Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరో ఊహించని షాక్
ABN , First Publish Date - 2023-03-27T18:19:05+05:30 IST
సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీకి(Congress MP Rahul Gandhi) మరో బిగ్ షాక్ తగిలింది.
న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరు(Modi surname) కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యలతో సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీకి(Congress MP Rahul Gandhi) మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన ప్రస్తుతం ఉంటోన్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని(vacate the government allotted bungalow) లోక్‌సభ హౌజింగ్ కమిటీ(Lok Sabha Housing Committee) నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగళాను ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఖాళీ చేయడానికి ఆయనకున్న వ్యవధి 26 రోజులు మాత్రమే. 2014 నుంచి రాహుల్ ఢిల్లీ 12 తుగ్లక్ లేన్ లోని ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు.
అంతకు ముందు మోదీ ఇంటి పేరుకలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. ‘‘ కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది. దోషిగా తేలిన 23 మార్చి 2023 నుంచి నుంచి అనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు.
ఈ కేసులో సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుతో(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ శివసేన వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేతో పాటు అనేక పార్టీల నేతలు ఇప్పటికే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు ఇష్టపడని నేతలు కూడా రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. బీజేపీయేతర పార్టీల నేతల్లో ఎక్కువ మంది రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమంటూ తీవ్రంగా విమర్శించారు కూడా. క్రమంగా కాంగ్రెస్‌తో కలిసి ఐక్యపోరాటం చేసేందుకు వీరు సిద్ధమౌతున్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ పిలుపునీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు ఇప్పటికే ఈడీ(ED), సీబీఐ(CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ 14 ప్రతిపక్ష పార్టీలకు(14 political parties) చెందిన ప్రతినిధులు సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించారు. ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ తప్పుడు కేసులు పెడుతున్నాయంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీకి అపరిమిత అధికారాలు ఇచ్చారంటూ విపక్షాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఏప్రిల్ 13న ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ‘మోదీ’ అనే ఇంటిపేరు ఉన్నవారందరినీ, మోదీ ‘కమ్యూనిటీ’ని అవమానించే విధంగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 అక్టోబరులో రాహుల్‌గాంధీ ఈ కేసు విచారణ నిమిత్తం సూరత్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీని ఉద్దేశించి చేశారు కాబట్టి.. వేస్తే ప్రధానే దీనిపై కోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని, పూర్ణేశ్ మోదీ కాదని రాహుల్ తరఫు న్యాయవాది వాదించారు. అలాగే.. మోదీ అనే ‘కమ్యూనిటీ’యే లేదు కాబట్టి అసలు ఈ కేసు చెల్లదని కోర్టుకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని బయటపెట్టడం తప్ప.. రాహుల్ వ్యాఖ్యల వెనుక వేరే ఎలాంటి దురుద్దేశాలూ లేవని వెల్లడించారు. కేసు విచారణ కిందటివారమే ముగియగా.. ఇరుపక్షాల తుది వాదనలూ విన్న కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ.. తీర్పును వాయిదా వేశారు. ఆ తీర్పును గురువారం ప్రకటించారు.
‘‘రాహుల్ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మేహుల్ చోక్సీ, అనిల్ అంబానీకి పరిమితం చేసుకుని ఉండాల్సింది. కానీ, ఆయన ఉద్దేశపూర్వకంగానే ‘మోదీ’ అనే ఇంటిపేరు కలిగి ఉన్న వ్యక్తులకు బాధకలిగించే వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ పరువునష్టానికి పాల్పడ్డారు’’ అని తన తీర్పులో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ప్రభావం ప్రజల్లో ఎంతగా ఉంటుందనే విషయం.. దాని ద్వారా ఏమేరకు ప్రయోజనాలు పొందగలననే విషయం కూడా ఆయనకు తెలుసని తీర్పులో వ్యాఖ్యానించారు. 2018లో రాహుల్ చేసిన ‘చౌకీదార్ చోర్‌హై’ వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచనల గురించి.. అప్పట్లో రాహుల్ బేషరతు క్షమాపణలు చెప్పిన విషయాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు.
రాహుల్ వ్యాఖ్యల వల్ల.. ఫిర్యాదిదారుకు ఎలాంటి బాధ, నష్టం కలగలేదని, రాహుల్ గతంలో ఎలాంటి కేసులోనూ దోషి కాడని.. కాబట్టి తేలికపాటి శిక్ష విధించాలని రాహుల్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలతో కూడా న్యాయమూర్తి ఏకీభవించలేదు. కాగా.. తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ కోర్టుహాల్‌లోనే ఉన్నారు.
నిజాలు మాట్లాడినందుకు రాహుల్ గాంధీకి శిక్ష పడిందని.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన పైకోర్టులో అప్పీలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కోర్టు గుజరాతీ భాషలో ఇచ్చిన 170 పేజీల తీర్పును ఆంగ్లంలోకి అనువాదం చేయాల్సి ఉందని.. దీనిపై అప్పీలుకు వెళ్లే పనిలో ఉన్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఈ తీర్పుపై చట్టప్రకారమే ముందుకెళ్లి, ఊరట పొందుతామని చెప్పారు. రాహుల్‌ను దోషిగా పేర్కొన్న ఈ తీర్పును.. దుర్బలమైన, తప్పులతో కూడిన, చట్టపరంగా నిలవని తీర్పుగా ఆయన అభివర్ణించారు.
రాహుల్‌గాంధీ విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి అనైతికమైన చర్యలకైనా పాల్పడుతుందని దుయ్యబట్టారు. కాగా.. సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ప్రతిపక్షాలన్నింటితో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్టు సమాచారం. అనంతరం 11.30 గంటలకు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ దాకా మార్చ్ చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించడానికి సమయం కోరినట్టు తెలిపింది. రాహుల్ తాను చేసే ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఆయన సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు. ఒక ఎంపీగా.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు తీవ్రమైన విషయం. ఎంపీల ప్రకటనలకు విస్తృత ప్రభావం ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఆయన చేసిన నేరం మరింత తీవ్రమైనది. దీనికి తక్కువ శిక్ష విధిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
Rahul Gandhi: ప్రతిపక్షాలను కలిపే యత్నంలో ఖర్గే ఇలా... వివాదాస్పద వ్యాఖ్యలతో రాహుల్ అలా...