IPC Sec Change : ఐపీసీ గాయబ్‌!

ABN , First Publish Date - 2023-08-12T04:02:04+05:30 IST

‘ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం దోషికి యావజ్జీవ శిక్ష విధించడమైనది!’ కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇకపై ఈ మాటలు వినిపించవు. మున్ముందు... ‘బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 99వ ప్రకారం యావజ్జీవ శిక్ష విధిస్తారు. ఔను... ఇండియన్‌ పీనల్‌

IPC Sec Change : ఐపీసీ గాయబ్‌!

  • ఇక.. భారత న్యాయ సంహిత.. సీఆర్పీసీ స్థానంలో ‘నాగరిక్‌ సురక్ష’

  • ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో భారతీయ సాక్ష్య.. కేంద్రం కీలక ప్రతిపాదనలు

  • అన్ని సెక్షన్ల మార్పు, కుదింపు

  • ఐపీసీ 302 పోయి.. బీఎన్‌ఎస్‌ 99

  • దేశద్రోహ చట్టం రద్దు.. కొత్త చట్టం మరింత కఠినం

  • మూక హత్యలకు నిర్వచనం.. ఉరి శిక్ష

  • మైనర్లపై అత్యాచారాలకూ మరణ దండన

  • గ్యాంప్‌ రేప్‌ చేస్తే 20 ఏళ్లు జైలు

  • పోలీసు తనిఖీలను వీడియో తీయాల్సిందే

  • ప్రతి 90 రోజులకు ఎఫ్‌ఐఆర్‌ అప్‌డేట్‌

  • ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్‌ఐఆర్‌ నమోదు

  • ఓటర్లను ప్రలోభపెడితే ఏడాది జైలు

  • నేర న్యాయవ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన

  • బ్రిటిష్‌ కాలంనాటి క్రిమినల్‌ చట్టాల్లోమార్పులు చేస్తూ లోక్‌సభలో 3 బిల్లులు

  • వలసవాద వాసనలకు స్వస్తి: అమిత్‌ షా

పౌర హక్కుల పరిరక్షణకే..

‘ఈ నెల 16 నుంచి 75-100 ఏళ్ల స్వతంత్ర భారత

అమృత కాల రోడ్‌మ్యాప్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో బానిస మనస్తత్వానికి, వలసవాద వాసనలకు ముగింపు పలకాలని ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే బ్రిటిష్‌ పాలకులు రూపొందించిన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టులను రద్దుచేయబోతున్నాం. పౌరుల హక్కుల పరిరక్షణకు వాటి స్థానంలో కొత్త చట్టాలు తీసుకొస్తాం. కోర్టులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కోర్టులకు వెళ్లడమే పెద్దశిక్షగా భావిస్తున్నారు. కొత్త బిల్లుల ప్రధాన లక్ష్యం న్యాయం చేయడమే.. శిక్షించడం కాదు. నేరాలు చేయకూడదన్న భావనను పెంచేలా శిక్షలు ఉంటాయి!

- అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

‘ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం దోషికి యావజ్జీవ శిక్ష విధించడమైనది!’

కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇకపై ఈ మాటలు వినిపించవు. మున్ముందు... ‘బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 99వ ప్రకారం యావజ్జీవ శిక్ష విధిస్తారు. ఔను... ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), నేర శిక్ష్మా స్మృతి (క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌), ఎవిడెన్స్‌ యాక్ట్‌లను సమూల ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. కేవలం వాటి పేర్లను ‘భారతీయీకరణ’ చేయడం కాదు! సెక్షన్లూ పూర్తిగా మారిపోనున్నాయి. దీనిపై కేంద్రం శుక్రవారం పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌-ఐపీసీ (1860) స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) అమలులోకి వస్తుంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌-సీఆర్‌పీసీ(1898)ను పక్కనపెట్టి భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత(బీఎన్‌ఎ్‌సఎస్‌) అమలు చేయనున్నారు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టు(1872) స్థానంలో భారతీయ సాక్ష్య(బీఎ్‌స)ను ప్రవేశపెడతారు. ఈ కొత్త బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం... ఇప్పటిదాకా హత్యా నేరాన్ని సెక్షన్‌ 302 ఐపీసీ కింద నమోదు చేస్తున్నారు. ఇకపై అది... బీఎన్‌ఎస్‌ 99గా మారిపోతుంది. ఇలాంటి అనేక కీలకమైన, సంచలనమైన మార్పులను ఈ బిల్లులలో పొందుపరిచారు. ‘అమృతకాలం’లో వలసవాద చట్టాల వాసన లేకుండా సమూల మార్పులను ప్రతిపాదించారు. ప్రధానంగా బ్రిటిష్‌ కాలంనాటి క్రిమినల్‌ చట్టాల్లో పూర్తి స్థాయి మార్పులను తీసుకొచ్చారు. ఈ బిల్లుల్లోని ముఖ్యాంశాలివి...

