Shashi Tharoor: ఇండియాకు అది ఎంతో గర్వకారణం.. జీ20 షెర్పాపై శశి థరూర్ ప్రశంసలు

ABN , First Publish Date - 2023-09-10T18:13:41+05:30 IST

ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన జీ20 సదస్సులో ‘ఢిల్లీ డిక్లరేషన్’పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మీద భారత్ చేసిన కృషిని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు...

Shashi Tharoor: ఇండియాకు అది ఎంతో గర్వకారణం.. జీ20 షెర్పాపై శశి థరూర్ ప్రశంసలు

ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన జీ20 సదస్సులో ‘ఢిల్లీ డిక్లరేషన్’పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మీద భారత్ చేసిన కృషిని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన జీ20 షెర్పా అమితాబ్ కాంత్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘‘అమితాభ్ కాంత్ అద్భుత పాత్ర పోషించారు. మీరు ఐఏఎస్‌ని ఎంపిక చేసుకున్నప్పుడు ఐఎఫ్ఎస్ ఒక ప్రముఖ దౌత్యవేత్తను కోల్పోయినట్లు కనిపిస్తోంది. రష్యా, చైనాతో జరిపిన చర్చల అనంతరం ఢిల్లీ డిక్లరేషన్‌పై ఓ ముసాయిదాను రూపొందించారు. జీ20 సదస్సులో ఇది భారత్‌కు ఎంతో గర్వకారణం’’ అంటూ శశి థరూర్ పేర్కొన్నారు.


కాగా.. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం విషయంలో ఢిల్లీ డిక్లరేషన్ తీర్మానంలో భారత్ పేర్కొన్న ‘పేరా’కు జీ20 సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. అయితే.. ఈ అంశంపై జీ20 నాయకుల నుంచి ఏకాభిప్రాయం సాధించేందుకు దాదాపు 200 గంటలపాటు నిరంతర చర్చలు అవసరమని శనివారం ఓ ఇంటర్వ్యూలో అమితాభ్ కాంత్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల కలుగుతున్న ఆర్థిక ప్రభావం గురించి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో చర్చల దగ్గర నుంచి రష్యా & చైనాలతో ద్వైపాక్షిక సమావేశాల వరకు.. పలు రౌండ్ల చర్చలు జరిపామని అన్నారు. ఫలితంగా.. శుక్రవారం అర్థరాత్రి ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన వివరించారు.

ఒక సమావేశంలో తాను 15 సూత్రాలను రాసుకున్నానని, అప్పుడు ఇతర షెర్పాలు ముందుకొచ్చి తమ దృక్కోణాలను అందించారని అమితాభ్ కాంత్ అన్నారు. దాని ఆధారంగా మొదటి ముసాయిదాని రూపొందించామన్నారు. దీనిపై ఏకాభిప్రాయానికి వస్తామని తాము ఊహించలేదన్నారు. నిజానికి.. కొన్ని అంశాలపై సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండేవి. కానీ.. చర్చల ద్వారా భారత్ ఎట్టకేలకు సభ్య దేశాల ఏకాభిప్రాయాన్ని సాధించింది. దీంతో.. ఇది భారత్‌కు అతిపెద్ద విజయమని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో తలెత్తిన చిక్కుముడిని భారత్ ఎంతో తెలివిగా, చాకచక్యంగా పరిష్కరించిందని కొనియాడుతున్నారు.

Updated Date - 2023-09-10T18:13:41+05:30 IST