Fact Check : ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలివ్వడం లేదా?
ABN , First Publish Date - 2023-08-17T11:07:55+05:30 IST
కాంగ్రెస్ విధేయుడు, టీవీ చర్చల్లో విశ్లేషకుడిగా పాల్గొనే తెహసీన్ పూనావాలా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మూడు నెలల నుంచి ప్రభుత్వం జీతాలివ్వడం లేదన్నారు. ఈ ఆరోపణలపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సమాచారాన్ని సేకరించింది.
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో పని చేస్తున్న శాస్త్రవేత్తలకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. వీరికి ప్రతి నెలా చివరి రోజున జీతాలు చెల్లిస్తున్నట్లు వివరించింది. అసలు నిజాలు బయటపడటంతో ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ విధేయుడు తెహసీన్ పూనావాలాను ఆయన సోదరుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా దుయ్యబట్టారు.
తాము సోదరులమే అయినప్పటికీ తనకు కుటుంబం కన్నా దేశమే గొప్ప అని షెహజాద్ పూనావాలా తెలిపారు. ఇస్రో గురించి, భారత దేశం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని వదిలిపెట్టబోనని చెప్పారు.
కాంగ్రెస్ విధేయుడు, టీవీ చర్చల్లో విశ్లేషకుడిగా పాల్గొనే తెహసీన్ పూనావాలా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మూడు నెలల నుంచి ప్రభుత్వం జీతాలివ్వడం లేదన్నారు. ఈ ఆరోపణలపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సమాచారాన్ని సేకరించింది. ఈ ఆరోపణలు వాస్తవం కాదని, బూటకపు వదంతులని తెలిపింది.
ఈ ఆరోపణలు చేసిన తెహసీన్ పూనావాలా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, చంద్రయాన్-3లో పని చేసిన ఇంజినీర్లు, ఆ క్రింది స్థాయి ఉద్యోగులకు మూడు నెలల నుంచి జీతాలివ్వడం లేదన్నారు. జీతాలివ్వనిది ఇస్రో సైంటిస్టులకు కాదు, చంద్రయాన్-లో పని చేసిన ఇంజినీర్లకు అయినంత మాత్రానికి నేరం తీవ్రత తగ్గిపోదన్నారు.
దీనిపై షెహజాద్ పూనావాలా (బీజేపీ) స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, జీతాలు అందనిది ఇస్రో శాస్త్రవేత్తలకు కాదని, ఇస్రోకు చెందని కొందరు ఇంజినీర్లకు జీతాలు అందలేదని ఇప్పుడు మీరు అంగీకరించారన్నారు. ‘‘ఇప్పుడు చాలా గౌరవప్రదమైన విషయం ఏమిటంటే, ఇస్రోకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పండి. మీరు కానీ, మీ కాంగ్రెస్ పెద్దలు కానీ క్షమాపణ చెప్పరని నాకు తెలుసు’’ అన్నారు.
‘‘నేను ఎల్లప్పుడూ నా దేశానికే పెద్ద పీట వేస్తాను. కుటుంబానికి చిట్ట చివరి స్థానం ఇస్తాను. నా సొంత కుటుంబ సభ్యులు ఇస్రో గురించి, భారత దేశం గురించి బూటకపు వార్తలను ప్రచారం చేసినా, నేను వారిని తప్పుబడతాను’’ అని షెహజాద్ స్పష్టం చేశారు. తెహసీన్ పూనావాలా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ధ్రువీకరించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అన్నదమ్ముల బంధం
తెహసీన్ పూనావాలా, షెహజాద్ పూనావాలా సోదరుల మధ్య 2017 నుంచి సత్సంబంధాలు లేవు. అప్పట్లో షెహజాద్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్‌గా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల ప్రక్రియను షెహజాద్ విమర్శించారు. ఇదంతా నకిలీ ప్రక్రియ అని దుయ్యబట్టారు. అనంతరం ఆ పార్టీని వదిలిపెట్టి, బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అయితే వీరిద్దరూ టెలివిజన్ డిబేట్లలో పాల్గొంటూ ఉంటారు. తెహసీన్ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా సమీప బంధువును తెహసీన్ పూనావాలా వివాహం చేసుకున్నారు.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్‌పై తెహసీన్ పూనావాలా స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, జీతాలు అందనిది శాస్త్రవేత్తలకు కాదని చెప్పినందుకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన సందర్భం జీతాలు చెల్లించకపోవడమని తెలిపారు. మీరు ఇప్పటికీ సరైన వివరాలను ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇస్రోకు అనుబంధంగా ఉన్న ఓ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఇంజినీర్లకు జీతాలు అందలేదని, జీతాలు అందనిది సైంటిస్టులకు కాదని తెలిసిందని చెప్పారు. అయితే ఇది నేర తీవ్రతను తగ్గిస్తుందా? ఈ ట్వీట్‌తో జత చేసిన న్యూస్ ఐటమ్స్ నిజం కాదా? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
Supreme Court: మహిళలపై అనుచిత పదాలకు చెల్లు
Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..