రిలయన్స్‌ రికార్డు లాభం

ABN , First Publish Date - 2023-04-22T00:51:56+05:30 IST

ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) త్రైమాసిక లాభం మార్కెట్‌ వర్గాల అంచనాలను మించిపోయింది.

రిలయన్స్‌ రికార్డు లాభం

క్యూ4లో రూ.19,299 కోట్లుగా నమోదు

రూ.2.19 లక్షల కోట్లకు చేరిన ఆదాయం

ముంబై: ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) త్రైమాసిక లాభం మార్కెట్‌ వర్గాల అంచనాలను మించిపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) ఆర్‌ఐఎల్‌ ఏకీకృత నికర లాభం రూ.19,299 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఇదే కాలానికి నమోదైన రూ.16,203 కోట్ల లాభంతో పోలిస్తే 19 శాతం వృద్ధి కనబర్చింది. అంతేకాదు, కంపెనీ త్రైమాసిక లాభంలో సరికొత్త ఆల్‌టైం రికార్డు ఇది. ఆయిల్‌ టు కెమికల్స్‌ (ఓ2సీ) విభాగం వ్యాపారం భారీగా పుంజుకోవడంతో పాటు రిటైల్‌, టెలికాం వ్యాపారాలు నిలకడైన వృద్ధిని కనబర్చడం ఇందుకు దోహదపడింది. ఆదాయం విషయానికొస్తే, గడిచిన మూడు నెలలకు రూ.2.19 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాదిలో ఇదే సమయానికి ఆదాయార్జన రూ.2.11 లక్షల కోట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దాదాపు రూ.10 లక్షల కోట్ల ఆదాయంపై రూ.66,702 కోట్ల లాభం గడించింది. విభాగాల వారీగా ఆర్‌ఐఎల్‌ పనితీరుకు సంబంధించిన ముఖ్యాంశాలు..

రిలయన్స్‌ రిటైల్‌: జనవరి-మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 12.9 శాతం వృద్ధితో రూ.2,415 కోట్లకు చేరుకుంది. నిర్వహణ ఆదాయం 21.09 శాతం పెరుగుదలతో రూ.61,559 కోట్లుగా నమోదైంది. కంపెనీ కేంద్రాల్లోకి కస్టమర్ల తాకిడి మరింత పెరగడంతో పాటు మరిన్ని కొత్త విక్రయ కేంద్రాల ఏర్పాటు వ్యాపార వృద్ధికి దోహదపడింది. గత మూడు నెలల్లో రిలయన్స్‌ రిటైల్‌ కొత్తగా 2,844 స్టోర్లను ప్రారంభించింది. దాంతో, దేశవ్యాప్త సోర్లు 18,000 దాటాయి. గడిచిన 3 నెలల్లో 21.9 కోట్ల మంది కంపెనీ స్టోర్లను సందర్శించారని రిలయన్స్‌ రిటైల్‌ తెలిపింది. 2022-23 మొత్తానికి రూ.2,30,931 కోట్ల ఆదాయంపై రూ.9,181 కోట్ల లాభం నమోదైంది.

జియో ప్లాట్‌ఫామ్స్‌: టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సహా డిజిటల్‌ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందికి చేర్చి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం 15.6 శాతం వృద్ధితో రూ.4,984 కోట్లకు ఎగబాకింది. అందులో రిలయన్స్‌ జియో లాభం రూ.4,173 కోట్లుగా ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ ఆదాయం 14.4 శాతం పెరిగి రూ.25,465 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ విభాగ రాబడి రూ.లక్ష కోట్లు (రూ.1,15,099 కోట్లు) దాటింది. లాభం రూ.19,124 కోట్లుగా ఉంది. ఈ మార్చి 31 నాటికి రిలయన్స్‌ జియో మొత్తం కస్టమర్లు 43.93 కోట్లకు పెరిగారు. గడిచిన మూడు నెలల్లో కంపెనీకి ఒక్కో కస్టమరు నుంచి లభించిన సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.178.8కి పెరిగింది. 5జీ సేవల విస్తరణ కోసం 700, 3500 మెగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌లో ఇప్పటికే 60,000 టవర్లను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. దేశంలోని 2,300 నగరాలు, పట్టణాలకు 5జీ సేవలను విస్తరింపజేశామని, ఈ ఏడాది డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని కంపెనీ వెల్లడించింది.

