Yanamala Ramakrishnudu : సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని చంద్రబాబును అరెస్ట్ చేయించారు
ABN , First Publish Date - 2023-09-11T13:09:49+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబును ఆర్థిక నేరస్థుడిగా చిత్రీకరించేందుకు వైసీపీ యత్నిస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అసలు ఆర్థిక నేరస్థుడు ఎవరని యనమల ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి జగన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నారన్నారు.
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబును ఆర్థిక నేరస్థుడిగా చిత్రీకరించేందుకు వైసీపీ యత్నిస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అసలు ఆర్థిక నేరస్థుడు ఎవరని యనమల ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి జగన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నారన్నారు. జగన్ రెడ్డి రూ.43వేల కోట్ల అవినీతి చేశారని సీబీఐ తేల్చిందని... ఇవన్నీ ఆర్థిక నేరాలేనని యనమల అన్నారు. క్విడ్ ప్రో కో ద్వారా రాష్ట్ర సంపదను దోచేసిన వ్యక్తి ఆర్థిక నేరస్థుడా? లేక నిజాయతీగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తా? అని ప్రశ్నించారు.
ఆర్థిక నేరస్థులు హత్య చేసిన వారికంటే ప్రమాదకరమని సుప్రీం వ్యాఖ్యానించిందన్నారు. 2019లో జగన్ రెడ్డి అధికారం చేపట్టి రూ.2.50 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. 16 నెలలు జైలులో ఉండటంతో చంద్రబాబును కూడా ఒక్కరోజైనా జైలులో పెట్టాలనే ఆత్రుత తప్ప కేసులో పస లేదన్నారు. సీఐడీ వాళ్లు ఇచ్చిన రిపోర్ట్ ఫ్యాబ్రికేటెడ్ అని పేర్కొన్నారు. సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని చంద్రబాబును అరెస్ట్ చేయించారని యనమల విమర్శించారు.