Share News

కులగణనను అడ్డుకోవటమే అసలు కౌటిల్యం !

ABN , First Publish Date - 2023-10-25T02:22:03+05:30 IST

భారత దేశంలో కులవ్యవస్థ అనేక శతాబ్దాల చారిత్రక వాస్తవం. సంస్కృతిలో జీర్ణమైపోయిన చేదు నిజం. రాజ్యాంగ నిర్మాణం ద్వారా, కేవలం ఆనాటి అస్పృశ్యులు, ఆదివాసీల హక్కుల మేరకు మాత్రమే తప్ప, అధిక సంఖ్యాక కుల బాధితులైన...

కులగణనను అడ్డుకోవటమే అసలు కౌటిల్యం !

భారత దేశంలో కులవ్యవస్థ అనేక శతాబ్దాల చారిత్రక వాస్తవం. సంస్కృతిలో జీర్ణమైపోయిన చేదు నిజం. రాజ్యాంగ నిర్మాణం ద్వారా, కేవలం ఆనాటి అస్పృశ్యులు, ఆదివాసీల హక్కుల మేరకు మాత్రమే తప్ప, అధిక సంఖ్యాక కుల బాధితులైన ఇతర బీసీల సమస్యలకు తృప్తికరమైన పరిష్కారం దొరకలేదు. రాజకీయ రంగంతో సహా, ఇతర ఏ కీలక రంగంలోను వారికి దామాషా ప్రకారం అవకాశాలు దక్కటం లేదు. కుల వ్యవస్థలో వీరి పూర్తి స్థితిగతులను, అణచివేత రూపాన్ని ప్రతిబింబించడానికి అవసరమైన 'సమగ్ర కులగణన' ప్రక్రియను ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వాలు, ఇతర ప్రాబల్య శక్తులు నేటి వరకు అడ్డుకొంటూ వచ్చాయి. అయితే మొన్న అక్టోబర్ 2న విడుదలైన బిహార్ సమగ్ర కుల గణాంకాలు, కొంత మేర ఆ ముసుగును తొలగించి సమాజం ముందు ఉంచాయి. కానీ కుల వ్యవస్థలో లబ్ధిపొందిన శక్తులు దీనిమీద నానా యాగీ చేస్తున్నాయి. వాస్తవాలకు పూర్తిగా వక్రభాష్యం చెబుతున్నాయి. 'జనగణన పై కుల కౌటిల్యాలు' అనే పేరుతో బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ రాసిన వ్యాసం (ఆంధ్రజ్యోతి– అక్టోబరు 10, 2023) కూడా పూర్తిగా ఇటువంటి ప్రయత్నమే.

బీసీల్ని ఇంతవరకు మోసం చేయడంలో, సమగ్ర కుల గణనకు వ్యతిరేకంగా కుంటి సాకులతో మభ్యపెట్టడంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇతర ఆధిపత్య శక్తులు దశాబ్దాలుగా పోటీ పడుతూనే ఉన్నాయి. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దశాబ్దాలుగా సాగిన తమ హయాంలో కాకా కలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ లాంటి అనేక సందర్భాల్లో బీసీలకు న్యాయమైన భాగస్వామ్యం దక్కకుండా ఉండే విధంగా వ్యవహరిస్తూ వచ్చారు. వీపీ సింగ్ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగ రంగంలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని విస్మరించిందనీ, మద్దతు నిచ్చిన పార్టీలతో ఏమాత్రం సంప్రదించలేదనీ, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారనీ వ్యాసకర్త తప్పుపట్టారు. మరి అన్ని స్థాయిల్లో ఓబీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక రాజకీయ పక్షం తామేనని చెప్పుకొంటున్న బీజేపీ– అప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక బీసీలు నాలుగు దశాబ్దాలుగా తమ న్యాయమైన భాగస్వామ్యాన్ని కోల్పోయారన్న సత్యాన్ని ఎలా విస్మరిస్తుంది? మొదటిసారిగా బీసీలకు మేలు చేయడానికి ముందుకు వచ్చిన వీపీ సింగ్ ప్రభుత్వం మీద కక్ష కట్టి ఎలా గద్దె దింపగలిగారు?

బీజేపీ కల్పించామని చెప్పుకుంటున్న రాజకీయ అవకాశాలు బీసీలకు ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి అన్నది కీలక ప్రశ్న. స్వతంత్రంగా విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో, పదవుల్లో ఉన్న బీసీలకు నిజంగా ఏమైనా పాత్ర ఉందా అంటే శూన్యం అని చెప్పక తప్పదు. ప్రధాన మంత్రి మోదీ బీసీ. నిజమే, కానీ దానివల్ల బీసీలకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. దీనికి భిన్నంగా, ఆధిపత్య కులాల ప్రయోజనాలకే బీజేపీ అంకితమై పని చేస్తున్నది. సమాజం దృష్టిలోని వాస్తవం ఇది. 15శాతం మించని ఆధిపత్య కులాల్లో పేదరికం ఏపాటి? 2 లేక 3 శాతం మించని వీరిలోని పేదలకోసం 2019 ఎలక్షన్లకు ముందు 10శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని బీసీలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎటువంటి రిజర్వేషన్ లేకుండానే మొదటి నుంచీ 60శాతం మేర అవకాశాలు పొందుతూ వస్తున్న ఆధిపత్య కులాల వారికి, వారిలో పేదరికం పేరుతో అదనంగా మరో 10శాతం అవకాశాలు కల్పించడం, 27శాతం అవకాశాలకే పరిమితం చేయబడుతున్న బీసీల్ని వెక్కిరించడం కాదా?


ఓబీసీ కమిషన్‌కు మోదీ ప్రభుత్వం హయాంలో రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన మాట వాస్తవమే. అయితే దీని వల్ల ఓబీసీలకు నిజంగా ఒరిగింది కొత్తగా ఏమైనా ఉందా? రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన జాతీయ బీసీ కమిషన్‍కు సంబంధించిన రాజ్యాంగ సవరణ 2018 లో జరిగిన తర్వాత కూడా, తగినన్ని అధికారాలు, సమాచారం లేకుండా చేసి, ఓబీసీ జాబితా వర్గీకరణ సమస్యను, జస్టిస్ రోహిణి కమిషన్ దగ్గరే కొనసాగిస్తూ, ఇంతవరకు వారి నివేదిక అమలు చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నట్లు? గత ఏడున్నర దశాబ్దాల ప్రజాస్వామ్య పాలనలో బీసీలకు దొరికిన రాజకీయ ప్రాతినిధ్యం సంఖ్యాపరంగా కాని, అధికారంలో భాగస్వామ్యం పరంగా కానీ బహు స్వల్పం. అటువంటి పరిస్థితుల్లో బీసీ అయిన ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో ఎంతో కొంత రిజర్వేషన్ కల్పించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతోంది?

2018లో రాజ్‌నాథ్ సింగ్ కులగణనకు సానుకూలతను ప్రకటించడం వాస్తవం కాదా? దాన్ని ఎవరూ ఆనాడు 'కుల రాజకీయం' అని తప్పుపట్టలేదే! దరిమిలా 2019లో బీసీల ఓటుబ్యాంకు కారణంగా అనూహ్య ఆధిక్యతతో అధికారం చేజిక్కించుకున్న తర్వాత బీజేపీ ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకొని 2021 సెప్టెంబర్ 23 నాడు సుప్రీంకోర్టులో 'కుల గణన తమ విధానం కాదని' అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యటంలాంటిదే. భారతదేశం అనేక శతాబ్దాలుగా కులాలవారీగా విడిపోయే ఉంది. ఇది చారిత్రక వాస్తవం. ఇప్పుడు కులగణనతో 'దేశం చీలిపోతుంది' అని బీజేపీ చేస్తున్న బెదిరింపుల్ని అంతంతమాత్రం అవగాహన ఉన్న బీసీలు భక్తితో కొంతమేర నమ్మితే నమ్మవచ్చు. సామాజిక వాస్తవాలను ఎరిగినవారు ఏమాత్రం నమ్మరు.

కె. కొండలరావు

న్యాయవాది, బీసీవాది

Updated Date - 2023-10-25T02:22:03+05:30 IST