JDS: ఎంపీ రేవణ్ణపై అనర్హత వేటుతో జేడీఎస్‌లో.. కలకలం..!

ABN , First Publish Date - 2023-09-03T11:31:54+05:30 IST

హాసన్‌ లోక్‌సభ సభ్యుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, జేడీఎస్‌ ఏకైక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ(MP Prajwal Revanna)పై హైకోర్టు

JDS: ఎంపీ రేవణ్ణపై అనర్హత వేటుతో జేడీఎస్‌లో.. కలకలం..!

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): హాసన్‌ లోక్‌సభ సభ్యుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, జేడీఎస్‌ ఏకైక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ(MP Prajwal Revanna)పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఆ పార్టీ శిబిరంలో తీవ్ర నిరాశ ఆవహించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన అరకలగూడు మంజు దాఖలు చేసిన పిటీషన్‌ ఆధారంగా హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఏ మంజు జేడీఎస్‌ ఎమ్మెల్యేగా ఉండడం గమనార్హం. ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన బీజేపీకి రా జీనామా చేసి జేడీఎస్‌ టికెట్‌పై గెలుపొందారు. తాజా పరిణామాలపై హాసన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసును ఉపసంహరించుకోవడం ప్రస్తుతం సాధ్యం కాదని, హైకోర్టు తీర్పు పూర్తి పాఠం అందాకే పార్టీ నేతలతో చర్చించి ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. హైకోర్టు తీర్పు న్యాయానికి దక్కిన గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. ప్రజ్వల్‌ రేవణ్ణ తండ్రి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ బెంగళూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ హై కోర్టు తీర్పును శిరసావహిస్తామన్నారు. న్యాయనిపుణులతో చర్చించిన పిమ్మటే సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

pandu2.3.jpg

ఆ ఇద్దరికీ సమస్య...

ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు అప్పటి ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చే సిన ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ, ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణలపై కూడా సమస్య తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజ్వల్‌ రేవణ్ణ సహా మొత్తం ముగ్గురిపై ప్రజా ప్రతినిధుల చట్టం ప్రకారం కేసు దాఖలు చేయాలని హైకోర్టు సూచించడమే ఇందుకు కారణం. ఒకవేళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలోనూ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ముగ్గురు నేతలు అనర్హత వేటు ఎదుర్కొవాల్సి వస్తుందన్న కథనాలతో జేడీఎస్‌ నేతల్లో కలకలం ప్రారంభమైంది. మాజీ ప్రధాని దేవేగౌడ పెద్దకుమారుడైన హెచ్‌డీ రేవణ్ణతోపాటు ఆయ న ఇద్దరు కుమారులు చట్ట పరమైన సవాళ్లు ఎదుర్కొవాల్సి రావడంతో సహజంగానే ఆ కుటుంబంలోనూ ఆందోళన భరిత వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి చక్కదిద్దేందుకు స్వ యంగా దళపతి దేవెగౌడ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-09-03T11:31:54+05:30 IST