SBI report : మధ్య తరగతి ప్రజలకు ఆనందం కలిగించే వార్త చెప్పిన ఎస్‌బీఐ నివేదిక
ABN , First Publish Date - 2023-08-18T14:16:17+05:30 IST
దేశ ప్రజల ఆదాయంపై భారతీయ స్టేట్ బ్యాంకు (SBI) పరిశోధనాత్మక నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్న ధోరణిని అవగాహన చేసుకున్నపుడు మధ్య తరగతి భారతీయుల ఆదాయం గడచిన పదేళ్లలో మూడు రెట్లకు పెరిగినట్లు తెలిపింది.
న్యూఢిల్లీ : దేశ ప్రజల ఆదాయంపై భారతీయ స్టేట్ బ్యాంకు (SBI) పరిశోధనాత్మక నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్న ధోరణిని అవగాహన చేసుకున్నపుడు మధ్య తరగతి భారతీయుల ఆదాయం గడచిన పదేళ్లలో మూడు రెట్లకు పెరిగినట్లు తెలిపింది. 2012-2013 ఆర్థిక సంవత్సరంలో సగటు ఆదాయం రూ.4.4 లక్షలు కాగా, 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.13 లక్షలకు పెరిగిందని వివరించింది. ఈ కాలంలో దిగువ మధ్య తరగతి ప్రజలు అధిక ఆదాయ వర్గంలోకి ఎదిగినట్లు తెలిపింది.
2010-11 ఆర్థిక సంవత్సరంలో 1.60 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారని ఈ నివేదిక తెలిపింది. వీరిలో సుమారు 84 శాతం మంది రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారి జాబితాలో ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ ధోరణి 2021-22 ఆర్థిక సంవత్సరంనాటికి బాగా మారిపోయినట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 6.85 కోట్ల మంది ఐటీఆర్‌లను దాఖలు చేశారని, వీరిలో 64 శాతం మంది మాత్రమే రూ.5 లక్షల లోపు ఆదాయ వర్గంలో ఉన్నారని చెప్పింది. దీనినిబట్టి గడచిన పదేళ్లలో జనాభాలో 13.6 శాతం మంది తక్కువ ఆదాయ వర్గం నుంచి అధిక ఆదాయ వర్గంలోకి చేరారని స్పష్టమవుతోందని తెలిపింది.
జీరో ట్యాక్స్ లయబిలిటీతో దాఖలయ్యే ఐటీఆర్‌ల సంఖ్య తగ్గుతుండటం సానుకూల ధోరణి అని Deciphering Emerging Trends in ITR Filing శీర్షికతో వెలువడిన ఈ నివేదిక తెలిపింది. వ్యక్తి యొక్క పన్ను విధించదగిన ఆదాయం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి కన్నా తక్కువగా ఉన్న సందర్భంలో ఇటువంటి ఐటీఆర్‌లను దాఖలు చేస్తారు. అంటే వీరు పన్ను చెల్లించవలసిన అవసరం ఉండదు. ఇటువంటి ఐటీఆర్‌లు 2010-11 ఆర్థిక సంవత్సరంలో 84.1 శాతం ఉండేవని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 64 శాతం ఉన్నాయని, అంటే తగ్గుదల కనిపిస్తోందని వివరించింది.
ఈ సంతోషకర ధోరణి ఇకపై కూడా కొనసాగుతుందని ఈ నివేదిక తెలిపింది. 2047నాటికి మధ్య తరగతి ప్రజల సగటు ఆదాయం సంవత్సరానికి రూ.49.70 లక్షలకు పెరగవచ్చునని అంచనా వేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా తక్కువ ఉన్నవారి జాబితా నుంచి ఐటీఆర్ దాఖలు చేసేవారిలో 25 శాతం మంది 2046-47 ఆర్థిక సంవత్సరంనాటికి వైదొలగుతారని అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 53 కోట్ల మంది ఉద్యోగ బృందం ఉందని, ఇది 2046-47 నాటికి 72.5 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఐటీఆర్‌లను దాఖలు చేసేవారు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల మంది కాగా, వీరి సంఖ్య 2046-47 నాటికి 48.2 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి :
Plane Crash : మలేసియాలో విమాన ప్రమాదం.. 10 మంది మృతి..
Indian Muslims : భారతీయ ముస్లింలపై గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు.. బజరంగ్ దళ్, వీహెచ్‌పీ స్పందన..