క్లిష్ట పరిస్థితులున్నా.. వృద్ధి బాటలోనే..
ABN , First Publish Date - 2023-02-01T04:15:29+05:30 IST
భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా కొన్ని కిష్ట పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని 2022-23 ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది..
2022-23 ఆర్థిక సర్వే
కరెంట్ ఖాతా లోటు కట్టుతప్పే ప్రమాదం
దీర్ఘకాలం అధిక వడ్డీ రేట్ల ముప్పు
ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి
అంతర్జాతీయంగా కఠిన ద్రవ్య విధానాలు కొనసాగే అవకాశం
ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 7%
2023-24లో వృద్ధి రేటు 6-6.8ుకి తగ్గే చాన్స్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా కొన్ని కిష్ట పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని 2022-23 ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. వృద్ధి రేటు 6-6.8 శాతం స్థాయికి మందగించే ఆస్కారం ఉన్నదని స్పష్టం చేసింది. అయినప్పటికీ భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. ఆర్థిక సర్వే ప్రకటించిన వృద్ధి రేటు అంచనా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకటించిన అంచనా 6.1 శాతం కన్నా మెరుగ్గానే ఉంది. ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లు ఎగుమతులను దెబ్బ తీయవచ్చని పేర్కొంది. బుధవారం బడ్జెట్ ప్రతిపాదనకు పూర్వరంగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంటుకు సమర్పించారు. 2020 సంవత్సరం నుంచి మూడు షాక్‌లు ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనాల్సి వచ్చిందని సర్వే తెలిపింది. కొవిడ్ సంబంధిత మందగమనం ఒకటి కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ స్థాయిలో ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా విభిన్న దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి వడ్డీ రేట్లు పెంచడం ఆ మూడు షాక్‌లని అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కొన్ని దశాబ్దాల గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోయినందు వల్ల దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాలు కొనసాగించవచ్చని, ఫలితంగా వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. అయితే ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉండవచ్చన్న అంచనా మరీ ఎక్కువేమీ కాదని తేల్చిచెప్పింది. ఇది ప్రైవేటు వినియోగాన్ని దెబ్బ తీసే ఆస్కారం గాని, పెట్టుబడి ఆకాంక్షలను బలహీనపరిచే ఆస్కారం గానీ లేదని పేర్కొంది. ఇప్పటికే రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు చేరిన విషయాన్ని గుర్తు చేసింది. విభిన్న అంశాలపై ఆర్థిక సర్వే ఏమందంటే...?
క్యాడ్ 4.4 శాతం
కరెంట్ ఖాతా లోటు (క్యాడ్)పై గట్టి నిఘా తప్పదు. ప్రపంచ విపణిలో కమోడిటీ ధరలు అధిక స్థాయిల్లో ఉన్నందు వల్ల క్యాడ్ పెరుగుదల కొనసాగవచ్చు. ప్రపంచ వృద్ధి రేటు, వాణిజ్యం ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రపంచ మార్కెట్ పరిమాణాన్ని కుంచించిన నేపథ్యంలో ఎగుమతి ప్రోత్సాహకాలు కుదించక తప్పకపోవచ్చు. ప్రపంచ వృద్ధి రేటు నిస్తేజంగా ఉన్నందు వల్ల రెండు సానుకూలతలు మాత్రం ఉన్నాయి. అవి క్రూడాయిల్ ధరలు తక్కువ స్థాయిలో ఉండడం, క్యాడ్ ప్రస్తుతం వేస్తున్న అంచనాల కన్నా మెరుగైన స్థాయిలో ఉండడం. సెప్టెంబరు చివరి నాటికి క్యాడ్ జీడీపీలో 4.4 శాతం ఉంది.
