గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ రెడీ
ABN , First Publish Date - 2023-10-08T05:16:21+05:30 IST
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో కీలక ముందడుగు పడింది.

బెంగళూరు, అక్టోబరు 7: వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో కీలక ముందడుగు పడింది. ఈ మిషన్‌కు సంబంధించి ముందుగా మానవరహిత ఫ్లైట్ పరీక్షలు ప్రారంభించనున్నట్టు ఇస్రో శనివారం ప్రకటించింది. దీనిలో కీలకమైన క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరుని ప్రదర్శించే టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 (టీవీ-డీ1) ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్స్‌లో తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో రాకెట్ నుంచి వ్యోమగాములతో కూడిన ఈ క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా బయటపడేయడంలో ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ సహాయపడుతుంది. ఈ నెలాఖరులో టీవీ-డీ1పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ఇస్రో అధికారులు గతంలో ప్రకటించారు. ఈ ప్రయోగంలో ఉపయోగించే పీడనరహిత క్రూ మా డ్యూల్ ఫొటోలను ఇస్రో తొలిసారిగా విడుదల చేసింది.