Rahul Gandhi: పార్లమెంటులో ఉన్నా లేకున్నా దేశం కోసం పోరాడతా: రాహుల్
ABN , First Publish Date - 2023-03-25T14:04:54+05:30 IST
సూరత్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత కొద్ది గంటలకే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 కింద తనపై అనర్హత వేటు వేస్తూ..
న్యూఢిల్లీ: సూరత్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత కొద్ది గంటలకే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 కింద తనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సంచలన ఉత్తర్వులు విడుదల చేయడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తొలిసారి స్పందించారు. ''ఈ దేశం నాకు అన్నీ ఇచ్చింది. దేశం కోసం పోరాడతా'' అని అన్నారు. తనను శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా, తన పని తాను చేసుకుంటూనే పోతానని, పార్లమెంటులో ఉన్నానా లేనా అనేది ప్రశ్న కాదని చెప్పారు. దేశం కోసం తాను పోరాటం సాగిస్తూనే ఉంటానని చెప్పారు.
ప్రధాని కళ్లలో భయం చూసా...
అదానీపై తన తదుపరి ప్రసంగం ఎలా ఉంటుందోనని ప్రధామంత్రికి భయం పట్టుకుందని, ఆ భయం ఆయన కళ్లలో తాను చూశానని ప్రధాని అన్నారు. అందువల్లే తొలుత తనపై వక్రీకరణలు చేశారనీ , ఇప్పుడు అనర్హత వేటు వేశారని ఆరోపించారు. నిజం మాట్లాడటం మినహా తనకు వేరేవాటిపై ఆసక్తి లేదని, నిజమే మాట్లాడతానని, తనపై అనర్హత వేటు వేసినా, అరెస్టు చేసినా నిజం కోసం పని చేస్తానని చెప్పారు. ఈ దేశం తనకు అన్నీ ఇచ్చిందని, దేశం కోసమే తాను పనిచేస్తానని అన్నారు. దేశ ప్రజాస్వామ్య స్వభావాన్ని, దేశ వ్యవస్థలను పరిరక్షించడమే తన పని అని, దేశంలోని పేద ప్రజల గళానికి బాసటగా నిలబడటం, అదానీ వంటి వ్యక్తులు ప్రధానితో తమకున్న సంబంధాలతో దేశాన్ని ఎలా వంచిస్తున్నారో ప్రజల ముందుకు వెళ్లి వివరిస్తానని చెప్పారు.
మోదీకి సింపుల్ క్వశ్చన్...
''అదానీ షెల్ కంపెనీల్లో రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఎవరు పెట్టారు? ప్రధానిని నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ ఇది. ఇలాంటి బెదరింపులకో, అనర్హతలకో, జైలు శిక్షలకో నేను భయపడేదే లేదు'' అని రాహుల్ పేర్కొన్నారు. ప్రశ్నలు వేస్తూనే ఉంటానని, దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాటం సాగిస్తూనే ఉంటానని తెలిపారు. పార్లమెంటులో తాను చేసిన ప్రసంగాన్ని తొలగించారని, ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్‌కు తాను సమగ్రంగా లేఖ రాశానని చెప్పారు. విదేశీ శక్తుల జోక్యం తాను కోరానంటూ కొందరు మంత్రులు అబద్ధాలు చెప్పారని, తాను అలాంటి పని ఏదీ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాలపై తాను ప్రశ్నలు గుప్పిస్తూనే ఉంటానని, నిలదీస్తుంటానని స్పష్టం చేశారు.
నా పేరు సావర్కర్ కాదు.. గాంధీ
పార్లమెంటులో క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ మంత్రుల డిమాండ్‌పై మాట్లాడుతూ, తన పేరు సావర్కర్ కాదని, గాంధీ అని, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారు.