కదంతొక్కిన బార్క్ నిర్వాసితులు
ABN , First Publish Date - 2023-08-22T00:38:44+05:30 IST
బాబా అణు పరిశోధనా కేంద్రం(బార్క్)కు భూములిచ్చిన నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇక్కడ భారీ ఎత్తున ఆందోళన చేశారు. అచ్యుతాపురం జంక్షన్ నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు.

గతంలో తయారు చేసిన లబ్ధిదారుల జాబితాను రద్ద చేయాలి
మళ్లీ సర్వే చేసి నిజమైన సాగుదారులను గుర్తించాలి
భూసేకరణ చట్టం- 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి
తహసీల్దారుకు వినతిపత్రం
ఆందోళనకు టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు
అచ్యుతాపురం, ఆగస్టు 21: బాబా అణు పరిశోధనా కేంద్రం(బార్క్)కు భూములిచ్చిన నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇక్కడ భారీ ఎత్తున ఆందోళన చేశారు. అచ్యుతాపురం జంక్షన్ నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. తహసీల్దార్ ఇక్కడ లేరని, ఎంపీడీవో కార్యాలయంలో వున్నారని సిబ్బంది చెప్పడంతో అక్కడకు వెళ్లి ఆందోళన చేశారు. విషయం తెలుసుకుని తహసీల్దార్ శ్రీనివాసరావు బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. వారు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ, తంతడి పంచాయతీ పరిధిలోని కొండ ప్రాంతంలో మూడున్నర దశాబ్దాల నుంచి జీడిమామిడి తోటలను సాగు చేసుకుంటున్న డి.పట్టా భూములను సుమారు పదేళ్ల క్రితం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా బార్క్‌కు ఇచ్చిందని చెప్పారు. సాగుదారులకు నష్టపరిహారం ఇవడానికి ప్రభుత్వం అంగీకరించిందని, కానీ వైసీపీ నాయకులు నిజమైన సాగుదారులను తప్పించి, తమ అనుచరుల పేర్లతో తప్పుడు రికార్డులు సృష్టించి జాబితాలో చేర్చారని వాపోయారు. అధికారులు సైతం అక్రమార్కులకు సహాయ సహకారాలు అందించారని ఆరోపించారు. పైగా లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయకుండా నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పడం శోచనీయని అన్నారు. గతంలో తయారు చేసిన నిర్వాసితుల జాబితాలను రద్దుచేయాలని, మళ్లీ సర్వే నిర్వహించి నిజమైన సాగుదారులను గుర్తించాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బార్క్ నిర్వాసితుల ఆందోళనకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేశ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు జనపరెడ్డి నర్శింగరావు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మిరెడ్డి నాయుడుబాబు (డ్రీమ్స్ నాయుడు), జనసేన ఎలమంచిలి ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్, బీజేపీ ఎలమంచిలి ఇన్‌చార్జి రాజాన సన్యాసినాయుడు, ఆయా పార్టీలకు చెందిన బైలపూడి శ్రీరామదాసు, జనపరెడ్డి శ్రీనివాసరావు, రాజాన నానాజీ, కూనిశెట్టి రమణ, పుర్రే శ్రీనివాస యాదవ్, తదితరులు పాల్గొన్నారు.