నరేంద్ర మోదీలో నవీన విద్యార్థి
ABN , First Publish Date - 2023-04-18T03:06:54+05:30 IST
పంజాబ్, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను 1995లో నరేంద్ర మోదీకి అప్పగించారు. అప్పటి వరకూ ఆ ఉభయ రాష్ట్రాల బీజేపీ బాధ్యతలను చేపట్టిన...

పంజాబ్, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను 1995లో నరేంద్ర మోదీకి అప్పగించారు. అప్పటి వరకూ ఆ ఉభయ రాష్ట్రాల బీజేపీ బాధ్యతలను చేపట్టిన ప్రతీ నాయకుడు ఉదయం ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లి ముఖ్యమైన నేతల్ని కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడి తిరిగిపోయేవారు. అయితే మోదీ చండీగఢ్‌లో తన కొత్త బాధ్యతలు చేపట్టగానే తాను అక్కడ నివాసం ఉండేందుకు ఒక గది కోసం అన్వేషించారు. నిజానికి అప్పుడు పార్టీ కార్యాలయమే ఒక చిన్నగదిలో ఉండేది. చివరకు ఆయన ఒక చిన్న ఔట్ హౌస్‌లో బస చేశారు. వచ్చీ రాగానే పార్టీ కార్యాలయంలో కంప్యూటర్‌ను ఏర్పాటు చేయించారు. అందులో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఓటర్ల సమాచారమంతా ఫీడ్ చేశారు. అక్కడి బీజేపీ శ్రేణులు కంప్యూటర్ చూడడం అదే మొదటిసారి. మోదీ వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ ఉభయ రాష్ట్రాలలోనూ పార్టీ పరిస్థితులు మారిపోయాయి. 1996 డిసెంబర్‌లో చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కూటమి 20 సీట్లలో 19 సీట్లు గెలుచుకుంది. తర్వాత చండీగఢ్ లోక్‌సభ నియోజకవర్గం కూడా బీజేపీ కైవశమైంది. ‘ఆధునికంగా కనిపించటం కంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవటమే చాలా ముఖ్యం. నీవు కంప్యూటర్ నేర్చుకోకపోతే కొద్ది రోజుల తర్వాత అంతా నిన్ను నిరక్షరాస్యుడుగా పరిగణించే ప్రమాదం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి’ అని ఆ రోజుల్లో ఆయన పార్టీ కార్యకర్తలకు పదే పదే చెప్పేవారు. 1997లో ఆయన హర్యానా రాష్ట్ర కార్యవర్గ సభ్యులను సమావేశపరిచి ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించాలో వారందరికీ నేర్పారు. అప్పటి వరకూ సంఘ్ పరివార్‌లో ఎవరూ అలాంటి ఆధునిక పరికరాలను ఉపయోగించిన దాఖలాలు లేవు. ఒకరోజు మోదీ చేతిలో శాటిలైట్ ఫోన్ చూసి అప్పటి హర్యానా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఖట్టర్ ఆశ్చర్యపోయారు. ఢిల్లీలో ఉన్నప్పుడు హరిశ్చంద్ర మాథుర్ లేన్‌లో ఒక ఎంపి నివాసంలో చిన్న గదిలో ల్యాప్‌టాప్‌కు ఇంటర్నెట్ సౌకర్యం సమకూర్చుకుని ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మోదీ తెలుసుకునేవారు.
ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేసుకునేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న తొలి నేతల్లో నరేంద్రమోదీ ఒకరు. ఆయనకు డిగ్రీ సర్టిఫికెట్ లేదని, పెద్దగా చదువుకోలేదని ఇవాళ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రపంచంలో ప్రభవిస్తున్న నవీన సాంకేతికతలను అవగాహన చేసుకోవడంలో నరేంద్రమోదీ రాజకీయ నాయకులలో మరెవ్వరి కంటే ముందుంటారనే విషయం చాలా మందికి తెలియదు. పార్టీని బలోపేతం చేసే విషయంలోనే కాదు, ఎన్నికల ప్రచారంలోనూ, ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ ఆధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టిన ఘనత మోదీకే దక్కుతుంది. మోదీ దూరదృష్టి వల్లే ఇవాళ కోట్లాది భారతీయులు డిజిటల్ టెక్నాలజీని ఆధునిక లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు. కూరగాయలు, పళ్ల రసాలు, కిరాణా షాపులు, ఆటో నడిపేవారి నుంచి విమాన ప్రయాణాలు, పెద్ద ఎత్తున బ్యాంకింగ్ లావాదేవీల వరకు డిజిటల్ మనీయే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోంది.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్– ఎఐ) గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన తీరు ఇటీవల ఆయనతో చర్చించిన అమెరికా వాణిజ్యమంత్రి గినా రాయిమొండోను సైతం దిగ్భ్రాంతి పరిచింది. ఎఐ విప్లవానికి భారత్, అమెరికాలు సారథ్యం వహించగలవని మోదీతో సమావేశమనంతరం ఆమె ప్రకటించారు. ఆమె ఇంకా ఇలా చెప్పారు: ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీతో గంటన్నరసేపు చర్చించే అద్భుతమైన అవకాశం లభించింది. ఆయన ప్రపంచంలో ఎందుకు అత్యంత జనాదరణ గల నేతగా గుర్తింపు పొందారో నాకు అర్థమైంది. ఆయన దూరదృష్టి ఎంత గొప్పదో తెలిసి అబ్బురం కలిగింది. భారత ప్రజల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం మాటల్లో వివరించలేము’. భారత్‌ను అగ్రరాజ్యంగా మార్చేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలు వాస్తవమైనవని, వాటి ఫలితాలు కనిపిస్తున్నాయని కూడా అమెరికా వాణిజ్య మంత్రి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే జూన్ లేదా జూలైలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో అమెరికా వాణిజ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా మోదీని తమ దేశానికి రమ్మని గత ఫిబ్రవరిలో ఆహ్వానించారు. జీ–20 దేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి జో బైడెన్‌తో పాటు ప్రపంచ దేశాధినేతలంతా హాజరు అవుతున్నప్పటికీ ఈ లోపే మోదీని అమెరికా రమ్మని ఆహ్వానించడం గమనార్హం. నిజానికి గత డిసెంబర్‌లో భారత్ జీ–20 దేశాల ఆధ్యక్షత స్వీకరించిన వెంటనే జో బైడెన్ స్పందిస్తూ ప్రధాని మోదీకి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ‘అమెరికాకు భారత్ బలమైన భాగస్వామి, మోదీకి మేము పూర్తి మద్దతునిస్తాం. కలిసి కట్టుగా మేము అనేక సవాళ్లను ఎదుర్కొంటామని’ ఆయన ట్వీట్ చేశారు. అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించే అవకాశాలున్నాయి. వైట్ హౌజ్‌లో అధ్యక్షుడు జో బైడెన్ ఆయన గౌరవార్థం అధికారిక విందు నిస్తారు.
వాక్సిన్ సరఫరా నుంచి ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ వరకు అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల్లో భారత్ అభిప్రాయానికి ఇప్పుడు విలువ లభిస్తుందనడంలో సందేహం లేదు. ఎందరో ఆధ్యాత్మిక గురువులకు నిలయమైన భారత దేశం విశ్వగురు స్థానం పొందిందని, రష్యా –ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇటీవల జీ–20 సమావేశాల్లో ప్రసంగించిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎమెనీ జపరోవా ఉద్ఘాటించారు. వచ్చే సెప్టెంబర్‌లో జరిగే జీ–20 శిఖరాగ్ర సదస్సుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హాజరు కానున్న నేపథ్యంలో ఆమె ప్రసంగానికి ప్రాధాన్యమేర్పడింది. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని, అది శీఘ్రగతిన అభివృద్ధి చెందుతూ ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నదని ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త ఇందర్‌మిట్ గిల్ ప్రకటించడం గమనార్హం. ఖర్చును అదుపులో పెట్టుకుని నిర్మాణ కార్యక్రమాలను అధికంగా ప్రోత్సహించడం వల్లే భారత్‌లో ఆర్థిక సుస్థిరత ఏర్పడిందని ఆయన ప్రశంసించారు. ఇలా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు మాత్రమే కాదు, ఆర్థిక పరిణామాలను, పర్యావరణ మార్పు వంటి అంశాలను కూడా నిర్ణయించగలిగిన స్థాయికి భారత్ చేరుకోవడం చిన్న విషయం కాదు. మరి మోదీపై వ్యక్తిగత దాడులు చేస్తూ, దేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేసే ప్రతిపక్షాలు ఇవాళ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో బలమైన నేతగా ఎదిగిన మోదీని ఢీకొనడం వారి తరం కాదు.
వై. సత్యకుమార్
(బిజెపి జాతీయ కార్యదర్శి)