India- Pakistan Border: సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్, 3 కిలోల డ్రగ్స్ స్వాధీనం
ABN , First Publish Date - 2023-07-31T13:26:28+05:30 IST
పంజాబ్‌లోని టర్న్ టరన్ జిల్లాలో గల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్థాన్ డ్రోన్, మూడు కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయని అధికారులు తెలిపారు.
చండీగఢ్: పంజాబ్‌లోని టర్న్ టరన్ జిల్లాలో గల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో(India- Pakistan Border) అనుమానిత పాకిస్థాన్ డ్రోన్, మూడు కిలోల హెరాయిన్‌ను(Pakistani Drone and 3-Kg Drugs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయని అధికారులు తెలిపారు. సరిహద్దు భద్రాతా దళాలకు ఆదివారం టర్న్ టరన్‌లోని కలాష్ గ్రామ సమీపంలో డ్రోన్ శబ్దం వినిపించిందని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలోనే మానవరహిత వైమానిక వాహనం పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం భద్రతా దళాలు డ్రోన్‌ను అడ్డగించేందుకు ప్రయత్నించాయని బీఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం పంజాబ్ పోలీసులతో సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఖేమ్‌కరన్ గ్రామ సమీపంలోని పొలంలో డ్రోన్, పసుపు టేప్‌తో చుట్టబడిన 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బీఎస్‌ఎఫ్, పంజాబ్ పోలీసుల సంయుక్త ప్రయత్నాల ద్వారా మరో పాకిస్థాన్ డ్రోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.