‘త్రిశూల్‌’తో మోదీ సమరనాదం!

ABN , First Publish Date - 2023-08-25T03:16:54+05:30 IST

ప్రధాని మోదీ మంచి మాటకారి. పదాలకు గల వివిధ అర్థాలను వాడుకోవడంలో అసాధారణ నేర్పరి. కనుకనే ఆయన రాజకీయ సందేశాలు తరచు ఉద్దేశపూర్వక శబ్ద చమత్కారంలో ఉంటాయి. ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారాల...

‘త్రిశూల్‌’తో మోదీ సమరనాదం!

ప్రధాని మోదీ మంచి మాటకారి. పదాలకు గల వివిధ అర్థాలను వాడుకోవడంలో అసాధారణ నేర్పరి. కనుకనే ఆయన రాజకీయ సందేశాలు తరచు ఉద్దేశపూర్వక శబ్ద చమత్కారంలో ఉంటాయి. ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారాల నుంచి ఆయన వెలువరించిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని నిశితంగా చదవండి. 90 నిమిషాల పాటు సాగిన ఆ ఉపన్యాసంలో ‘పరివర్జన్’ (కుటుంబ సభ్యులు) అనే మాటను ఆయన అక్షరాలా 48 సార్లు ఉపయోగించారు. సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్వాతంత్ర్య పర్వదిన ప్రసంగంలో ఆ పదాన్ని అన్నిసార్లు పునశ్చరణ చేయడం వెనుక ఒక వ్యూహం లేదంటారా? ఎర్రకోట ప్రసంగాలలో మోదీ సాధారణంగా ‘మిత్రులారా’ అనో లేదా ‘అన్నలారా, అక్కలారా’ అనో ఆహుతులయిన ప్రజలను సంబోధించేవారు. అయితే ఈ ఏడాది ఆ వార్షిక ప్రసంగంలో ‘పరివర్జన్’ అనే మాటను ఆయన వాడారు. ఆ కొత్త పదంతో మోదీ తనను 140 కోట్ల మంది సభ్యులుగల భారతీయ కుటుంబానికి పెద్దగా తనను తాను నిలబెట్టుకున్నారు! ఈ ఒక్క మాటతో మోదీకి, ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మధ్య తేడా మరింత తీక్షణమయింది. మోదీ తన రాజకీయ ప్రత్యర్థులు ‘పరివార్ వాద్’ (కుటుంబ రాజకీయాలు) ఘనాపాఠీలని పదే పదే ఎత్తి పొడుస్తుంటారు. ఇంతకూ ఇప్పుడు చెప్పవచ్చిన దేమిటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 సార్వత్రక ఎన్నికల సమరానికి తాజా స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంతో శంఖనాదం చేశారు. అయితే ప్రధానమంత్రి ప్రయోగించిన ‘పరివార్ వాద్’, ‘భ్రష్టాచార్’ (అవినీతి), ‘మైనారిటీల బుజ్జగింపు’ అనే ‘త్రిశూల్’ తొమ్మిది సంవత్సరాల క్రితం వలే ప్రభావశీలంగా ప్రతిధ్వనిస్తుందా? ప్రత్యర్థుల గుండెల్లో కంపనాలు రేపుతుందా? లక్ష్యాన్ని సాధిస్తుందా?

ప్రత్యర్థులపై ‘పరివార్ వాద్’ అనే మోదీ ‘బ్రహ్మాస్త్రాన్ని’ తొలుత చూద్దాం. 2014లో జాతీయ రాజకీయాలలో మోదీ మొట్టమొదటిసారి ప్రభవించినప్పుడు ఆయన ఢిల్లీ పాలక వర్గ కులీన శ్రేణులకు ‘బయటి వ్యక్తి’. ‘పరాయివాడు’ అనేదే ఆ కులీనుల భావనగా ఉండేది. ఎందుకని? మోదీ కేవలం ఒక ఆరెస్సెస్ ప్రచారక్‌గా ప్రారంభమై ముఖ్యమంత్రి అయిన ‘చాయ్‌వాలా కుమారుడు’ మాత్రమే. మరి ఈ సామన్యుడిని అధికార ప్రాభవ, ఆసాములు తమలో ‘ఒకడు’గా ఎలా అంగీకరిస్తారు? ఆయన ప్రధాన ప్రత్యర్థి రాహుల్ గాంధీ ఢిల్లీ ‘సుల్తానత్’ ‘షెహజాదా’ (యువరాజు)గా వెలుగొందుతున్నారు. గాంధీ గృహనామంగా గల కుటుంబానికి వారసుడు. ఆ వారసత్వమే ఆయనకు బలం. 2019 సార్వత్రక ఎన్నికలలో ఈ ఇరువురి మధ్య పోటీ ‘కామ్‌దార్’ (శ్రామికుడు) వర్సెస్ ‘నామ్ దార్’ (కుటుంబ వారసుడు) అనే కథనంగా మారిపోయింది. సోనియా, రాజీవ్ గాంధీల కుమారుడు అయినందునే తాను కాంగ్రెస్ అధ్యక్షుడు అయినట్టు ప్రజల్లో గట్టిగా ఉన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు రాహుల్ ఏమైనా ప్రయత్నించారా అంటే ఏమీ లేదు. మరి నరేంద్ర మోదీ ఈ అంతరాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో ఆశ్చర్యమేముంది?


