Left-Congress Alliance: కేరళలో కుస్తీ, త్రిపురలో దోస్తి... మోదీ చురకలు
ABN , First Publish Date - 2023-02-11T19:50:35+05:30 IST
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. తొలి ఎన్నికల ప్రచార సభలోనే రాష్ట్రంలోని విపక్ష కాంగ్రెస్, వామపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..
అగర్తలా: త్రిపుర (Tripura) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. తొలి ఎన్నికల ప్రచార సభలోనే రాష్ట్రంలోని విపక్ష కాంగ్రెస్, వామపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. కేరళలో కుస్తీ, త్రిపురలో దోస్తీ...అంటూ ఆ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కొన్ని ఇతర పార్టీలు తెరవెనుక నుంచి కాంగ్రెస్-వామపక్షాల కూటమికి సహకరించవచ్చని, అయితే వాళ్లకు వేసే ప్రతి ఓటు వల్ల రాష్ట్రం కొన్ని ఏళ్లు వెనక్కిపోతుందని హెచ్చరించారు.
గోమతి జిల్లా రాథాకిషోర్‌పూర్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, గతంలో తప్పుడుపాలన సాగించిన ఓల్డ్ ప్లేయర్లు (కాంగ్రెస్-వాపమక్షాలు) ఇప్పుడు చందాల కోసం చేతులు కలిపారని, కేరళలో కుస్తీలు పట్టి, ఇప్పుడు మిత్రత్రం నెరపుతున్నారని అన్నారు. ఓట్లను చీల్చడమే ప్రతిపక్షాల ఉద్దేశమని చెప్పారు. చిన్నగా ఓట్లు చీల్చే పార్టీలు బేరసారాలు నెరపేరందుకు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తుంటాయని అన్నారు.
గిరిజనుల మధ్య విభజన తెచ్చేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని, బీజేపీ మాత్రం వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల అభ్యున్నతి కోసం బీజేపీ పనిచేస్తోందని, మిజోరాం నుంచి వలస వచ్చిన 37,000 మంది Brus గిరిజన జాతులకు త్రిపురలో పునరావాసం కల్పించామని చెప్పారు. హైయర్ ఎడ్యుకేషన్‌లో గిరిజన భాష కకబరక్‌ను చేర్చామని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లోనూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలను బీజేపీ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వామపక్షాలు పాలిస్తున్న ఓ రాష్ట్రంలో కరోనాతో చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, త్రిపుర సురక్షితంగా ఉందని, అందుకోసం బీజేపీ పనిచేసిందని చెప్పారు.
త్రిపురలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొనసాగితే అభివృద్ధి పనులు మరింత ముందుకు సాగుతాయని, రెండంచుల పదునైన (double edged) కాంగ్రెస్-లెఫ్ట్ కత్తిని ఎంచుకుంటే, ప్రజలకు లబ్ది చేకూర్చే అన్ని పథకాలను వాళ్లు ఆపేస్తారని అన్నారు. ప్రజలను ఎలా వంచించాలో మాత్రమే వారికి తెలుసునని, ఏళ్ల తరబడి తప్పులతడక పాలన వల్ల ప్రజలు గతంలో ఎన్నో అవస్థలకు గురయ్యారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో తొలి డెంటల్ కాలేజీ నిర్మాణం జరిగిందన్నారు. ఒక్క గోమతి జిల్లాలోనే రూ.80 కోట్లు రైతు ఖాతాల్లో జమచేశామని, ఇందువల్ల 40,000 మంది రైతులు లబ్ధి పొందారని చెప్పారు. రాష్ట్రంలో భయాలు, చందాల సంస్కృతిని బీజేపీ తరమివేసిందని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీ వల్లత్రిపుర ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనం చేకూరిందన్నారు. ఈశాన్య ప్రాంతాలకు బడ్జెట్ కేటాయింపులు పలు రెట్లు పెంచామని చెప్పారు. త్రిపురలో వామపక్షాలను ఓటుతో తరిమికొట్టి, డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.