రాజద్రోహానికి ‘కొత్తరూపం’

దేశద్రోహ(రాజద్రోహ) చట్టాన్ని (సెక్షన్‌ 124ఏ) కేంద్రం పూర్తిగా రద్దుచేసేసింది. అయితే దానిని కొత్త రూపంలో ముందుకు తెచ్చింది. దాని స్థానంలో 150 సెక్షన్‌ను తీసుకొచ్చింది. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలుగజేసే చర్యలు, వేర్పాటు వాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసకర కార్యకలాపాలు ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి. ఈ నేరాలకు గరిష్ఠంగా జీవిత ఖైదు పడుతుంది. అలాగే మూక హత్యలకు మరణదండనను ప్రతిపాదించింది. మైనర్లపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష, గ్యాంప్‌ రేప్‌ చేస్తే 20 ఏళ్లు జైలుశిక్ష విధించాలని పేర్కొంది.

తనిఖీలను రికార్డు చేయాల్సిందే...

పోలీసుల తనిఖీ ప్రక్రియలను తప్పనిసరిగా వీడియో తీయడం, దేశంలో ఎక్కడి నుంచైనా ఈ-ఎ్‌ఫఐఆర్‌ నమోదు చేయడం.. 90 రోజుల్లో ఎఫ్‌ఐఆర్‌ను అప్‌డేట్‌ చేయడం.. జీరో ఎఫ్‌ఐఆర్‌ విధివిధానాల ఖరారు, సివిల్‌ సర్వెంట్ల ప్రాసిక్యూషన్‌కు నిర్దిష్ట గడువులోగా అనుమతి ఇవ్వడం.. ఈ బిల్లుల్లోని కీలకాంశాలు. వీటన్నిటిపై మరింత లోతుగా చర్చించి తుది రూపు ఇవ్వడానికి బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదిస్తున్నట్లు షా వెల్లడించారు. నేర నిర్ధారణలు 90 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సశాస్త్రీయంగా నేర నిరూపణ చేయడానికి.. ఏడేళ్లు, అంతకుమించిన జైలుశిక్ష పడేందుకు వీలున్న కేసుల్లో నేరఘటనా ప్రాంతాలను ఫోరెన్సిక్‌ బృందాలు తప్పనిసరిగా సందర్శించాలని నిబంధన తెచ్చామన్నారు. సత్వర న్యాయం అందించడానికి ఈ బిల్లులను తీసుకొచ్చినట్లు అమిత్‌ షా చెప్పారు. ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే.. నేర న్యాయవ్యవస్థ సమూలంగా మారుతుందని.. ప్రతి ఒక్కరికీ గరిష్ఠంగా మూడేళ్లలోపే న్యాయం అందుతుందని స్పష్టం చేశారు. చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారికి సామాజిక సేవ శిక్ష విధించాలని తొలిసారి ప్రతిపాదించినట్లు తెలిపారు.

2amith2.jpg

బ్రిటిష్‌ అవసరాల కోసమే..

బ్రిటి్‌షవారు తమ పాలనను వ్యతిరేకించేవారిని శిక్షించే ఉద్దేశంతో ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టాలను రూపొందించారని అమిత్‌షా తెలిపారు. వీటి ఉద్దేశం శిక్షించడమే తప్ప.. న్యాయం అందించడం కాదని చెప్పారు. ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్య అనుభవాలు.. క్రిమినల్‌ చట్టాల సమగ్ర సమీక్షను కోరుతున్నాయన్నారు. అందుకే వర్తమాన అవసరాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు, సంస్కరణలు తెచ్చామని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి కేసు డైరీ వరకు, చార్జిషీట్‌ నుంచి న్యాయం అందే వరకు అన్నీ డిజిటలైజ్‌ అవుతాయని.. 2027 నాటికి అన్ని కోర్టుల్లోనూ కంప్యూటరీకరణ జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మూడు మొబైల్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీలు ఏర్పాటు చేస్తామన్నారు. 18 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 22 న్యాయ విశ్వవిద్యాలయాలు, 142 మంది ఎంపీలు, 270 మంది ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ప్రజలను సంప్రదించి ఈ మూడు బిల్లుల ముసాయిదాలు రూపొందించామని తెలిపారు. గత నాలుగేళ్లలో 158 సమావేశాలు జరిపామన్నారు. ఈ బిల్లులను మరింతగా పరిశీలించేందుకు హోంశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘానికి నివేదించాలని స్పీకర్‌ ఓం బిర్లాను షా కోరారు.

