Terror Attack: ముంబైపై ఉగ్రదాడి చేస్తామని ఎన్ఐఏకు తాలిబన్ల హెచ్చరిక

ABN , First Publish Date - 2023-02-03T14:01:27+05:30 IST

ముంబైలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఒక మెయిల్ వచ్చింది. తాలిబన్ ఉగ్ర సంస్థ సభ్యుడనని పేర్కొంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ హెచ్చరిక మెయిల్..

Terror Attack: ముంబైపై ఉగ్రదాడి చేస్తామని ఎన్ఐఏకు తాలిబన్ల హెచ్చరిక

న్యూఢిల్లీ: ముంబైలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి ఒక మెయిల్ వచ్చింది. తాలిబన్ ఉగ్ర సంస్థ సభ్యుడనని పేర్కొంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ హెచ్చరిక మెయిల్ వచ్చినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ సమాచారాన్ని ముంబై పోలీసులకు ఎన్ఐఏ తెలియజేయడంతో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మెయిల్ వెనుక నిజానిజాలు నిర్దారించేందుకు ముంబై పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ సంయుక్త దర్యాప్తు చేపట్టింది. గత నెలలోనూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ అంతర్జాతీయ పాఠశాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.

2022లో బాంబు బెదిరింపు

అక్టోబర్ 2022లో ఇదే తరహాలో ముంబై నగరంలో పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్టు పోలీసులకు బెదరింపు ఫోన్ కాల్ వచ్చింది. సిటీలోని ఇన్ఫినిటీ మాల్ అంథేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్టులో ఈ బాంబులు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి బెదిరించాడు. ఈ క్రమంలోనే 2022 ఆగస్టులో అండర్ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడైన సలీమ్ ఖురేషి అలియాస్ సలీమ్ ఫ్రూట్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఛోటా షీకీల్ సన్నిహితుడిగా కూడా ఖురేషికి పేరుంది. షకీల్ పేరుతో ఆస్తుల తగాదాల పరిష్కారంతో భారీగా సొమ్ములు వసూలు చేసేవాడని, వాటిని డీ కంపెనీ తరఫున ఉగ్రకార్యకలాపాల నిధుల కోసం ఈ చర్యలకు పాల్పడేవాడని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

కాగా, 2023-2024 కేంద్ర బడ్జెట్‌ను తాలిబన్‌లు స్వాగతించిన క్రమంలో తాలిబన్ సభ్యుడనని పేర్కొంటూ బెదరింపు మెయిల్ రావడం ఆసక్తికరం. కేంద్ర బడ్జెట్‌లో ఆప్ఘన్‌కు చేసిన సహాయ ప్రకటన ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడటానికి, పరస్పర విశ్వాసం పాదుకొలిపేందుకు ఉపయోగిస్తుందని తాలిబన్ మాజీ సంప్రదింపుల బృందం సభ్యుడు సుషైల్ షహీన్ పేర్కొన్నారు. నిర్మలా సీతారమన్ ఈనెల 1న పార్లమెంటుకు సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ఆప్ఘనిస్థాన్‌కు 25 మిలియన్ డాలర్ల ఎయిడ్ ప్యాకేజీని ప్రకటించింది. ఆప్ఘన్ అభివృద్ధికి భారత్ మద్దతివ్వడం అభినందనీయమని సుహైల్ షహీన్ ప్రకటించారు.

Updated Date - 2023-02-03T14:04:53+05:30 IST