SBI: రెండు నెలల తర్వాత ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్తగా 400 రోజుల...
ABN , First Publish Date - 2023-02-16T18:17:43+05:30 IST
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ (SBI) తన ఖాతాదారులకు (Customers) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన పలు ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed deposits) వడ్డీ రేట్లను (Interest rates) 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 5 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెరిగినట్టు, సవరించిన రేట్లు ఫిబ్రవరి 15, 2023 నుంచే అమల్లోకి వచ్చినట్టు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. రూ.2 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు వర్తిస్తుందని వెల్లడించింది. కాగా చివరిసారిగా డిసెంబర్ 13, 2022న ఎంపిక చేసిన పలు ఫిక్స్డ్ డిపాజిట్లపై 65 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది. దాదాపు రెండు నెలల తర్వాత వడ్డీ రేట్లు పెంచడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.
కొత్తగా 400 రోజుల కాలపరిమితి..
400 రోజుల కాలపరిమితితో కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్‌ను ఎస్బీఐ ప్రవేశపెట్టింది. అయితే ఇది పరిమితికాలపు ఆఫర్. ఫిబ్రవరి 15, 2023న మొదలై మార్చి 31, 2023తో ముగిసిపోనున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.10 శాతం వడ్డీ రేటు వర్తించనుందని స్పష్టం చేసింది.
రూ.2 కోట్ల ఎఫ్డీపై వడ్డీ ఎంతంటే?
ఒక ఏడాది నుంచి రెండేళ్లలోపు మెచ్యూరిటీ తీరనున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచింది. ప్రస్తుత వడ్డీ రేటు 6.75 శాతం నుంచి 6.80 శాతానికి పెంచినట్టు వెల్లడించింది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇక రెండేళ్ల నుంచి మూడేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.75 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. అంటే 25 బేసిస్ పాయింట్ల పెరుగుదల నమోదయ్యింది. ఇక 3-10 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది.
సీనియర్ సిటిజన్ల ఎఫ్డీ రేట్లు ఇవే..
సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా ఎస్బీఐ పెంచింది. 1-2 ఏళ్ల మధ్య మెచ్యూరిటీ తీరిపోయే ఎఫ్డీలపై వడ్డీ రేటును స్వల్పంగా 7.25 శాతం నుంచి 7.30 శాతానికి పెంచింది. 2-3 ఏళ్ల ఎఫ్డీలపై 7.25 శాతం నుంచి 7.50 శాతానికి, 3-5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీని 6.75 శాతం నుంచి 7 శాతానికి, 5-10 ఏళ్ల ఎఫ్డీలపై 7.25 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది.
ఇది కూడా చదవండి...
వరుసగా రెండు రోజు తగ్గిన బంగారం ధరలు.. భారీగా అనలేం గానీ..