రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంక్ సేవలేవీ..?
ABN , First Publish Date - 2023-10-22T23:57:33+05:30 IST
రైతుభరోసా కేంద్రాల్లో రైతులకు బ్యాంకింగ్ సేవలు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఆర్బీకేల్లో ఆయా బ్యాంకుల కరస్పాండె ంట్లు (బీసీ) కనీసం రెండు గంటలు ఉండాలని ప్రణాళిక రూపొందించినా ఆచరణలో విఫలమవుతోంది.

- నేరవేరని ప్రభుత్వ లక్ష్యం
- రైతులకు తప్పని వ్యయప్రయాసలు
(ఇచ్ఛాపురం రూరల్)
రైతుభరోసా కేంద్రాల్లో రైతులకు బ్యాంకింగ్ సేవలు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఆర్బీకేల్లో ఆయా బ్యాంకుల కరస్పాండె ంట్లు (బీసీ) కనీసం రెండు గంటలు ఉండాలని ప్రణాళిక రూపొందించినా ఆచరణలో విఫలమవుతోంది. దీంతో రైతులకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాల సేవలను రైతులకు గ్రామస్థాయిలో అందించాలని రైతుభరోసా కేంద్రాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. వీటితోపాటు బ్యాంకింగ్ సేవలు కూడా అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. సాధారణంగా ఐదువేల జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్యాంకులు శాఖలను ఏర్పాటు చేసి సేవలందిస్తుంటాయి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి బిజినెస్ కరస్పాండెంట్లను నియమించుకుని సేవలందిస్తున్నాయి. వారు గ్రామాల్లో ఆర్‌బీకేలలో కనీసం రెండు గంటలు పాటు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రారంభంలో ప్రధాన బ్యాంకుల బీసీలు కొన్ని ఆర్‌బీకేలలో సేవలు ప్రారంభించారు. ఆ తరువాత వారి సేవలు దాదాపుగా దూరమయ్యాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 644 రైతుభరోసా కేంద్రాలు ఉండగా, వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం 614 మంది బ్యాంక్ కరస్పాండెంట్లు సేవలందిస్తున్నారు. మరో 30 కేంద్రాల్లో బీసీలు లేనట్లు చెబుతున్నారు. కానీ ఎక్కడా సేవలు కనిపించడం లేదు. ఆర్బీకేల్లో అందాల్సిన బాం్యకు సేవలను పరిశీలిస్తే.. రూ.20వేల వరకు నగదు ఉపసంహరణతోపాటు జమ చేయడం. వేరే ఖాతాలకు బదిలీ చేయడం. ఇతర బ్యాంకు ఖాతాలకు మాత్రం రూ.10వేలు ఉపసంహరణ, బదిలీకు అవకాశం. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని గుర్తించడం. తీసుకున్న రుణాలకు సంబంధించి నగదు స్వీకరణ. ఖాతాలకు సబంధించి నగదు వివరాల వెల్లడితోపాటు మినీస్టేట్‌మెంటు అందజేత. డిజిటల్, మొబైల్ లావాదేవీలు. నెట్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన తదితర కార్యకలాపాలకు అవకాశం కల్పించారు. కానీ ఈ సేవలు అమలుకావడం లేదు. దీంతో గ్రామాల్లోని రైతులు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లేందుకు వ్యయప్రయాసకు గురవుతున్నారు. అక్కడి సిబ్బంది సరిగా సహకరించకపోవడంతో వ్యవసాయ రుణాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా అందిస్తారు
ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం బ్యాంకు సేవలకు సంబంధించిన కార్యకలాపాలు చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. వాటికి సంబంధించి 614 మంది బీసీలను నియమించారు. అయితే పోస్టల్ ద్వారా సేవలు అందిస్తామని వారు ముందుకు రావడంతో జాప్యమవుతోంది. ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటాం.
- కె.శ్రీధర్, వ్యవసాయశాఖ జేడీ