Honey Trap: ఫోటోలో గానీ, రీల్స్ గానీ పోస్ట్ చేయొద్దు.. భద్రతా బలగాలకు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2023-08-26T15:09:55+05:30 IST

అందుబాటులో ఉన్న టెక్నాలజీని అడ్డం పెట్టుకొని కొందరు దుండగులు హనీ ట్రాప్ వ్యవహారాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. చివరికి భద్రతా బలగాలు సైతం ఈ హనీ ట్రాప్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తమకు తెలియకుండా...

Honey Trap: ఫోటోలో గానీ, రీల్స్ గానీ పోస్ట్ చేయొద్దు.. భద్రతా బలగాలకు కీలక ఆదేశాలు

అందుబాటులో ఉన్న టెక్నాలజీని అడ్డం పెట్టుకొని కొందరు దుండగులు హనీ ట్రాప్ వ్యవహారాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. చివరికి భద్రతా బలగాలు సైతం ఈ హనీ ట్రాప్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తమకు తెలియకుండానే వారి వలలో పడి.. సున్నితమైన సమాచారాలను లీక్ చేస్తున్నారు. ఈమధ్య ఇలాంటి ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలకు కొన్ని సూచనలు అందాయి. యూనిఫామ్‌లో ఉన్న ఫోటోలు గానీ, రీల్స్ గానీ తమ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అప్‌లోడ్ చేయొద్దని తమ సిబ్బందికి కేంద్ర పోలీసు బలగాలు సూచించాయి. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులతో ఫ్రెండ్‌షిప్ కూడా చేయొద్దని హెచ్చరికలు జారీ చేశాయి.


కేంద్ర నిఘా సంస్థలు ఇటీవల ఓ పరిశీలన చేపట్టగా.. కొందరు సిబ్బంది యూనిఫామ్‌లోనే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు తేలింది. అందునా.. సెన్సిటివ్ లొకేషన్లలో దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నట్టు వెల్లడైంది. అలాగే.. అపరచితులతో స్నేహం చేస్తున్నట్టు ఆ నిఘా సంస్థలు గుర్తించి.. కేంద్ర పారామిలిటరీ, పోలీసు బలగాలకు ఒక లేఖ రాశాయి. ‘‘సిఆర్‌పీఎఫ్ సిబ్బంది యూనిఫామ్‌లోనే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు అపరిచితులతో స్నేహం చేయడం గుర్తించబడింది. కాబట్టి.. సంబంధిత కార్యాలయాలు తమ ఆధ్వర్యంలోని సిబ్బంది ఈ పనులకు పాల్పడకుండా చూసుకోవాలి. సోషల్ మీడియా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఈ సూచనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేయండి’’ అని ఆ నోట్‌లో పేర్కొనబడి ఉంది.

ఈ నోట్ అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలు.. తమ సిబ్బందికి యూనిఫామ్‌లో ఉన్న ఫోటోలు గానీ, రీల్స్ గానీ పోస్ట్ చేయొద్దని, అపరిచితులతో స్నేహం చేయొద్దని సూచించాయి. లేకపోతే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చాయి. ఈ ఆదేశాలు సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎప్, ఐటీబీపీ సిబ్బందికి జారీ అయ్యాయి. అటు.. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడా సైతం తమ బలగాలకు ఇలాంటి సూచనలే జారీ చేశారు. కాగా.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్, పాకిస్తాన్‌లోని మహిళా ఇంటెలిజెన్స్ అధికారితో టచ్‌లో ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఆమె వేసిన వలలో (హనీ ట్రాప్) ఆ కానిస్టేబుల్ చిక్కుకుని, కొంత కీలక సమాచారాన్ని అందజేశాడు. అయితే.. ఈలోపే ఆయన్ను పట్టుకోవడం జరిగింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే.. పై విధంగా అధికారులు సూచనలు జారీ చేశారు.

Updated Date - 2023-08-26T15:12:58+05:30 IST