వైసీపీ ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్స్‌కు...

ABN , First Publish Date - 2023-07-06T01:11:48+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరింది. నగరంలో పచ్చని చెట్లను కూల్చేసి...గ్రీన్‌బెల్ట్‌లో బస్‌ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది. కొన్నిచోట్ల పాత వాటిని కూల్చేసి.. మరికొన్నిచోట్ల పాత వాటి పక్కనే కొత్తగా నిర్మిస్తోంది. పైకి ఆధునిక హంగులతో కనిపిస్తున్న ఈ బస్‌ షెల్టర్లలో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవు. బస్సులకు సంబంధించిన సమాచారమూ లేదు. కానీ...ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలు, ప్రభుత్వ పథకాల ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది.

వైసీపీ ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్స్‌కు...

బస్‌ షెల్టర్‌లలో జగన్‌ బొమ్మలు, నవరత్నాలు లోగో

ఇందుకోసం నగరంలో

రూ.4.6 కోట్లతో 20 బస్‌ షెల్టర్‌ల నిర్మాణం

అన్నీ జాతీయ రహదారిపైనే నిర్మాణం

కొన్నిచోట్ల ఉన్నవాటిని కూల్చి,

మరికొన్నిచోట్ల పాత వాటి పక్కన నిర్మాణం

దశాబ్దాల నాటి చెట్లు కొట్టివేత

కనిపించని బస్సుల రాకపోకల సమాచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వానికి ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరింది. నగరంలో పచ్చని చెట్లను కూల్చేసి...గ్రీన్‌బెల్ట్‌లో బస్‌ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది. కొన్నిచోట్ల పాత వాటిని కూల్చేసి.. మరికొన్నిచోట్ల పాత వాటి పక్కనే కొత్తగా నిర్మిస్తోంది. పైకి ఆధునిక హంగులతో కనిపిస్తున్న ఈ బస్‌ షెల్టర్లలో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవు. బస్సులకు సంబంధించిన సమాచారమూ లేదు. కానీ...ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలు, ప్రభుత్వ పథకాల ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది.

రెండు నెలల క్రితం విశాఖలో జరిగిన జీ-20 సదస్సు పనుల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సమీపాన మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కొత్తగా ఒక బస్‌ షెల్టర్‌ నిర్మించింది. దానికి సుమారు రూ.40 లక్షలు వెచ్చించింది. ఆ బస్‌ షెల్టర్‌లో ప్రచారానికి వీలుగా కొన్ని బ్లాకులు ఏర్పాటుచేశారు. వాటిని ఎప్పటికప్పుడు మార్చుకునే వెసులుబాటు ఉంది. మొదట్లో జీ-20 సదస్సు గురించి అక్కడ పోస్టర్లు ప్రదర్శించారు. ఇప్పుడు సీఎం జగన్‌ చిత్రం, జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ వంటివి ప్రదర్శిస్తున్నారు. బస్‌ షెల్టర్‌పైన ‘నవరత్నాలు’ లోగో ముద్రించారు. పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు అంతా ఈ బస్‌ షెల్టర్‌ను చూసి మెచ్చుకోవడంతో ఆ ప్రచారాన్ని జాతీయ రహదారిపై చేపట్టాలని ఇటీవల నిర్ణయించారు.

రూ.4.6 కోట్లతో 20 బస్‌ షెల్టర్‌ల నిర్మాణం

విశాఖ నగరంలో సుమారు వేయి కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉండగా అందులో 382 కి.మీ. పరిధిలో ఆర్టీసీ 564 సిటీ బస్సులు నడుపుతోంది. నగరంలో సుమారుగా 400 బస్టాప్‌లు ఉన్నాయి. వాటిలో జాతీయ రహదారిపై ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి వెంకోజీపాలెం వరకు గల 20 బస్‌ షెల్టర్‌లను పునర్నిర్మిస్తున్నారు. అది కూడా ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లోని బస్టాప్‌లనే ఎంచుకున్నారు. ఒక్కో దానికి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

ఉన్నచోటే మళ్లీ నిర్మాణం

విశాఖను స్మార్ట్‌ సిటీగా 2019లో ఎంపిక చేసినప్పుడు ఈ విధంగానే 44 బస్‌ షెల్టర్‌లను అభివృద్ధి చేశారు. వాటిలో పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ కూడా అమర్చారు. సీసీ కెమెరాలు పెట్టారు. బయో టాయ్‌లెట్లు పెడతామని చెప్పినా ఏర్పాటు చేయలేదు. ఆ బస్‌ షెల్టర్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కళావిహీనమైపోయాయి. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ను అధికారులు ఉపయోగించడం లేదు. ఇప్పుడు జాతీయ రహదారిపై ఇప్పటికే ఉన్న బస్‌ షెల్టర్‌లను కూలగొట్టి మళ్లీ కొత్తవి నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల పాత బస్‌ షెల్టర్‌ పక్కనే కొత్తవి నిర్మిస్తున్నారు. పోర్టు హాస్పిటల్‌ వద్ద ఇప్పటికే రెండు బస్‌ షెల్టర్‌లు పక్కపక్కనే ఉండగా కొత్తగా మూడోది నిర్మిస్తున్నారు.

భారీవృక్షాల నరికివేత

జాతీయ రహదారిని ఆనుకొని గ్రీన్‌బెల్ట్‌లో భారీవృక్షాలు ఉన్నాయి. ఇప్పుడు బస్‌ షెల్టర్ల కోసం ఆ వృక్షాలను నరికేశారు. అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, గురుద్వారా ప్రాంతాల్లో ఇలా భారీ వృక్షాలను నేలకూల్చారు.

బస్సుల సమాచారం నిల్‌

ప్రయాణికుల కోసం ఏర్పాటుచేస్తున్నామని చెబుతున్నా...అత్యంత ముఖ్యమైన బస్సుల సమాచారమే అందుబాటులో లేకుండా వీటిని నిర్మిస్తున్నారు. గతంలో బస్టాపుల్లో ఆ రూట్‌లో తిరిగే బస్సుల నంబర్లు, అవి ఆ స్టాపునకు వచ్చే సమయాలను బోర్డులపై ప్రదర్శించేవారు. ఇప్పుడు ఆ సమాచారం మచ్చుకు కూడా లేదు. అందుకు ఏర్పాట్లు లేవు. జగన్‌ బొమ్మ, నవరత్నాలు, ప్రభుత్వ పథకాల వివరాలు ప్రదర్శించేందుకు మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు.

సౌకర్యాలు శూన్యం

అధునాతన బస్‌ షెల్టర్‌లలో సీలింగ్‌ ఫ్యాన్లు, తాగడానికి మంచినీరు, బయో టాయ్‌లెట్లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఇప్పటికే ఏర్పాటుచేసిన బస్‌ షెల్టర్‌లలో అవేమీ లేవు. కేవలం కూర్చోడానికి గ్రానైట్‌ పలకలు మాత్రమే వేస్తున్నారు. గట్టిగా వర్షం పడితే ప్రయాణికులు తడిచిపోయేలా ఉంటున్నాయి. ప్రయాణికుల కోసం గాకుండా ప్రభుత్వ ప్రచారం కోసమే వీటిని నిర్మిస్తున్నట్టుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-07-06T01:11:48+05:30 IST