Himanta Biswa Sharma: 'హంగ్' మాటే లేదు, మూడు రాష్ట్రాలు మావే...

ABN , First Publish Date - 2023-02-28T19:11:26+05:30 IST

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో హంగ్ అసెంబ్లీ ప్రసక్తే లేదని, మూడు ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ సారథ్యంలోని..

Himanta Biswa Sharma: 'హంగ్' మాటే లేదు, మూడు రాష్ట్రాలు మావే...

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో హంగ్ అసెంబ్లీ ప్రసక్తే లేదని, మూడు ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma) ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్డీయే కన్వీనర్‌‌గా ఉన్న అసోం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

''త్రిపురలో బీజేపీ సీఎం ఉంటారు. నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వం, మేఘాలయలో బీజేపీ గెలిచిన సీట్లను బట్టి నిర్ణయం ఉంటుంది'' అని శర్మ చెప్పారు. ఎన్డీయే భాగస్వాములు ఎవరూ కాంగ్రెస్‌తో కానీ తృణమూల్ కాంగ్రెస్‌తో కానీ పొత్తులకు వెళ్లరని, మూడు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వాలే ఏర్పడతాయని తెలిపారు.

ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

నాగాలాండ్‌లో అధికార ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. త్రిపురలో బీజేపీ తమ ప్రత్యర్థుల కంటే పూర్తి పైచేయి సాధింస్తుందని, మేఘాలయాలో గెలుపు దిశగా బీజేపీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. సోమవారంనాడు మేఘాలయ, నాగాలండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే ఎగ్టిట్ పోల్ ఫలితాలను న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి.

మేఘాలయ

అరవై మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్‌పీపీ 21-26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 8-13 సీట్లు, బీజేపీ 6-11 సీట్లు, కాంగ్రెస్ 3-6 సీట్లు గెలుచుకుంటాయని జీ-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్‌పీపీకి 18-24, కాంగ్రెస్ 6-12, బీజేపీ 4-8, యూడీపీ 8-12, టీఎంసీ 5-9 సీట్లు వస్తాయి. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్‌పీపీ 18-26, ఏఐటీఎంసీ 8-14, యూడీపీ 8-14 బీజేపీ 3-6 సీట్లు గెలుస్తాయి.

నాగాలాండ్

60 సభ్యుల నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 38 నుంచి 48 సీట్లు, కాంగ్రెస్ 1-2 సీట్లు గెలుచుకుంటాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. జీ-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 35 నుంచి 42 సీట్లు గెలుచుకుంటుంది. ఈటీజీ-టైమ్స్ నౌ పోల్ ప్రకారం ఎన్‌డీపపీ 27-33, బీజేపీ 12-16, ఎన్‌పీఎఫ్ 4-8 సీట్లు గెలుచుకుంటాయి.

త్రిపురలో...

త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 36 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని, లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి 6-11 సీట్లు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టిప్ర మోతా పార్టీకి 9-16 సీట్లు వస్తాయని తెలిపింది. జీన్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం బీజేపీ-ఐపీఎఫ్‌టీ 29-36 సీట్లు గెలుచుకుంటాయి. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి 13-21 సీట్లు, టిప్ర మోతా పార్టీకి 11-16 సీట్లు వస్తాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల కౌటింగ్ మార్చి 2న జరుగుతుంది.

Updated Date - 2023-02-28T19:11:26+05:30 IST