స్టార్ట్‌పలకు మరిన్ని ప్రోత్సాహకాలు
భారతీయుల యాజమాన్యంలోని స్టార్ట్‌పలు తమ తయారీ కార్యకలాపాలు తిరిగి దేశంలో చేపట్టేలా చేయాలంటే నిబంధనలు, విధివిధానాలు మరింత సరళం చేయాలి. చాలా స్టార్ట్‌పలు ఇప్పటికీ కొన్ని నిధుల సమీకరణ, ఆదాయాల కల్పన పరంగానే కాకుండా తమకు మద్దతుగా నిలిచే మౌలిక వసతులు తగినంతగా అందుబాటులో లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంతో పాటు స్టార్ట్‌పలకు ఇంటర్-మినిస్టీరియల్ బోర్డ్ సర్టిఫికేషన్ జారీ, ఈసా్‌పలపై పన్ను విధానం సరళీకరణ, బహుళ అంచెల పన్ను వ్యవస్థ సరళీకరణ, పన్ను వివాదాల కారణంగా ఏర్పడే అస్థిరతల తొలగింపు వంటి చర్యలు చేపట్టడం తప్పనిసరి.
తయారీకి ఉత్తేజం
విదేశీ కంపెనీలన్నీ తమ తయారీ విభాగాలు ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకోగల స్థాయిలో నిలపాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రపంచ తయారీ కేంద్రంగా అవతరించగల సమర్థత భారతదేశానికి ఉంది. ప్రస్తుతం భారత తయారీ రంగం జీడీపీలో 15-16 శాతం వాటా కలిగి ఉంది. రాబోయే సంవత్సరాల్లో దాన్ని 25 శాతానికి మెరుగుపరిచే దిశగా ప్రస్తుతం కృషి జరుగుతోంది. మేక్ ఇన్ ఇండియా 2.0 ప్రధానంగా 27 రంగాలపై (15 తయారీ, 12 సర్వీస్) దృష్టిని కేంద్రీకరించింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం 14 రంగాలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కూడా అమలుపరుస్తోంది. ఈ పథకం భారత వస్తు తయారీదారులు అంతర్జాతీయ పోటీ సామర్థ్యాలు సాధించేందుకు, ఆధునిక టెక్నాలజీలు సమకూర్చుకునేందుకు అండగా నిలిచింది. ఇది ప్రధానంగా ఎంఎ్‌సఎంఈ రంగానికి ఒక వరంగా ఉంది. అలాగే ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్) ఎంఎ్‌సఎంఈలు ఆర్థిక నిరాశాపూరిత వాతావరణం నుంచి బయటపడేందుకు దోహదపడింది. ఈ పథకం మద్దతుతో 2022 జనవరి-నవంబరు నెలల మధ్య కాలంలో ఎంఎ్‌సఎంఈల రుణ వృద్ధి రేటు 30.6 శాతానికి చేరింది. ఎంఎస్‌ఎంఈలకు ఏర్పడిన ఉత్తేజం జీఎ్‌సటీ పన్ను వసూళ్లు పెరగడంలోనే ప్రతిబింబిస్తోంది. ఉద్యోగాల కల్పన, ఈపీఎ్‌ఫఓ ఖాతాల పెరుగుదల కూడా ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని సూచిస్తోంది.
పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వం ప్రస్తుతం షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్‌ఎండీసీ స్టీల్ లిమిటెడ్, బీఈఎంఎల్, హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్, సీసీఐ, విశాఖ ఉక్కు, ఐడీబీఐ బ్యాంకుల ప్రైవేటీకరణకు కృషి చేస్తోంది. వాటిలో వ్యూహాత్మక వాటాల విక్రయాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవి పూర్తికావచ్చు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నగదీకరణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఆస్తుల నగదీకరణ ద్వారా వచ్చే ఆదాయాలు ప్రభుత్వ రుణ భారం తగ్గించేందుకు వినియోగించినట్టయితే రుణ పరపతి పెరిగి తక్కువ వడ్డీలకే నిధులు సమీకరించే వెసులుబాటు కలుగుతుంది.
సంస్కరణలే బలం
గత 8 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకోగల శక్తిని అందించాయి. ఆర్థిక వృద్ధి వేగం కొనసాగించడంతో పాటు అధిక స్థాయిల్లో ఉండేలా చేసే దిశగా మరిన్ని సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉంది. లైసెన్సింగ్, ఇన్‌స్పెక్షన్, కంప్లయెన్సుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే దిశగా కొన్ని రకాల నియమ నిబంధనలను తొలగించడం, సరళం చేయడం వంటి చర్యలు రాబోయే కాలంలో కూడా కొనసాగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలపై దృష్టి సారించాలి. డిస్కమ్‌ల ఆర్థిక మనుగడను కాపాడేందుకు చర్యలు చేపట్టాలి.