ఓ2సీ: ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఓ2సీ విభాగ ఆదాయం 11.8 శాతం వృద్ధితో రూ.1,28,633 కోట్లకు చేరుకోగా.. ఎబిటా 14.4 శాతం పెరిగి రూ.16,293 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.5,94,649 కోట్ల ఆదాయంపై రూ.62,075 కోట్ల ఎబిటా నమోదైంది. చమురు శుద్ధిపై మార్జిన్‌ పుంజుకోవడంతో పాటు కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్‌ తగ్గించడంతో ఇంధన ఎగుమతులపై ఆదాయం పెరగడం ఇందుకు తోడ్పడింది.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌: గడిచిన మూడు నెలల్లో ఈ విభాగ ఆదాయం 126.9 శాతం వృద్ధితో రూ.4,556 కోట్లకు చేరుకోగా.. ఎబిటా 144.3 శాతం పెరుగుదలతో రూ.3,801 కోట్లుగా నమోదైంది. 2022-23 మొత్తానికి ఆదాయం రూ.16,508 కోట్లు, ఎబిటా రూ.13,589 కోట్లుగా ఉంది. ఏపీలోని కేజీ బేసిన్‌ డీ6 బ్లాక్‌ నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్‌కు గతంలో కంటే అధిక ధర లభించడంతో పాటు ఉత్పత్తి కూడా 13 శాతం పెరగడం ఆదాయ వృద్ధికి దోహదపడింది.

mukesh.jpg

కంపెనీకి చెందిన డిజిటల్‌, సంఘటిత రిటైల్‌ వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భారత్‌ శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచేందుకు తోడ్పడుతున్నాయి. రిలయన్స్‌ జియో దేశంలోని కోట్లాది మందికి డిజిటల్‌ సాధికారత కల్పిస్తోంది. 5జీ సేవలను ప్రారంభించిన 6 నెలల్లోనే 2,300కు పైగా నగరాలు, పట్టణాలకు విస్తరించగలిగాం. కాగా, విక్రయ కేంద్రాలు, డిజిటల్‌ వేదికల విస్తరణతో పాటు కస్టమర్ల తాకిడి అనూహ్యంగా పెరగడంతో రిటైల్‌ వ్యాపార పనితీరులో ఉత్తమ వృద్ధి నమోదైంది. ఈ విభాగం ఆఫర్‌ చేసే ఉత్పత్తులను కూడా పెంచుకుంటూ పోతోంది. ప్రపంచంలోని ఉత్తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించేందుకు కృషి చేస్తోంది. ఇకపోతే, అంతర్జాతీయ అనిశ్చితులు, కమోడిటీల సరఫరాలో అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలోనూ ఓ2సీ వ్యాపారం ఆల్‌టైం రికార్డు స్థాయి నిర్వహణ లాభాన్ని నమోదు చేసుకోగలిగింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ విభాగం కూడా అత్యంత బలమైన వృద్ధిని కనబర్చింది. దేశీయ గ్యాస్‌ ఉత్పత్తిలో కంపెనీ వాటా త్వరలో 30 శాతానికి చేరుకోనుంది. అంతేకాదు, ఆర్థిక సేవల వ్యాపారాన్ని విభజించి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేరుతో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలనుకుంటున్నాం. తద్వారా తమ షేర్‌ హోల్డర్లకు కొత్త సంస్థ వృద్ధిలో ప్రారంభం నుంచే పాలుపంచుకునే అవకాశం లభించనుంది. కొత్త ఇంధనాల విభాగం విషయానికొస్తే, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గిగా ఫ్యాక్టరీల ఏర్పాటు పురోగతిలో ఉంది.

- ముకేశ్‌ అంబానీ, చైర్మన్‌, ఎండీ, ఆర్‌ఐఎల్‌

Updated Date - 2023-04-22T00:52:42+05:30 IST