మన జాతీయ రాజకీయాలలోని ఈ ఇరువురు ప్రధాన యోధుల పాత్రలు గత ఏడాది స్వల్పంగా వ్యతిరిక్తమయ్యాయి. మోదీ ఇప్పటికీ తనను తాను సామాన్య మూలాల నుంచి ప్రభవించిన ఓబీసీ నేతగా అభివర్ణించుకుంటున్నారు. పాలక కుటుంబ వారసుడుగా కాకుండా ప్రతిభ ప్రాతిపదికన ప్రభవించి ‘నవ’ భారత నిర్మాణానికి నిబద్ధమైన కార్యదక్షుడుగా ఆయన ప్రజల దృష్టిలో ఉన్నారు. అయితే వరుసగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అయి, పదవీ వైభోగాలను సంపూర్ణంగా అనుభవిస్తూ, జంకు గొంకు లేకుండా అధికార దర్పాన్ని మోదీ తరచు ప్రదర్శించడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిన్నటి ‘చాయ్‌వాలా కుమారుడు’ నేడు శతాధిక కోట్ల ప్రజల జీవితాలను శాసించే సర్వోత్కృష్ట అధికారాలను చెలాయిస్తున్నాడు మరి. పెనుమార్పు, సందేహం లేదు. ప్రత్యర్థులను అసూయాగ్రస్తులను చేయకుండా ఎలా ఉంటుంది?

మరి రాహుల్ గాంధీ విషయమేమిటి? ఆయన గత ఏడాది తుది నాళ్లలోనూ, ఈ ఏడాది తొలినాళ్లలోనూ భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేశారు; ఒక సహాయ శిబిరంలో తలదాచుకుంటున్న జాతి ఘర్షణల బాధిత కుటుంబాలను పరామర్శించేందుకై మణిపూర్‌కు ఆగమేఘాలపై వెళ్లారు; ట్రక్ డ్రైవర్లు, మెకానిక్‌లు, రైతులు, కూరగాయల విక్రయదారులతో ఉల్లాసంగా సంభాషిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్న నేతగా ఈ దేశ ప్రజల మనస్సుల్లో రాహుల్ సుప్రతిష్ఠమయ్యారని చెప్పవచ్చు. పాలక కుటుంబ వారసుడు అనే ముద్ర రాహుల్‌ను ఇంకా వెన్నాడుతూనే ఉందిగానీ అదే ఆయనకు ఏకైక గుర్తింపుగా భాసించడం లేదు. ప్రజల్లో రాహుల్ పట్ల ఆమోదం అంతకంతకూ నిశ్చితంగా పెరుగుతోంది.

మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించి తీరాలి. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో కుటుంబ–కేంద్రిత పార్టీల ప్రాబల్యం అంతా ఇంతా కాదు. అయితే వర్తమాన ప్రజా జీవితంలో ఆశ్రిత పక్ష పాతం అనేది ఏ కోశానా లేని పార్టీగా బీజేపీని చెప్పగలమా? పార్లమెంటు ఉభయ సభలలోని 40 మందికిపైగా బీజేపీ సభ్యులు కుటుంబ సంబంధాల ఆధారంగానే ప్రభవించి వెలుగొందుతున్నారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కనీసం 25కు పైగా బీజేపీ టిక్కెట్లు కేవలం పది రాజకీయ కుటుంబాల వారికి మాత్రమే ఇచ్చారు!

ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించి తీరాలి. రెండు సంవత్సరాల క్రితం ‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ఉపన్యాసాన్ని వెలువరిస్తూ ‘కుటుంబ ఆధిపత్య రాజకీయాలు’, ‘కుటుంబ వారసుల’ మధ్య ఒక భేదం ఉందని ఉద్ఘాటించారు. ‘కుటుంబ ఆధిపత్య రాజకీయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనవని ఆయన అన్నారు. అయితే నాయకత్వ ప్రతిభా పాటవాలు, ప్రజల మద్దతు ఉన్న ‘కుటుంబ వారసులు అంగీకార యోగ్యమైన రాజకీయులే అని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయవేత్తల సంతానం తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకున్న పక్షంలో ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నదని చెప్పడమే మోదీ ప్రకటన అసలు లక్ష్యం.


