Vizag Beach: శ్వేత మృతిపై వీడని మిస్టరీ.. ఇంట్లో లెటర్ దొరికినా డౌట్ ఎందుకొస్తుందంటే..
ABN , First Publish Date - 2023-04-27T03:03:59+05:30 IST
నగరంలోని ఆర్కే బీచ్‌లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు
భర్త, అత్తింటి వారి వేధింపులే కారణం: తల్లి
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహంపై లో దుస్తులు మాత్రమే ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి రాసిన సూసైడ్ నోట్‌ను బట్టి భర్తతో మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి త్రీటౌన్ సీఐ కె.రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దొండపర్తి ప్రాంతానికి చెందిన శ్వేత (24)కు పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతానికి చెందిన గులివెల్లి మణికంఠతో గత ఏడాది ఏప్రిల్ 22న వివాహమైంది.
మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా ఇంటి వద్ద నుంచే (వర్క్ ఫ్రమ్ హోమ్) పనిచేస్తున్నాడు. భార్య, తల్లిదండ్రులతో కలిసి నెల్లిముక్కులో ఉంటున్నాడు. పదిహేను రోజుల కిందట ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్లాడు. శ్వేత మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసింది. ఫోన్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. రాత్రి ఏడు గంటల సమయంలో శ్వేత ఇంట్లోనే ఫోన్‌ను వదిలిపెట్టి తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వచ్చిన పుష్పలత, శాంతారావు ఇంటికి తాళం వేసి ఉండడం, కోడలికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. రాత్రి పది గంటల సమయంలో న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ ఎదురుగా తీరంలో ఒక యువతి మృతదేహం ఇసుకలో కూరుకుపోయి ఉనట్టు బీచ్‌పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. న్యూపోర్ట్ పోలీసులు శ్వేతగా గుర్తించి అత్తమామలకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. ఇంట్లో శ్వేత రాసినట్టుగా ఒక సూసైడ్ నోట్ లభ్యం కావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, గృహహింస వంటి సెక్షన్లపై కేసు నమోదుచేసినట్టు సీఐ రామారావు తెలిపారు. కాగా చనిపోయిన శ్వేత ఐదు నెలల గర్భిణి.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
‘నాకు ఎప్పుడో తెలుసు. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవు అని. ఎనీవే ‘ఆల్ ది బెస్ట్’ ఫర్ యువర్ ‘ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్’. చాలా మాట్లాడడానికి ఉన్నా.. ఏమీ మాట్లాడట్లేదు. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యూ నో ఎవ్రీథింగ్. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’.
అత్తింటివారే బలి తీసుకున్నారు: మృతురాలి తల్లి
నా కుమార్తెను అత్తింటివారే బలి తీసుకున్నారు. భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచులు నిత్యం వేధించేవారు. గర్భవతి అయిన తర్వాత కూడా వారి ప్రవర్తన మారలేదు. తరచూ ఫోన్ చేసి భర్త, అత్తింటి వేధింపుల గురించి చెబుతూ ఏడ్చేది. వచ్చేయమ్మా.. నేను చూసుకుంటానని ఎన్నోసార్లు చెప్పినా రాలేదు. చివరకు అందరూ కలిసి నా కుమార్తెను చంపేశారు.