డ్వాక్రా మహిళలకు.. ప్రోత్సాహమేదీ?
ABN , First Publish Date - 2023-12-12T00:09:17+05:30 IST
డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం కరువవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి బాటలు వేయడంతోపాటు వనితలు ఆర్థిక పురోగతి సాధించేలా ఆదరణ పథకం ద్వారా పరికరాలు పంపిణీ చేసేవారు.

- అటకెక్కిన ఆదరణ
- నైపుణ్య శిక్షణ కరువు
- కానరాని పరికరాల పంపిణీ
(ఇచ్ఛాపురం)
డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం కరువవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి బాటలు వేయడంతోపాటు వనితలు ఆర్థిక పురోగతి సాధించేలా ఆదరణ పథకం ద్వారా పరికరాలు పంపిణీ చేసేవారు. మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు పర్యవేక్షించేవారు. ప్రస్తుతం శిక్షణా లేదు. పరికరాల పంపిణీ కూడా లేదు. మెప్మా విభాగం అలంకారప్రాయంగానే మిగిలింది. మహిళలకు ఆదరణ అటకెక్కింది. జిల్లావ్యాప్తంగా 5,600 డ్వాక్రా సంఘాల పరిధిలో 60,249 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపులో పది నుంచి 15మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి పథకం కింద మునిసిపాలిటీలోని డ్వాక్రా మహిళలకు ఉచితంగా కుట్టు, అల్లికలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. వందలాది మంది మహిళలకు కుట్టుమిషన్లు సైతం ఉచితంగా ఇచ్చేవారు. ఆదరణ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా చేతివృత్తిదారులకు యంత్రాలు పంపిణీ చేసేవారు. సూక్ష్మవ్యాపారాలు చేసుకునేలా రుణాలు కూడా మంజూరు చేసేవారు. ఆసక్తి గల మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. మెప్మా నేతృత్వంలో మునిసిపాలిటీ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. అర్హులను ఎంపిక చేసేవారు. బ్యాంకులు ఎటువంటి గ్యారంటీ లేకుండానే రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసేవి. వీటిద్వారా స్వయం ఉపాధి పొంది చాలా మంది ఆర్థిక పురోగతి సాధించారు. ప్రస్తుతం ఇవన్నీ ఆగిపోయాయి. పట్టణ వనితలకు ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. మహిళలకు రుణాల మంజూరు కార్యకలాపాలకు మాత్రమే మెప్మా పరిమితమైంది. ప్రస్తుతం ఈ విభాగం జగనన్న భూహక్కు, టిడ్కో ఇళ్లు, ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. అది కూడా సచివాలయాల స్థాయిలో వలంటీర్ల సాయంతో అర్హులను గుర్తిస్తున్నారు. అక్కడ నుంచి అర్హుల జాబితాను మెప్మా కార్యాలయానికి పంపిస్తున్నారు. ఎంపికైనవారికి బ్యాంకు రుణాలు అందజేసేలా మెప్మా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. పట్టణ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ, ఆర్థిక ప్రోత్సాహం వంటి ఊసేలేదు. దీంతో డ్వాక్రా మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి స్వయం ఉపాధి కల్పించేలా శిక్షణ కల్పించాలని, వ్యక్తిగత రుణాలతో పాటు యంత్ర పరికరాలు మంజూరు చేయాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. ఈ విషయమై మెప్మా పీడీ కిరణ్ వద్ద ప్రస్తావించగా ‘గత ప్రభుత్వ హయాంలో ఎస్‌టీపీ(స్కిల్ ట్రైనింగ్ ప్రాజెక్ట్) ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ కల్పించేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నైపుణ్య శిక్షణ ఇవ్వలేకపోతున్నామ’ని తెలిపారు.