Adani Group : తాజా ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్.. అవన్నీ పాత పాటలేనన్న పారిశ్రామిక దిగ్గజం..
ABN , First Publish Date - 2023-08-31T15:07:59+05:30 IST
ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) ఆరోపణలను అదానీ గ్రూప్ (Adani Group) గురువారం తీవ్రంగా ఖండించింది. జార్జ్ సొరోస్ నిధులతో నడుస్తున్న సంస్థలు పాత పాటనే మళ్లీ పాడుతున్నాయని దుయ్యబట్టింది. ఇవన్నీ రీసైకిల్డ్ ఆరోపణలని వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ : ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) ఆరోపణలను అదానీ గ్రూప్ (Adani Group) గురువారం తీవ్రంగా ఖండించింది. జార్జ్ సొరోస్ నిధులతో నడుస్తున్న సంస్థలు పాత పాటనే మళ్లీ పాడుతున్నాయని దుయ్యబట్టింది. ఇవన్నీ రీసైకిల్డ్ ఆరోపణలని వ్యాఖ్యానించింది. తెర మరుగున ఉన్న మదుపరులు ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. విలువ లేని హిండెన్‌బర్గ్ నివేదికను పునరుద్ఘాటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఓసీసీఆర్‌పీ నివేదిక ఆరోపించింది. పారదర్శకత లేని మారిషస్ నిధుల ద్వారా అదానీ గ్రూప్ బహిరంగంగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్‌లోకి పెట్టుబడులను తీసుకొస్తోందని, అదానీ కుటుంబ సభ్యుల వ్యాపార భాగస్వాముల అస్పష్టమైన ప్రమేయం దీనిలో ఉందని ఆరోపించింది.
అదానీ గ్రూప్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ఆరోపణలను విస్పష్టంగా కొట్టిపారేసింది. ఈ రీసైకిల్డ్ ఆరోపణలను విస్పష్టంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఏమాత్రం విలువలేని హిండెన్‌బర్గ్ నివేదికను పునరుజ్జీవింపజేయడం కోసం ఓ వర్గం విదేశీ మీడియా మద్దతుతో, జార్జ్ సొరోస్ ఇచ్చే నిధులతో పని చేసే శక్తుల ద్వారా సమన్వయంతో జరుగుతున్న మరొక ప్రయత్నంగా ఈ నివేదికలు కనిపిస్తున్నాయని తెలిపింది. నిజానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయని ముందుగానే ఊహించామని తెలిపింది. ఈ విషయాన్ని గత వారం మీడియా కూడా చెప్పిందని గుర్తు చేసింది.
ఓసీసీఆర్పీ నివేదికలో చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఓ దశాబ్దం క్రితం మూతపడిన కేసుల ఆధారంగా ఈ ఆరోపణలు చేసిందని చెప్పింది. ఓవర్-ఇన్‌వాయిసింగ్, విదేశాల్లో నిధుల బదిలీ, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ ద్వారా పెట్టుబడులపై వచ్చిన ఆరోపణలపై పదేళ్ల క్రితమే డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దర్యాప్తు చేసినట్లు గుర్తు చేసింది.
లావాదేవీలన్నీ చట్టాలకు అనుగుణంగానే జరిగాయని, ఓవర్-వాల్యుయేషన్ జరగలేదని స్వతంత్ర యాడ్జుడికేటింగ్ అథారిటీ, అపిలేట్ ట్రైబ్యునల్ ధ్రువీకరించాయని తెలిపింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు తమకు (అదానీ గ్రూప్‌నకు) అనుకూలంగా తీర్పు చెప్పడంతో ఈ అంశానికి తుది రూపం వచ్చిందని తెలిపింది. ఓవర్-వాల్యుయేషన్ లేనందువల్ల నిధుల బదిలీపై ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని వివరించింది.
ఈ ఎఫ్‌పీఐలు ఇప్పటికే సెబీ (Securities and Exchange Board of India) దర్యాప్తులో పాలుపంచుకుంటున్నట్లు తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా ఉండవలసిన మినిమమ్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) లేదని కానీ, స్టాక్ ధరల మానిపులేషన్ జరిగినట్లు కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేసింది.
‘‘మాకు ప్రశ్నలను సంధించిన పత్రికలు, మేము ఇచ్చిన సమాధానాలను సంపూర్ణంగా ప్రచురించకపోవడం దురదృష్టకరం. మా స్టాక్ ధరలను తగ్గించడం ద్వారా లాభాలను సృష్టించుకోవాలనేది ఈ ప్రయత్నాల లక్ష్యాల్లో ఒకటి. ఈ షార్ట్ సెల్లర్స్‌పై వివిధ అథారిటీలు దర్యాప్తు జరుపుతున్నాయి’’ అని అదానీ గ్రూప్ ఈ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం జరుగుతున్న రెగ్యులేటరీ ప్రాసెస్‌ను గౌరవించడం చాలా ముఖ్యమని తెలిపింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు, సెబీ పర్యవేక్షిస్తున్నట్లు వివరించింది. చట్టపరమైన సముచిత ప్రక్రియపైన తమకు పూర్తి విశ్వాసం ఉన్నట్లు, తాము వెల్లడించిన అంశాల యథార్థత పట్ల , కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల పట్ల నమ్మకం ఉన్నట్లు తెలిపింది. వీటన్నిటి దృష్ట్యా ఈ వార్తలు వెలువడిన సమయం అనుమానాస్పదంగా, మోసపూరితంగా, దురుద్దేశపూరితంగా కనిపిస్తున్నాయని, ఈ నివేదికలను సంపూర్ణంగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది.
ఓవర్-ఎవాల్యుయేషన్, పవర్ ట్రాన్స్‌మిషన్ ఎక్విప్‌మెంట్ ఓవర్-ఇన్‌వాయిసింగ్ ఆరోపణలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) కూడా దర్యాప్తు చేసి, కేసును 2015 జూలై 15న ముగించింది.
జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల షార్ట్ సెల్లింగ్ వల్ల 18 కంపెనీలు భారీగా లబ్ధి పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది. ఈ విధంగా లబ్ధి పొందినవారిలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఉన్నట్లు గుర్తించింది. వీరంతా పన్నుల స్వర్గధామాల వంటి దేశాల్లో ఉన్నట్లు తెలిపింది. ఈడీ ఈ అంశాలను సెబీకి కూడా తెలియజేసింది. ఈ కంపెనీలపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Rs.10 coins: రూ.10 నాణేలు తిరస్కరించవద్దు...
Madurai: ఒకే సమయంలో అమ్మవారి ఆలయంలో మాజీసీఎం, ఎంపీ కనిమొళి