Karnataka : భాషలతో రాజకీయాలు : మోదీ
ABN , First Publish Date - 2023-03-25T15:11:40+05:30 IST
భాషలకు తగిన మద్దతు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఆటలాడుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
చిక్కబళ్లాపుర : భాషలకు తగిన మద్దతు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఆటలాడుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. గ్రామీణ, పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అవాలని ఆ పార్టీలు కోరుకోవడం లేదన్నారు. ఈ వర్గాలకు చెందినవారు వైద్య వృత్తిలో ప్రవేశించడం కోసం ఎదుర్కొంటున్న సవాళ్ళను ప్రస్తావించారు. తన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సవాళ్లను అర్థం చేసుకుందని, వైద్య విద్యను కన్నడం (Kannada)తో సహా భారతీయ భాషల (Indian Languages)లో చదివే అవకాశాన్ని కల్పించిందని చెప్పారు.
మోదీ శనివారం మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR)ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భాషలతో ఆటలాడుకున్నాయన్నారు. భాషలకు అవసరమైన అర్థవంతమైన మద్దతు ఇవ్వడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కృషి చేయలేదన్నారు. కన్నడం సుసంపన్నమైన భాష అని చెప్పారు. దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసే భాష కన్నడం అని చెప్పారు. గత ప్రభుత్వాలు మెడికల్, ఇంజినీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను కన్నడంలో కూడా బోధించేందుకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. గ్రామీణ, పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు కాకూడదనేదే కొన్ని రాజకీయ పార్టీల ఉద్దేశమని చెప్పారు. కానీ తన ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తోందని, వైద్య విద్యను కన్నడంతో సహా భారతీయ భాషల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించిందని చెప్పారు. చాలా కాలం వరకు పేదలను ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలు జరిగాయని తెలిపారు. కానీ బీజేపీ (BJP) ప్రభుత్వం మాత్రం పేదలకు సేవ చేయడమే అత్యున్నత కర్తవ్యంగా భావిస్తోందన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. చౌక ధరలకు ఔషధాలను అందజేయడం కోసం జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఓ అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మోదీ ప్రారంభించిన ఎస్ఎంఎస్ఐఎంఎస్ఆర్ పూర్తిగా ఉచిత వైద్య కళాశాల, ఆసుపత్రి. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా, ముద్దెనహళ్లి, సత్యసాయి గ్రామంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ వైద్య విద్య, వైద్య సంరక్షణ పూర్తిగా ఉచితం. రానున్న విద్యా సంవత్సరం నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..
Chennai: జయలలిత స్నేహితురాలు శశికళ సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..