Chandrababu: అనపర్తిలో ఉద్రిక్తత.. చంద్రబాబు సభకు ఆంక్షలు
ABN , First Publish Date - 2023-02-17T16:56:16+05:30 IST
టీడీపీ అధనేత చంద్రబాబు (Chandrababu) ఎక్కడ అడుగుపెడితే అక్కడ భారీ స్థాయిలో జనం పోటెత్తున్నారు. పోటెత్తిన అభిమాన ప్రవాహం..
రాజమండ్రి: టీడీపీ అధనేత చంద్రబాబు (Chandrababu) ఎక్కడ అడుగుపెడితే అక్కడ భారీ స్థాయిలో జనం పోటెత్తున్నారు. పోటెత్తిన అభిమాన ప్రవాహం.. కిక్కిరిసిన రహదారులు. రోడ్లకిరువైపులా జనం బారులు... హారతులు.. పూల వర్షాలతో కనివినీ ఎరుగని అఖండ స్వాగతాల మధ్య చంద్రబాబుకు పర్యటన తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) ఉత్సాహం సాగుతోంది. ఇలా జిల్లాలో రెండోరోజు పర్యటన ముగించుకుని మూడో రోజు అడుగుపెట్టారు. చంద్రబాబు పర్యటనకు వస్తున్న ఆదరణ చూసి ప్రభుత్వం అడగడుగునా ఆంక్షలు విధిస్తోంది. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని అనపర్తిలో నిర్వహించారు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని టీడీపీ (TDP) కార్యకర్తలు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అనపర్తి (Anaparthi)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు సభపై పోలీసుల ఆంక్షలు విధించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. రోడ్డుపై సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అనపర్తిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించుకోవాలని డీఎస్పీ భక్తవత్సల సూచించారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని, టీడీపీ నేతలు సహకరించాలని కోరారు డీఎస్పీ. పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ముందు ప్రకటించిన షెడ్యూల్ ఇదే..
‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం సామర్లకోట నుంచి సాయంత్రం 4 గంటలకు బిక్కవోలు మండలం ఇళ్ళపల్లి జోడు నాదాల తూము వద్ద అనపర్తి నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో అనపర్తి చేరుకుని మెయిన్‌రోడ్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అయిదు గంటలకు చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రి ఏడు గంటలకు అనపర్తి మండలం రామ వరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్క రిస్తారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసానికి చేరుకుని మూలారెడ్డి సతీమణి సత్యవతిని వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 8.45 గంటలకు రామవరం నుంచి అనపర్తి, కడియం, వేమగిరి మీదుగా రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని హైదరాబాద్‌కు పయనమౌతారు.
పెద్దాపురంలో పొటెత్తిన జనం
గురువారం ఉదయం పార్టీ నేతలతో సమీక్ష అనంతరం జగ్గంపేట నియోజకవర్గ పార్టీ కేడర్‌తో చంద్రబాబు ఉత్సాహంగా గడిపారు. ఆ తర్వాత సాయంత్రం మూడు న్నరకు జగ్గంపేట నుంచి పెద్దాపురం వరకు రోడ్డుషోగా వచ్చారు. దీంతో చంద్రబాబును చూసేందుకు జనం అనేకచోట్ల బారులు తీరారు. ముఖ్యంగా పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం నుంచి పెద్దాపురం పట్టణం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర చంద్రబాబు రోడ్డుషో నిర్వహించడానికి మూడు గంటల సమయం పట్టిందంటే జనం ఏ స్థాయిలో పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు కాట్రావులపల్లిలో కూరగాయ రైతు, కట్టమూరులో విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడారు. జె.తిమ్మాపురం దాటాక సరదాగా కాసేపు బుల్లెట్ నడిపారు. అనంతరం పెద్దాపురం బహిరంగ సభలో అశేష జనవాహిని మధ్య ప్రసంగించారు.