జయమంగళ జంపింగ్‌

ABN , First Publish Date - 2023-02-14T00:43:46+05:30 IST

కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీ ఫిరాయించారని రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది.

జయమంగళ జంపింగ్‌
అల్లూరులో ఆయన వున్న ఫ్లెక్సీలో ముఖానికి నల్ల రంగు పులిమిన తెలుగు యువత నేతలు

కైకలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ ఆఫర్‌

జగన్‌తో మంతనాలు, స్పష్టమైన హామీ

2+2 గన్‌మెన్‌తో ఇంటికి.. ఆపై టీడీపీపై విసుర్లు

సీటు రాదనే భయంతోనేనంటూ ప్రచారం

పోతే పోనీ అనే ధోరణిలో టీడీపీ అధిష్టానం

కొల్లేరు కాంటూరును ప్లస్‌ 5 నుంచి ప్లస్‌ 3కి తగ్గించాలి. ఇక్కడి ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించాలి. వీటన్నింటికి ఓకే అంటే.. అప్పుడు పార్టీ మార్పుపై ఆలోచిస్తా.

– ఆదివారం రాత్రి విలేకరులతో..

నేను ప్రస్తుతం తెలుగుదేశంలోనే ఉన్నాను. పార్టీ మారితే ప్రజలు, నా అనుచరులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాను.

– సోమవారం విలేకరుల సమావేశంలో..

కానీ, అంతకు ముందే.. తాడేపల్లి ప్యాలెస్‌లో ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి జయమంగళ సీఎం జగన్‌ను కలిశారు. ‘ఎమ్మెల్సీ ఇస్తున్నాం. జాగ్రత్తగా పనిచేయాలి’ అనే సూచనలు అందుకుని నలుగురు గన్‌మెన్‌తో కలిసి ఇంటికి వచ్చారు. పార్టీ మార్పునకు ఇంతకుమించి సంకేతం ఇంకేం కావాలి? దీనికింత డొంక తిరుగుడు ఎందుకు ? ఇదీ టీడీపీ ప్రశ్న.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీ ఫిరాయించారని రెండు రోజులుగా ప్రచారం సాగుతోం ది. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీపై అభాండాలు మోపుతూ, పార్టీ టిక్కెట్‌ ఇవ్వరేమోననే ఈ నిర్ణయమంటోన్న ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు గుర్రుమంటున్నారు. పార్టీ లో చురుగ్గా వ్యవహరించలేకపోతున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే కొన్నాళ్లుగా అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలోకి వెళుతున్న ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు నాయకులకు, ఇటు కార్యకర్తలకు అందుబాటులో లేరు. తాడేపల్లి ప్యాలెస్‌లో మిథున్‌రెడ్డి ఉండగా జయమంగళ జగన్‌ను కలిశారు. ఎమ్మెల్సీ ఇస్తున్నానని, జాగ్రత్తగా పనిచేయాలని ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. రాత్రికి నలుగురు గన్‌మెన్లతో ఇంటికి చేరుకున్నారని తెలుసుకున్న టీడీపీ నాయకులకు దీంతో ఒక స్పష్టత వచ్చింది. ఎపుడు వదిలించుకుందామా? అని ఎదురుచూస్తోన్న తరుణంలో తనంతట తానే బయటకు వెళ్లిపోవడంపై పార్టీ కార్యకర్తలు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. అటు అధిష్టానం నుంచి పెద్దగా స్పందన లేదు.

యాక్సిడెంట్‌ హైడ్రామా

కొద్ది రోజుల క్రితం భీమవరం నుంచి కైకలూరుకు వస్తోన్న తరుణంలో జయమంగళ ప్రయాణిస్తోన్న కారుకు చిన్నపాటి ప్రమాదం జరిగింది. అది యాధృచ్చికంగా జరిగింది కాదని, తనపై హత్యాయత్నం చేశారని ఆరోపిం చారు. ప్రత్యేకంగా విలేకరులతోనూ మాట్లాడిన అనంతరం ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మకు ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలోనే తనకు భద్రతను ప్రభుత్వం కల్పించిందని ఆయన సోమవారం విలేకరులకు చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పలుమార్లు తమకు వ్యక్తిగత ప్రమాదం పొంచి ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని భద్రత కోరుతున్నారు. వాటిని పట్టించుకోని అధికార పార్టీ ఒక్క జయమంగళకే రోజుల వ్యవధిలో ఎందుకు స్పందించారన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడం లేదు.

టీడీపీ అభ్యర్థి ఎవరు ?

జయమంగళ తప్పుకోవడంతో టీడీపీ అభ్యర్థిగా కైకలూరు స్థానానికి ఇప్పటికే నియోజకవర్గంలో పోటీ పెరిగింది. దీనిపై పలువురు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పొత్తులు కొనసాగితే బీజేపీ తరపున మాజీ మంత్రి కామి నేని శ్రీనివాస్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన వైసీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తారనే భావన ఉంది. తర్వాత మాజీ ఎంపీ మాగంటి బాబు, పిన్న మనేని వెంకటేశ్వరరావు, బీకేఎం నాని ఇలా వరుసలో చాలా మంది ఉన్నా రు. ఆర్థికంగా, ఆరోగ్యంగా బలహీనపడ్డ తరుణంలో ఏదో ఒక నామినేటెడ్‌ పోస్టు కోసం తహతహలాడటంలో ఆశ్చర్యమేమీ లేదని పలువురు టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి టీడీపీ అభ్యర్థిగా ప్రకటిం చినా ఆయన నిలదొక్కుకోలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పోటీచేసినా ఓడిపోతారనే భయంతోనే ఆయన ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. ఆ విష యాన్ని బహిరంగంగా చర్చించలేకే స్థానికంగా ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారో తెలియని క్రమంలోనే తాను ఆ నిర్ణయం తీసుకోబోతున్నానని తెలిపినట్లు సమాచారం.

టీడీపీ అండతో..

కామినేని శ్రీనివాస్‌ ప్రధాన శిష్యుడిగా 1999లో టీడీపీలో చేరిన జయ మంగళ అనంతరం 2000–2005 వరకు కైకలూరు జడ్పీటీసీగా గెలిచారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. టీడీపీ చొరవతో 2009లో కైకలూరు నుంచి పోటీ చేసి 830 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో ఆయన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన కామినేని ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2014లో టీడీపీ–బీజేపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్‌ అక్కడ పోటీ చేయగా 21,300 ఓట్లపైగా మెజారిటీతో విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జయమంగళ 9 వేల 470 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో మారబోయే రాజకీయ పరిణామంలో ఆ సీటు తనకు కాకుండా ఎవరికి ఇస్తారో అర్థం కాకే ఆయన తన దారి వెతుక్కున్నారనే ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు.

జగన్‌ హామీ ఇచ్చాకే..

గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు

ఆదివారమే జగన్‌ను జయమంగళ కలిశారు. హామీ ఇచ్చిన తర్వాతే మా పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఒక్క కార్యకర్త కూడా ఆయనతో వెళ్లే పరిస్థితి లేదు. పోటీ చేయలేని క్రమంలో ఆయన దారి ఆయన చూసుకున్నాడు. కైకలూరు మాగంటి బాబు నివాసంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.

Updated Date - 2023-02-14T00:43:48+05:30 IST