ఇప్పుడు ‘అవినీతి’ విషయాన్ని చూద్దాం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపివేసిన అవినీతి నిర్మూలన ఉద్యమం ప్రధాన లబ్ధిదారు నరేంద్ర మోదీయేనని మరి చెప్పనవసరం లేదు. తొమ్మిది సంవత్సరాల అనంతరం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలపైనే అవినీతి కేసులు మోపుతున్నాయి. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో మందకొడిగా వ్యవహరిస్తోంది. ‘నేను ముడుపులు తీసుకోను మరొకరిని తీసుకోనివ్వను’ అని హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడుతున్న వారి విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారా? వ్యవహరిస్తుంటే దర్యాప్తు సంస్థలు తమ విధి నిర్వహణలో పాలక పక్షం పట్ల పక్షపాత వైఖరి చూపుతాయా? పాలక పార్టీ నేతల అవినీతిని ఉపేక్షించి, విపక్ష నేతల అక్రమాలపైనే ఎందుకు దృష్టి పెడుతున్నాయి? ఇక వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి ఫిరాయించిన నాయకుల అవినీతిపై దర్యాప్తు, విచారణ ఒక్కసారిగా ఎందుకు నిలిచిపోతున్నాయి? ఇందులోని మర్మమేమిటి? అధికార పక్షాన చేరిన వెన్వెంటనే వారు నిజాయితీపరులు అయిపోయారా? మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన అపారదర్శక ఎన్నికల బాండ్లు చెప్పుతున్న సత్యమేమిటి? తమది భిన్నమైన రాజకీయ పక్షమన్న బీజేపీ స్వోత్కర్షలో సత్యం లేశమాత్రం కూడా లేదనే కాదూ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచు చేసే వ్యంగ్య దూషణ ‘బుజ్జగింపు’. ఈ ఆరోపణను కూడా పునః పరిశీలించాల్సిన అవసరమున్నది. మైనారిటీ మతస్థులను ముఖ్యంగా ముస్లింలను సంతృప్తిపరచడమే కాంగ్రెస్‌కు ఒక ప్రధాన కార్యక్రమంగా ఉన్నదని బీజేపీ శ్రేణులు విమర్శిస్తుంటాయి. మరి మైనారిటీ మతాల వారిని మరీ ముఖ్యంగా ముస్లింలను పీడించడమే పాలక పక్షం ప్రధాన కార్యక్రమంగా ఉందన్న తీవ్ర ఆరోపణనుంచి బీజేపీ బయటపడగలదా? మతాంతర వివాహాలను ‘లవ్ జిహాద్’ పేరిట వ్యతిరేకించడం లేదూ? ఆహార అలవాట్లు, వస్త్రధారణ తీరుతెన్నులు సామాజిక వివక్షకు దారితీయడం లేదూ? చట్ట సభలలో మైనారిటీ మతాల వారికి తగు ప్రాతినిధ్యం లభిస్తుందా? విద్వేష ప్రసంగాలను గట్టిగా ప్రశ్నిస్తున్నారా? ఈ పరిణామాలపై ప్రభుత్వ ప్రతిస్పందన రాజ్యాంగ యుక్తంగా ఉండడం లేదు కనుకనే మెజారిటేరియన్ రాజకీయాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయనే ఆందోళన తీవ్రమవుతోంది. ఇటీవల రైల్వే కానిస్టేబుల్ ఒకరు ముస్లింలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనపై పాలకపక్షం వారిలో ఏ మాత్రం ఆందోళన వ్యక్తం కాలేదు. విద్వేష రాజకీయాలు సాధారణ కార్యకలాపాలుగా పరిణమించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

కుటుంబ ఆధిపత్య రాజకీయాలు, అవినీతి, బుజ్జగింపును రూపుమాపాలన్న త్రిముఖ వ్యూహం రాబోయే సార్వత్రక ఎన్నికలలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ (వరుసగా మూడోసారి గెలవడం) సాధించేందుకు తప్పకుండా తోడ్పడగలదని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాలు ఒక బలీయశక్తిగా, గట్టి పోటీదారుగా రూపుదిద్దుకోవడానికి ఇంకా సతమతమవుతుండగా 2024లో మరింత మెజారిటీతో మళ్లీ అధికారానికి వచ్చేందుకు నరేంద్ర మోదీ సంపూర్ణంగా సమాయత్తమై ఉన్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఇంచుమించు పదేళ్లుగా అధికారంలో ఉన్నది. ఈ దృష్ట్యా ఆయన నేతృత్వంలోని బీజేపీ అనుసరించే ఎన్నికల వ్యూహం కేవలం ప్రతిపక్షాల బలహీనతల చుట్టూనే పరిభ్రమించకూడదు. కనుక ‘కొత్త’ బీజేపీ తాను ఏ లక్ష్యం కోసం నిలబడుతున్నదీ స్పష్టం చేయాలి. ‘పరివర్జన్’కు మరింత మెరుగైన పాలననందించవలసిన అవసరమున్నది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2023-08-25T03:16:54+05:30 IST