అత్యాచారాలపై కఠిన వైఖరి

పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం, ప్రమోషన్లు ఇప్పిస్తామని మహిళలను లైంగికంగా లొంగదీసుకోవడం, మారు పేరుతో వ్యవహరించడం నేరం. అత్యాచార నిందితులకు కనీసం పదేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదు.. సామూహిక అత్యాచారాలకు కనీసం 20 ఏళ్ల జైలు లేదంటే జీవించి ఉన్నంతవరకు కారాగార శిక్ష విధిస్తారు.. అత్యాచారం తర్వాత బాధిత మహిళ మరణించినా.. కోమాలోకి వెళ్లినా.. నిందితుడికి గరిష్ఠంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. దానిని జీవిత ఖైదుకు పెంచవచ్చు. 12 ఏళ్లకు తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది. దీనిని జరిమానాతో జీవిత ఖైదు లేదా మరణదండన కూడా విధించవచ్చు.

ఎవరైనా పోలీసు అధికారి/పబ్లిక్‌ సర్వెంట్‌/సాయుధ బలగాల సభ్యుడు అత్యాచారానికి పాల్పడితే కనిష్ఠంగా పదేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష విధించాలి. దీనిని జీవిత ఖైదుకు పొడిగించవచ్చు.

అయితే ఒక పురుషుడు 18 ఏళ్లు దాటిన తన భార్యతో లైంగిక క్రియకు పాల్పడం అత్యాచారం కాదు.

ఎన్నికల నేరాలపై..

భారతీయ న్యాయసంహితలో ఎన్నికలకు సంబంధించి ఏకంగా ఒక అధ్యాయాన్నే చేర్చారు. ఓటర్లను ప్రలోభపెట్టడం లేదా తాయిలాలు స్వీకరించడం లంచానికి సంబంధించిన నేరంగా భావిస్తామని పేర్కొన్నారు. అయితే ఓటర్లకు ఇచ్చే హామీని ఒక విధానంగా బహిరంగంగా ప్రకటిస్తే అది నేరం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల నేరాలు, లంచాలు, అభ్యర్థుల వ్యయంలో అవకతవకలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఐపీసీ సెక్షన్లు 171ఏ-171ఎల్‌ పరిధిలోకి వస్తున్నాయి. బీఎన్‌ఎ్‌సలోని 9వ అధ్యాయంలో వీటిని 167-175 సెక్షన్లలో చేర్చారు.

సంస్థాగత నేరాలివీ..

కిడ్నాప్‌, దోపిడీలు, వాహనాల దొంగతనాలు, మామూళ్ల వసూళ్లు, భూకబ్జాలు, కాంట్రాక్టు హత్యలు, ఆర్థిక నేరాలు, తీవ్ర సైబర్‌ నేరాలు, మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారం చేయించడానికి అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, సిండికేట్‌ బెదిరింపులు, భయపెట్టడం, బలప్రయోగం, అవినీతి, ఆర్థిక, ఇతరత్రా ప్రయోజనాలను ఆశించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం సంస్థాగత నేరాల కిందకు వస్తాయి. సంస్థాగత నేరానికి పాల్పడినా.. అందుకు ప్రయత్నించినా.. దానివల్ల ఎవరైనా మరణించినా.. మరణ శిక్ష లేదా జీవిత ఖైదు తప్పవు. రూ.10 లక్షల జరిమానా కూడా విధిస్తారు.

2020 మార్చిలోనే న్యాయ నిపుణుల కమిటీ

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్టులను సంస్కరించేందుకు కేంద్రం 2020 మార్చిలోనే క్రిమినల్‌ లా సంస్కరణల కమిటీని నియమించింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌యూ) అప్పటి ఉపకులపతి ప్రొఫెసర్‌ రణ్‌బీర్‌సింగ్‌ సారథ్యంలో అప్పటి ఢిల్లీ ఎన్‌ఎల్‌యూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జీఎస్‌ బాజ్‌పాయ్‌, డీఎన్‌ఎల్‌యూ వీసీ ప్రొఫెసర్‌ బలరాజ్‌ చౌహాన్‌, సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ, ఢిల్లీ మాజీ జిల్లా-సెషన్స్‌ జడ్జి జీపీ తరేజాలను ఇందులో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ తన అధ్యయన నివేదికను నిరుడు ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి ఢిల్లీ ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్స్‌లర్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీకృష్ణదేవరావు ఆధ్వర్యంలోని కమిటీ అనేక కీలక మార్పులు సూచించింది. శ్రీకృష్ణ దేవరావు ఆ తర్వాత హైదరాబాద్‌ నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయానికి వీసీగా నియమితులయ్యారు.

