విషాదం: జిమ్ పైకప్పు కూలి 11 మంది మృతి.. ప్రమాదానికి గల కారణమేటంటే..?

ABN , First Publish Date - 2023-07-24T17:55:36+05:30 IST

చైనాలోని ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో గల కింగార్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ పైకప్పు కూలి ఏకంగా 11 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో జిమ్‌లో 19 మంది ఉండగా.. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారు.

విషాదం: జిమ్ పైకప్పు కూలి 11 మంది మృతి.. ప్రమాదానికి గల కారణమేటంటే..?

చైనాలోని ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో గల కింగార్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ పైకప్పు కూలి ఏకంగా 11 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో జిమ్‌లో 19 మంది ఉండగా.. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారు. అలాగే వారంతా జిమ్‌లో వాలీబాల్ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లో వెళ్తే.. అది ఒక పాఠశాలకు చెందిన జిమ్. అయితే ఆ పాఠశాల ఆవరణలోనే మరో భవనం నిర్మిస్తున్నారు. దీంతో ఆ భవనానికి సంబందించిన పెర్లైట్‌ను జిమ్ పైకప్పుపై ఏర్పాటు చేశారు. జిమ్‌లో వాలీబాల్ క్రీడాకారిణులకు శిక్షణ ఇస్తున్నారు. చైనాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెర్లైట్ తడిసి బరువు పెరిగింది. దీంతో జిమ్ పైకప్పు బరువును తట్టుకోలేక కూలిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ సమయంలో జిమ్‌లో 19 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీశారు. కానీ ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోగా.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 8 మంది చనిపోయారు.


ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. జిమ్ పైకప్పుపై పెర్లైట్స్‌ను ఏర్పాటు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను నిలదీస్తున్నారు. ‘‘నా కూతురు చనిపోయిందని నాకు చెప్పారు. కానీ మేము మా బిడ్డను చూడలేదు. ఆసుపత్రికి వెళ్లినప్పుడు పిల్లలందరి ముఖాలు మట్టి, రక్తంతో నిండిపోయి ఉన్నాయి. దయచేసి నా బిడ్డను గుర్తించనివ్వండి. ’’ అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలంలో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరుపైనా పిల్లల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘‘జిమ్ పైకప్పుపై పెర్లైట్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు. ఈ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ప్రజలకు చట్టం పట్ల గౌరవం లేదు." అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల కాలంలో చైనాలో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. జూన్‌లో వాయువ్య చైనాలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో పేలుడు సంభవంచి 31 మంది చనిపోయారు. అంతకుముందు ఏప్రిల్‌లో బీసింగ్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 29 మంది చనిపోయారు.

Updated Date - 2023-07-24T17:55:36+05:30 IST