోని పారిశుధ్య విభాగం చెత్త ట్రాక్టర్లు, వాహనాల ద్వారా ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకుండా, ఊరచెరువులో పోయడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్యం విభాగం కార్మికులపై వారు కన్నెర్న చేశారు. చెత్తను డంపింగ్‌ చేయకుండా అడ్డుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆటో సిబ్బంది అక్కడే పోయడం దారుణమన్నారు.ఒకవైపు ప్రభుత్వం క్లీన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ గొప్పలు పోతుందని, కానీ ఆచరణలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌పై ఆధారపడి జీవించేవారమని, ఇలా పారిశుధ్యం అధ్వానంగా ఉండి, చెత్త పోస్తే కొనుగోలు చేయడానికి ఎవరు వస్తారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకురాలు బేతంశెట్టి శైలజ అక్కడకు చేరుకుని వ్యాపారులతో మాట్లాడారు. పది, పదిహేను రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ బాబ్జి మాట్లాడుతూ రెండు రోజుల్లో ఊరచెరువులో చెత్తను తొలగించి శుభ్రం చేస్తామన్నారు. పదిహేను రోజుల్లో చెత్త డంపింగ్‌ కేంద్రం పేర్నమిట్ట, మామిడిపాలెం వద్ద స్థల పరిశీలన జరిగిందన్నారు. అక్కడకు మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారులు, చేపల వ్యాపారులు, మాంసం మార్కెట్‌లోని వ్యర్థాలను ఊరచెరువులో వేయడానికి వీల్లేదని తెలిపారు. ఎవరి దుకాణం ముందు వారు ప్లాస్టిక్‌ డ్రమ్ములు ఏర్పాటు చేసుకుని అందులోనే వేయాలని హెచ్చరించారు.

Updated Date - 2023-09-22T23:38:08+05:30 IST