Delhi Budget Row : ఢిల్లీ ఆర్థిక మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
ABN , First Publish Date - 2023-03-21T15:28:59+05:30 IST
ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక మంత్రి కైలాశ్ గెహ్లాట్ (Kailash Gehlot) రాజీనామా చేయాలని బీజేపీ (BJP) డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక మంత్రి కైలాశ్ గెహ్లాట్ (Kailash Gehlot) రాజీనామా చేయాలని బీజేపీ (BJP) డిమాండ్ చేసింది. 2023-24 బడ్జెట్‌ను షెడ్యూలు ప్రకారం శాసన సభలో ప్రవేశపెట్టడంలో విఫలమైనందుకు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. షెడ్యూలు ప్రకారం ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌ను శాసన సభలో మంగళవారం ప్రవేశపెట్టవలసి ఉంది. ఈ బడ్జెట్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) మంగళవారం ఆమోదం తెలిపింది.
బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బడ్జెట్ ప్రతిపాదనలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi Lieutenant Governor VK Saxena) అడిగిన వివరణను ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేకపోయిందని ఆరోపించారు. సక్సేనా అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సమాధానాలను చెప్పలేకపోయిందన్నారు. ఎంహెచ్ఏ ఈ బడ్జెట్‌ను ఆమోదించడంలో జాప్యం జరగడానికి ఇదే కారణమని తెలిపారు.
శాసన సభలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిధూరీ మాట్లాడుతూ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వృథా ఖర్చులు చేసేటపుడు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయనపుడు ప్రశ్నించే అధికారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉందన్నారు. బడ్జెట్‌పై నిజాయితీతో కూడిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటోందన్నారు. బడ్జెట్‌కు ఎంహెచ్ఏ ఆమోదం లభించకుండానే, మార్చి 21న శాసన సభలో దానిని ప్రవేశపెడతామని ముందుగానే ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు.
బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక మంత్రి గెహ్లాట్ బడ్జెట్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించారని, ఇది హక్కుల ఉల్లంఘన అని చెప్పారు. దీనిపై సీబీఐ (Central Bureau of Investigation) చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా, ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక మంత్రి కైలాశ్ గెహ్లాట్ శాసన సభలో మంగళవారం మాట్లాడుతూ, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టడాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టడంలో జరుగుతున్న ఆలస్యానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
2024 Lok Sabha Polls : బీజేపీని ఓడించడం అసాధ్యం, అయితే ... : ప్రశాంత్ కిశోర్
Amazon : అమెజాన్‌లో ఉద్యోగాల కోత... మరో 9,000 మంది ఉద్యోగులు ఇంటికే...