Facial recognition : బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారా?... ఈ నిబంధన గురించి తెలుసుకోండి...

ABN , First Publish Date - 2023-01-13T18:20:37+05:30 IST

ఆర్థిక లావాదేవీల్లో మోసాలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరిన్ని చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

Facial recognition : బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారా?... ఈ నిబంధన గురించి తెలుసుకోండి...
Facial Recognition

న్యూఢిల్లీ: ఆర్థిక లావాదేవీల్లో మోసాలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరిన్ని చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఓ పరిమితికి మించిన వార్షిక లావాదేవీలపై నిఘా పెడుతూ, వాటిని నిర్వహించేవారిని వారి ముఖ గుర్తింపు (Facial Recognition) ద్వారా, కొన్ని సందర్భాల్లో ఐరిస్ స్కాన్ (iris scan) ద్వారా నిర్థరించేందుకు బ్యాంకులకు అనుమతి మంజూరు చేస్తోంది. మోసాలను, పన్నుల ఎగవేతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన సమాచారం ప్రకారం, ఆర్థిక లావాదేవీల్లో మోసాలను, పన్నుల ఎగవేతను తగ్గించేందుకు వ్యక్తులను తనిఖీ చేయడానికి బ్యాంకులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిమితికి మించి లావాదేవీలు జరిపినవారిని ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్ ద్వారా గుర్తించేందుకు బ్యాంకులకు అనుమతి ఇస్తోంది.

ఇప్పటికే కొన్ని పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు (Public and Private Banks) ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ప్రారంభించాయి. ఈ విధంగా తనిఖీ చేయడానికి అనుమతించే మార్గదర్శకాలు గోప్యంగా జారీ అయ్యాయి. గతంలో ఇటువంటి ప్రస్తావన కనిపించలేదు. అయితే ఈ వెరిఫికేషన్ తప్పనిసరి కాదని, పాన్ కార్డు వివరాలను బ్యాంకులకు తెలియజేయకుండా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను వినియోగించి, లావాదేవీలు నిర్వహించినవారిని మాత్రమే ఈ విధంగా తనిఖీ చేస్తున్నారని తెలుస్తోంది.

ముఖ గుర్తింపు (Facial Recognition) సాఫ్ట్‌వేర్‌ను బ్యాంకులు వినియోగించే అవకాశాలపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత గోప్యత (Privacy)కు భంగం కలుగుతుందని చెప్తున్నారు. మన దేశంలో వ్యక్తిగత గోప్యత, సైబర్ సెక్యూరిటీ, ఫేషియల్ రికగ్నిషన్ వంటివాటికి వర్తించే చట్టాలు లేవని గుర్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, కొత్త వ్యక్తిగత గోప్యత చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తోంది.

ఖాతాదారులు, డిపాజిటర్లు ఓ ఆర్థిక సంవత్సరంలో ఆధార్ గుర్తింపు పత్రాన్ని సమర్పించి, రూ.20 లక్షలకుపైబడి డిపాజిట్ చేసినా, నగదును ఉపసంహరించుకున్నా, తనిఖీ చేయడానికి కొత్త నిబంధనలు అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తి చేతి వేలిముద్రలు, ముఖం, కళ్ల స్కాన్‌ వివరాలు ఆధార్ సంఖ్యకు అనుసంధానం అయి ఉంటాయన్న సంగతి తెలిసిందే.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇటీవల బ్యాంకులకు ఓ లేఖ రాసింది. ఫేషియల్ రికగ్నిషన్, స్కానింగ్ ద్వారా తనిఖీలను నిర్వహించాలని కోరింది. మరీ ముఖ్యంగా వేలిముద్రలు సరిపోలనపుడు ఈ విధానాన్ని అనుసరించాలని తెలిపింది. ఇటువంటి తనిఖీల కోసం కస్టమర్ నుంచి అనుమతి పొందాలని కానీ, ఒకవేళ కస్టమర్ ఈ తనిఖీలకు తిరస్కరిస్తే తీసుకోదగిన చర్యల గురించి కానీ వివరించలేదు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబరులో కోరింది.

ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకుపైబడిన డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ చేసే కస్టమర్ తన ఆధార్ నంబరు (Aadhar Number) లేదా పాన్ నంబరు (PAN) తప్పనిసరిగా పేర్కొనాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చెప్పిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-01-13T18:20:41+05:30 IST

News Hub