వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఇంటికే!
ABN , First Publish Date - 2023-02-27T00:50:07+05:30 IST
సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి రాష్ట్రంలోని ప్రజలంతా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణ అన్నారు.

ఎస్.రాయవరం, ఫిబ్రవరి 26: సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి రాష్ట్రంలోని ప్రజలంతా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణ అన్నారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో వున్న టీడీపీ పాయకరావుపేట నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన తరువాత తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, ఇటువంటి తరుణంలో అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెలుగుదేశం పాలన ఎంతో అవసరమని యావత్ ప్రజానీకం గుర్తించిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని యనమల అన్నారు. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం అనుమతితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్, జానకి శ్రీను, లాలం కాశీనాయుడు, గింజ లక్ష్మణరావు, వైభవ్ రమణ, కొప్పిశెట్టి బుజ్జి, చినతాతారావు, తుంపాల నాగేశ్వరరావు, గుర్రం రామకృష్ణ పాల్గొన్నారు.