ఉన్నవి లక్ష మెట్రిక్‌ టన్నులు

ABN , First Publish Date - 2023-02-05T23:54:22+05:30 IST

పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పారు. సంక్రాంత్రి తరువాత కొనుగోళ్లు ప్రారంభిస్తామని నమ్మబలికారు. కానీ నెలరోజులు సమీపిస్తున్నా అతీగతీలేదు. ఇప్పుడేమో లక్ష్యానికి మించి కొనుగోలు చేయలేమని చెబుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి?’...జిల్లాలో వేలాది మంది రైతుల ఆవేదన ఇది. ఈ ఖరీఫ్‌లో 1,71,762 ఎకరాల్లో వరి సాగుచేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఉన్నవి లక్ష మెట్రిక్‌ టన్నులు
కల్లంలో ధాన్యం రాశులు

ఉన్నవి లక్ష మెట్రిక్‌ టన్నులు

అనుమతులు 20 వేల టన్నులకు!

ధాన్యం అదనపు కొనుగోళ్ల లక్ష్యంలో భారీగా కొత

ఇంకా రైతుల కల్లాల్లోనే నిల్వలు

ఆందోళనలో అన్నదాతలు

ప్రభుత్వ నిర్ణయంపై ఆవేదన

(పార్వతీపురం, ఆంధ్రజ్యోతి)

‘పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పారు. సంక్రాంత్రి తరువాత కొనుగోళ్లు ప్రారంభిస్తామని నమ్మబలికారు. కానీ నెలరోజులు సమీపిస్తున్నా అతీగతీలేదు. ఇప్పుడేమో లక్ష్యానికి మించి కొనుగోలు చేయలేమని చెబుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి?’...జిల్లాలో వేలాది మంది రైతుల ఆవేదన ఇది. ఈ ఖరీఫ్‌లో 1,71,762 ఎకరాల్లో వరి సాగుచేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 3,18,089 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 1,91,240 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ప్రాప్తికి కొనుగోలు పూర్తిచేసినట్టు చెబుతున్నారు.కానీ తమ వద్ద లక్ష మెట్రిక్‌ టన్నులు ఉండిపోయాయని..వాటిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం అందుకు తగ్గట్టుగా ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకోలేదు. అధికారులు చెబుతున్న గణాంకాల ప్రకారం ఇంకా రైతుల వద్ద 1,26,089 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే విత్తనాలు, అవసరాలకు 26 వేల మెట్రిక్‌ టన్నులు పోనూ.. ఇంకా లక్ష మెట్రిక్‌ టన్నులు ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 20 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకే అవకాశమిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

ఏటా ఇదే పరిస్థితి

ఏటా వరి పండించే రైతుకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచే ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తీరా ఆ సమయానికి వచ్చేసరికి చతికిలపడుతోంది. ఈ ఏడాది ధాన్యం విక్రయించేందుకు రైతులు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. ఒక మండలం రైతులకు వేరే మండలాల్లో మిల్లులను కేటాయించారు. తూకం, ట్రక్‌ షీట్లు వంటి వాటితో రైతులకు వ్యయప్రయాసలు కల్పించారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో ధాన్యం దిగుబడి ఉంటుందని తెలుసు. అధికారులు ముందుగా అంచనా వేసుకున్నా.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రైతుల వద్ద లక్ష మెట్రిక్‌ టన్నులు ఉంటే..ప్రభుత్వం మాత్రం 20 వేల టన్నులకే అనుమతివ్వడంతో దళారులను ఆశ్రయించాల్సిన అనివార్య పరిస్థితులు రైతులకు ఎదురవుతున్నాయి. దీంతో వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యాన్ని అడుగుతున్నారు. దీంతో రైతులకు నష్టం తప్పడం లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉన్నా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించి ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని రైతులు కోరుతున్నారు.

బాధాకరం

మా దగ్గర ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. అధికారులు కొనుగోలు చేయలేమని చెబుతున్నారు. ఇప్పుడు మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? ఏటా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. కష్టపడి పండించిన పంటను విక్రయించుకోలేని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి.

-బోను శివన్ననాయుడు, గరుగుబిల్లి

(ఫోటో రైటప్‌. నెంబర్‌ 2)

వ్యయప్రయాసలు

కల్లంలో ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వాటిని సంరక్షించేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నాం. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొనుగోలు ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు అరకొరగానే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

-పెద్దింటి గౌరమ్మ, గొట్టివలస

Updated Date - 2023-02-05T23:54:23+05:30 IST