Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..
ABN , First Publish Date - 2023-05-07T15:25:44+05:30 IST
న్యూఢిల్లీ: శివసేనతో పొత్తు కొనసాగుతుందని, రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగానే తాము పోటీ చేస్తామని బీజేపీ స్పష్టత ఇచ్చింది. షిండే సీఎంగా కొనసాగుతారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
న్యూఢిల్లీ: శివసేనతో పొత్తు కొనసాగుతుందని, రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగానే తాము పోటీ చేస్తామని బీజేపీ (BJP) స్పష్టత ఇచ్చింది. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు, కర్ణాటక ఎన్నికలు, ఇతర పలు అంశాలపై 'ఆప్ కీ అదాలత్' ఎపిసోడ్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడారు.
''మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే కొనసాగుతారు. ఆయన శివసేన నేత. శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల సేవకు కట్టుబడి పనిచేస్తోంది. ఒకసారి మహారాష్ట్ర వచ్చి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడండి. నాగపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పనులు సూపర్ ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. మెట్రో లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం. రెలిజియస్, టూరిస్ట్ ప్రాంతాల అభివృద్ధి జరుగుతోంది. షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ కలిసికట్టుగా ప్రజాసేవ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. మాది స్థిరమైన ప్రభుత్వం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వంలో ఇరువురూ మహారాష్ట్రకు సేవలందిస్తున్నారు. రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ మేము ఘనవిజయం సాధిస్తాం'' అని పీయూష్ గోయల్ తెలిపారు.
అజిత్ పవార్ చేరిక అవకాశాలపై..
ఎన్‌సీపీ నేత అజిత్ పవార్, ఆయన మద్దతుదారులు బీజేపీలో చేరే అవకాశాలపై సమాధానమిస్తూ... ''అదొక అద్భుతమైన పార్టీ. ఆ పార్టీలో నేతలు తాము రాజీనామా చేస్తున్నామనో, రిటైర్ అవుతున్నామనో చెబుతున్నారు. దాంతో రచ్చ జరుగుతోంది. పునరాలోచన పేరుతో కుటుంబ సభ్యులనే నియమిస్తున్నారు. పార్టీలు దేశం కోసం పనిచేయాలి. కార్యకర్తలు, వారి సామర్థ్యం మీద పార్టీలు పనిచేస్తున్నారు. ఇవి కుటుంబ పార్టీలు. కుటుంబ సభ్యులకే పోస్టులు రిజర్వ్ చేస్తుంటారు. అలాంటి ఆనువంశిక పార్టీలకు ప్రజలే సమాధానం చెప్పాలి. మాతో ఎవరు కలిసి వస్తారు ఎవరు రారనే దాన్ని గురించి మేము పట్టించుకోము. మంచి వ్యక్తులు సహజంగానే మా పార్టీలో చేరుతారు'' అని అన్నారు.
మేము దొంగిలించలేదు...
మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు 40 మంది ఎమ్మెల్యేలను దొంగిలించారు? అని ప్రశ్నించగా, ఏ ఒక్క ఎమ్మెల్యేను తమవైపు తిప్పుకోలేదని గోయల్ సమాధానమిచ్చారు. 54 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు.. అవినీతి, అసమర్ధత ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుని నిజమైన శివసేనగా నిలిచారని చెప్పారు.
కర్ణాటకలో మళ్లీ మాదే అధికారం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని గోయల్ చెప్పారు. కాంగ్రెస్‌లో సీఎం పోస్ట్‌కు ముగ్గురు... సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోటీ పడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల మీదుగా యాత్ర వెళ్లకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీని వెనుక రహస్యం ఏమిటో తెలియదన్నారు. ఇవాళ అసలు కారణమేమిటో కర్ణాటకలో అవగతమైందని చెప్పారు. వాస్తవానికికి అది భారత్ జోడో యాత్ర కాదనీ, కర్ణాటకలో పార్టీ జోడో యాత్ర అని అర్ధమైందన్నారు. సీఎం పదవికి ఇద్దరు పోటీ పడుతుంటే మల్లికార్జున్ ఖర్గే సైతం బరిలోకి దిగారని అన్నారు. ఆ ముగ్గురిలోనూ ఐక్యతను భారత్ జోడో తీసుకువచ్చిందని విశ్లేషించారు. యాత్ర సమయంలో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లోకి ఎందుకు అడుగుపెట్టలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో రాహుల్ అంతగా ప్రచారం సాగించినట్టు కనిపించలేదని, ఆయనను రావద్దని ఆ పార్టీ నేతలే కోరి ఉంటారని, ఆయన వస్తే మరిన్ని ఎక్కువ సీట్లలో ఓడిపోయే అవకాశం ఉందనేది వారి అభిప్రాయం కావచ్చని గోయల్ అన్నారు.
ప్రియాంక ఆరోపణలపై...
తమ ఎమ్మెల్యేలను బీజేపీ దొంగిలించుకుపోతోందంటూ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ, అలాంటి వ్యక్తులకు టిక్కెట్లు ఎందుకు ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తులకు అభ్యర్థులుగా నిలబడితే, వారిని ఎమ్మెల్యేలుగా కర్ణాటక ప్రజలు ఎన్నుకోరని అన్నారు.
కోపమే కొంపముంచింది...
రాహుల్ గాంధీ కోపం వల్లే తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారని గోయల్ అన్నారు. ఆయన చట్టాన్ని గౌరవించాలని, మోదీపై అక్కసు వెళ్లగక్కుతూ ఓబీసీ కమ్యూనిటీని మొత్తం ఆయన అప్రతిష్టపాలు చేశారని, క్షమాపణ చెప్పుకునేందుకు కోర్టు అవకాశం ఇచ్చినప్పుడైనా ఆయన క్షమాపణ చెప్పుకుని ఉంటే ఆ విషయం అంతటితో ముగిసేదని అన్నారు. రాహుల్ క్షమాపణ చెప్పేదేలేదని తెగేసి చెప్పారని అన్నారు. ''ఆయన (రాహుల్) మోదీని మాత్రమే కాదు, మోదీ ఇంటిపేరు ఉన్న ఓబీసీ కమ్యూనిటీని అవమానించారు. దీనిని దేశప్రజలు ఎప్పటికీ అంగీకరించరు'' అని గోయెల్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలకే...
బీజేపీ ప్రభుత్వం నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలకే కొమ్ముకాస్తోందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను పీయూష్ గోయెల్ తిప్పికొట్టారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పథకాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందామని కానీ, సరైన ప్రక్రియ, పారదర్శకత లేకుండా కాంట్రాక్టులు సంపాదించామని కానీ ఒక్క పారిశ్రామికవేత్త అయినా చెప్పిన దాఖలాలు లేనేలేవని అన్నారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గనులు, విద్యుత్, ఇతర ప్రాజెక్టులు అదానీ గ్రూప్‌కు కట్టబెడుతున్నారంటూ రాహుల్ చేసిన ఆరోపణలపైనా అంతే ఘాటుగా గోయల్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అదానీకి తొలి పోర్ట్ అప్పగించిందని, రాజస్థాన్ సీఎం అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును అదానీకి అప్పగించారని, తాము ఎలాంటి భూములు ఇవ్వలేదని, పారదర్శిక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారానే ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్టులను ఇచ్చామని, అత్యధిక బిడ్ వేసిన కంపెనీలే కాంట్రాక్టులు దక్కించుకున్నాయని చెప్పారు.