జన స్వాగతం
ABN , First Publish Date - 2023-08-25T01:04:52+05:30 IST
కంచు కాగడాలు, భారీ గజమాలలు, డప్పు వాయిద్యాలు, అభిమానులు, కార్యకర్తల జయజయధ్వానాల మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ గురువారం రాత్రి 8.25 గంటలకు కృష్ణా జిల్లా నుంచి నూజివీడు మండలం మీర్జాపురం మీదుగా ఏలూరు జిల్లాలోకి అడుగుపెట్టారు.

గజమాలలు, కంచు కాగడాలు, జేజేల మధ్య
ఏలూరు జిల్లాలోకి లోకేశ్ ప్రవేశం
రాత్రి 8.25 గంటలకు మీర్జాపురంలోకి యువగళం
గొల్లపల్లి సరిహద్దుల్లో యువనేత బస
ఏలూరు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కంచు కాగడాలు, భారీ గజమాలలు, డప్పు వాయిద్యాలు, అభిమానులు, కార్యకర్తల జయజయధ్వానాల మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ గురువారం రాత్రి 8.25 గంటలకు కృష్ణా జిల్లా నుంచి నూజివీడు మండలం మీర్జాపురం మీదుగా ఏలూరు జిల్లాలోకి అడుగుపెట్టారు. పది వేల మంది కార్యకర్తలు, అభిమానులతో మీర్జాపురం – గొల్లపల్లి పంచాయతీ రహదారులు కిక్కిరిసిపోయాయి. అడుగడుగునా లోకేశ్‌కు జేజేలు పలుకుతూ ఆయన వెంటే పాదం కలిపారు. పాదయాత్ర రెండున్నర కిలోమీటర్ల మేర ముందుకు సాగి గ్రామ సరిహద్దుల్లోని గొల్లపల్లి వద్ద రాత్రి బస చేశారు. విశ్రాంతి నిమిత్తం ఆయన 9.10 గంటలకు కాన్వాయ్‌లోకి వెళ్లారు. పార్టీ కార్యకర్తలు లోకేశ్‌ను కలుసుకునేందుకు భారీగా తరలివచ్చారు. భద్రతా కారణాల రీత్యా లోకేశ్ బయటకు రావడం సరికాదంటూ పోలీసులు వారించడంతో కార్యకర్తలు సద్దుమణిగారు. లోకేశ్ బస చేసిన ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాల్లో అభిమానులు, కార్యకర్తలు, ఇతరుల సౌకర్యార్థం భోజనాల ఏర్పాట్లు జరిగాయి. లోకేశ్‌కు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఘంటా మురళి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గోరుముచ్చు గోపాల్ యాదవ్ తదితరులు ఆయనకు జిల్లా సరిహద్దుల్లో ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా నుంచి మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
రైతుల కష్టాలు తీరుస్తాం : లోకేశ్ హామీ
నూజివీడు, ఆగస్టు 24 : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కష్టాలు తీరుస్తామని, లోకేశ్ మీర్జాపురం రైతులకు హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర మీర్జాపురానికి చేరుకోగానే గ్రామ ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ గ్రామ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. గ్రామంలోని వున్న పెద్దచెరువును స్టోరేజ్ ట్యాంక్‌గా మార్చడానికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందని రైతులు వివరించారు. ఈ చెరువు నిండితే నూజివీడు, ముసునూరు, బాపులపాడు, పెదపాడు మండలాల్లోని 45 గ్రామాలకు భూగర్భజలాలు పెరిగి సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లోవున్న చెరువు పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిపై స్పందించిన లోకేశ్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి రూ.18,250 కోట్లు ఖర్చు చేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తిరిగి అధికారంలోకి రాగానే మీర్జాపురం పెద్దచెరువును స్టోరేజ్ ట్యాంక్‌గా అభివృద్ధి చేసి నాలుగు మండలాల రైతుల సాగు, తాగునీటి కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
విభేదాలను పక్కనబెట్టి
నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చిన్నచిన్న విభేదాలు ఉన్నప్పటికి వాటిని అన్నింటిని పక్కన పెట్టి తెలుగు తమ్ముళ్లు లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడానికి కలిసికట్టుగా భారీ ఏర్పాట్లుచేశారు. పార్టీ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నేతృత్వంలో మండలాల వారీగా పార్టీ నాయకులు స్వాగత ఏర్పాట్లు, పాదయాత్రలో పాల్గొనే కార్యకర్తలు, ప్రజలకు అవసరమైన తాగునీరు, అల్పాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆహార సదుపాయం ఏర్పాట్లను అట్లూరి రమేష్ మూడుచోట్ల, అట్లూరి రవీంద్ర ఒకచోట నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర మూడు రోజులపాటు మొత్తం 43 కిలోమీటర్ల మేర సాగనున్నది. నూజివీడు టీడీపీలోనిస్వల్ప విభేదాలకు లోకేశ్ పాదయాత్రతో స్వస్తి పలకడానికి జిల్లా నేతలు రంగం సిద్ధం చేశారు. రెండో రోజు పర్యటనలో రాత్రి విడిది కేంద్రం వద్ద ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటే శ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు వర్గంతో లోకేశ్ సమావేశమై వారిమధ్య ఉన్న విభేదాలను పరిష్కరించనున్నట్టు సమాచారం. 26న ముసునూరు మండలం సింహాద్రిపురం వద్దకు చేరే సరికి పాద యాత్ర 2,600 కిలోమీటర్లు పూర్తి చేసుకో నుంది. దీనికి గుర్తుగా ఆ గ్రామం వద్ద మైల్‌స్టోన్‌ను నిర్మిస్తున్నా రు. లోకేశ్ దానిని ప్రారంభిస్తారు.
తర్వాత చింతలపూడి, పోలవరం
నూజివీడులోని రెండు మండలాల్లో 43 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగుతుందని టీడీపీ జిల్లా అధ్య క్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. తర్వాత చింతల పూడి, పోలవరం నియోజకవర్గాల్లో ఐదు రోజులపాటు 82 కిలోమీటర్లు మేర చింతలపూడి, టి.నరసాపురం, బొర్రంపా లెం, రావికంపాడు, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పొంగుటూరు వరకు యాత్ర సాగుతుందని వివరించారు.
పాదయాత్రకు తరలిన పార్టీ శ్రేణులు
నూజివీడు టౌన్/చాట్రాయి/ ముసునూరు : యువ గళం పాదయాత్రలో లోకేశ్‌కు ఘన స్వాగతం పలికేందుకు నూజివీడు, చాట్రాయి, ముసునూరు మండలాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలి వెళ్లాయి. మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా వెళ్లారు. మాజీ జడ్పీటీసీ పౌల్‌రాజు తదితరులు పాల్గొ న్నారు. చాట్రాయి మండలం నుంచి నాయకులు, కార్య కర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా తరలివెళ్లారు. ముసునూరు, చెక్కపల్లి, కాట్రేనిపాడు, గోప వరం, గుడిపాడు, రమణక్కపేట తదితర గ్రామాల నుంచి వందలాది మంది ర్యాలీగా వెళ్లారు.
రేపు రచ్చబండ
26న ముసునూరులో గ్రామ సమస్యలపై లోకేశ్ రచ్చ బండ నిర్వహించనున్న దృష్ట్యా స్థల ప్రాంగణాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి గద్దె రఘు బాబు తదితరులు పరిశీలించారు.
టు డే.. టూర్ షెడ్యూలు
ఉదయం 8 గంటలకు మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9 గంటలకు గొల్లపల్లిలో స్థానికులతో సమావేశం.
10 గంటలకు మొరసపూడిలో ముస్లిం సామాజిక వర్గీయులతో భేటీ.
మధ్యాహ్నం 12 గంటలకుతుక్కులూరులో ఎస్సీ సామాజిక వర్గీయులతో సమావేశం.
12.45 గంటలకు నూజివీడు శివార్లలో భోజన విరామం.
సాయంత్రం 4 గంటలకు నూజివీడు శివారు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 గంటలకు నూజివీడు తొమ్మిదో వార్డులో మామిడి రైతులతో ముఖాముఖి.
6.30 గంటలకు చిన్నగాంధీబొమ్మ వద్ద స్థానికులతో సమావేశం.
6.40 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్య వైశ్యులతో సమావేశం.
6.55 గంటలకు పెద్ద గాంధీ బొమ్మ వద్ద హమాలీ వర్కర్లతో సమావేశం.
రాత్రి 7.25 గంటలకు ఎంప్లాయీస్ కాలనీలో స్థానికులతో మాటామంతీ.
9.25కు పోతిరెడ్డిపల్లిలో బస.