Share News

Congress: రూ.351 కోట్లకు చేరిన కాంగ్రెస్ ఎంపీ అక్రమ సంపాదన.. ఇంకా లెక్కించాల్సిన డబ్బు సంచులు ఎన్నంటే..?

ABN , First Publish Date - 2023-12-11T08:30:16+05:30 IST

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది.

Congress: రూ.351 కోట్లకు చేరిన కాంగ్రెస్ ఎంపీ అక్రమ సంపాదన.. ఇంకా లెక్కించాల్సిన డబ్బు సంచులు ఎన్నంటే..?

రాంచీ: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది. దీంతో ధీరజ్ సాహు అక్రమ సంపాదన డబ్బు మరింత పెరగనుంది. ఇప్పటివరకు ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన ఒక ఆపరేషన్‌లో ఏదైనా ఏజెన్సీ ద్వారా అత్యధికంగా పట్టుబడిన నల్లధనం ఇదే కావడం గమనార్హం. దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న నగదు లెక్కింపు సోమవారం నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తమకు 176 సంచుల నగదు వచ్చిందని, వాటిలో 140 లెక్కింపు పూర్తైందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ భగత్ బెహెరా తెలిపారు. మూడు బ్యాంకులకు చెందిన 50 మంది అధికారులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు చెప్పారు. అలాగే డబ్బులను లెక్కించేందుకు 40 యంత్రాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. లెక్కింపునకు ఇంకా గణనీయమైన నగదు మిగిలి ఉన్నందున, ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు నగదు-గణన యంత్రాలు, మనుషులను సమకుర్చాలని అధికారులు నిర్ణయించారు.


కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నుంచి స్వాధీనం చేసుకున్న నగదు కట్టలను అధికారులు లెక్కిస్తున్న వీడియోలు ఆదివారం బయటకు వచ్చాయి. ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాంగణంలో ఎక్కువ నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిషా, జార్ఖండ్‌లోని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన కంపెనీలు, ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ ఈ నెల 6న దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా డబ్బు సంచులను స్వాధీనం చేసుకుంది. ధీరజ్ సాహు మద్యం అమ్మకాలతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలున్నాయి. కానీ ఆదాయపు పన్ను ఎగవేశారని, పన్నుల చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని భావించిన ఐటీశాఖ అధికారులు ఆయన ఆస్తులపై దాడులు చేశారు.

"భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదు. ధీరజ్ సాహు ఆస్తుల నుంచి ఆదాయపన్ను అధికారులు ఎంత భారీ మొత్తంలో నగదును వెలికితీశారో ఆయన మాత్రమే వివరించాలి" అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ వివిధ కంపెనీల అధికారులు, ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది.

Updated Date - 2023-12-11T09:02:48+05:30 IST