స్వాగతించిన న్యాయ కోవిదులు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లులను న్యాయ నిపుణులు స్వాగతించారు. దేశంలో కాలం చెల్లిన చట్టాలకు తావు ఉండరాదని ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ సోదీ అన్నారు. వలస చట్టాలకు కాలదోషం పట్టిందని సీనియర్‌ న్యాయవాదులు వికా్‌ససింగ్‌, వికాస్‌ పహ్వా తెలిపారు. అయితే.. భారత శిక్షాస్మృతి, భారత నేరస్మృతి, భారతీయ ఎవిడెన్స్‌ యాక్ట్‌ వంటి విస్తృతంగా వాడుకలో ఉన్న పదాల స్థానంలో హిందీలో కొత్త పేర్లు సూచించడంపై మాత్రం మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హిందీ పేర్లు పెట్టడం అర్థంలేని పని అని సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ వ్యాఖ్యానించారు. అయితే, వలస వాసనలు వదిలిపోయేలా హిందీ పేర్లు సూచించడం బాగుందని జె.సాయిదీపక్‌ అన్నారు.

ఉగ్రవాదం

అంటే..ఉగ్రవాదం అంటే ఏమిటో కేంద్రం తొలిసారి నిర్వచించింది. కొత్త బిల్లులో దాని పరిధిని నిర్దేశించింది. ‘భారతదేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా దేశం బయట లేక లోపల ఉండి ప్రయత్నించేవారంతా ఉగ్రవాదులే. దేశ విచ్ఛిన్నంలో భాగంగా జనజీవనాన్ని లేక అందులోని ప్రధాన సమూహాన్ని భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడాన్ని ఉగ్రవాద చర్యలుగానే పరిగణించాలి. ఉగ్రవాద చర్యలకు పాల్పడినా.. తద్వారా మరణాలు సంభవించినా.. మరణశిక్ష లేదా పెరోల్‌ లేకుండా జీవిత ఖైదు విధించవచ్చు. రూ.10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. ఉగ్రవాద నేరం రుజువై యావజ్జీవ శిక్ష పడినవారి శిక్షాకాలం తగ్గించే అంశాన్ని ఏడేళ్ల శిక్ష అనుభవించిన తర్వాతే పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేర చర్యలకు పాల్పడినవారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

మూక హత్యలంటే..కేంద్రం కొత్త బిల్లులో మూక హత్యను నిర్వచించింది. ‘కులం, భాష, వర్ణం, లింగం, పుట్టిన స్థలం, వ్యక్తిగత విశ్వాసాలతో ఐదుగురుకు మించి ఒక బృందంగా ఏర్పడి మరో బృందంపై సాగించే నేరచర్య మూక హత్య పరిధిలోకి వస్తుంది. ఈ నేరానికి గరిష్ఠంగా మరణశిక్ష, యావజ్జీవ దండన విధించాలి. ఏడేళ్ల పూర్తిశిక్షను అనుభవించిన తర్వాతే శిక్ష తగ్గింపు ను పరిశీలించాలి’ అని స్పష్టం చేసింది.

సెక్షన్లు కుదింపు.. పెంపు

ప్రస్తుతం ఐపీసీలో 511 సెక్షన్లు ఉన్నాయి. కొత్తగా వచ్చే ‘భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స)’లో ఆ సంఖ్యను 356కు కుదించారు. ఇప్పుడు సీఆర్‌పీసీలో 484 సెక్షన్లు ఉండగా.. ‘భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత(బీఎన్‌ఎ్‌సఎ్‌స)లో 533కి పెంచారు. ఎవిడెన్స్‌ యాక్ట్‌లో 167 సెక్షన్లు ఉండగా.. ‘భారతీయ సాక్ష్య(బీఎస్‌)’లో 170కి పెంచారు.

302, 307 సెక్షన్లు మారిపోయాయిఐపీసీలో హత్యానేరం 302 సెక్షన్‌, హత్యాయత్నం 307 సెక్షన్‌, మోసం 420 సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి. ఈ నంబర్లు చెప్పగానే దాదాపు అందరూ నేరాల పేర్లు చెప్పేస్తారు. ఈ సెక్షన్ల పేర్లతో సినిమాలు కూడా వచ్చాయి. అయితే భారతీయ న్యాయ సంహితలో ఇక ఈ సెక్షన్లు ఉండవు. ఈ నేరాలను వేరే సెక్షన్ల పరిధిలోకి మార్చారు.

Updated Date - 2023-08-12T06:39:16+05:30 IST