Modi-Putin: ఈ ఏడాది చివర్లో సమ్మిట్ నిర్వహించనున్న మోదీ, పుతిన్.. అందుకోసమేనా?

ABN , First Publish Date - 2023-10-12T19:59:24+05:30 IST

ఈ ఏడాది చివర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించే అవకాశం ఉందని.. రష్యాలో ఉన్న భారత రాయబారిని ఉటంకిస్తూ...

Modi-Putin: ఈ ఏడాది చివర్లో సమ్మిట్ నిర్వహించనున్న మోదీ, పుతిన్.. అందుకోసమేనా?

ఈ ఏడాది చివర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించే అవకాశం ఉందని.. రష్యాలో ఉన్న భారత రాయబారిని ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ RIA పేర్కొంది. ఈ వార్త నిజమే అన్నట్టు దౌత్యవేత్త పవన్ కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. ఒకవేళ అన్ని కుదిరితే మోదీ, పుతిన్ కలిసి శిఖరాగ్ర సమావేశం నిర్వహించవచ్చని తెలిపారు. అయితే.. ఇంతకుమించి ఆయన ఇతర వివరాల్ని వెల్లడించలేద. వేదిక ఎక్కడ అన్న విషయంపై కూడా క్లారిటీ రాలేదు. అన్ని అనుకున్నట్టు సాగితే.. ఈ సమ్మిట్ భారతదేశంలోనే ఉండొచ్చని తెలుస్తోంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

అయినా.. మోదీ, పుతిన్ ప్రత్యేకంగా ఈ సమ్మిట్ నిర్వహించడానికి ఒక కారణం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 9-10 తేదీల్లో ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన జీ20 సమ్మిట్‌కు పుతిన్ హాజరు కాలేదు. ఆయన స్థానంతో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ సమ్మిట్‌కి విచ్చేసి, రష్యాకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆమోదించబడిన ఢిల్లీ డిక్లరేషన్‌లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. దానిపై నేరుగా పుతిన్‌తో చర్చలు జరిపితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో.. ఈ సమావేశం ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు.. భారత్, రష్యా మధ్య సంబంధాల గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

కొన్ని రోజుల క్రితమే భారత్ ఎంతో శక్తివంతమైన దేశమని పుతిన్ కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ దేశం మరింత బలంగా ఎదుగుతోందని, దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సాహించడంలో భాగంగా మోదీ తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోగ్రామ్ ఎంతో అద్భుతమైనదని ప్రశంసించారు. దీన్ని బట్టి ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంత గట్టిగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా.. మోదీ, పుతిన్ చివరిసారిగా 2022 సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 22వ సమావేశం సందర్భంగా కలుసుకున్నారు. ఆ సమయంలోనే ఉక్రెయిన్‌తో రష్యా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలకాలని, ఇది యుద్ధం యుగం కాదని పుతిన్‌కి మోదీ చెప్పారు.

Updated Date - 2023-10-12T19:59:24+05:30 IST