Siddharamaiah: వివాదాస్పదంగా మారిన కుమారుడి ‘వీడియో’.. చిక్కుల్లో సీఎం సిద్ధరామయ్య
ABN , First Publish Date - 2023-11-16T21:49:05+05:30 IST
ఎన్నికలు ముగిసినప్పటి నుంచే హాట్ హాట్‌గా కొనసాగుతున్న కర్ణాటక రాజకీయాల్లో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్యకు ఆయన కుమారుడు యతీంద్ర రూపంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయనకు సంబంధించిన ఓ వీడియో...
ఎన్నికలు ముగిసినప్పటి నుంచే హాట్ హాట్‌గా కొనసాగుతున్న కర్ణాటక రాజకీయాల్లో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్యకు ఆయన కుమారుడు యతీంద్ర రూపంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇదే అదునుగా ప్రతిపక్షాలు సీఎం సిద్ధరామయ్యపై ధ్వజమెత్తారు. రాష్ట్ర పాలన మొత్తం సిద్ధరామయ్య కుమారుడి చేతుల్లోనే నడుస్తోందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఒకరు వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోలో యతీంద్ర ఒక జాబితాలోని పేర్లను ప్రస్తావిస్తూ.. కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని, ఫోన్‌లో అవతలి వ్యక్తుల్ని సూచించారు. ఈ సంభాషణే సీఎం పాలిట శాపంగా మారింది. అధికారుల బదిలీల గురించే యతీంద్ర మాట్లాడారని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఆయన ఎవరితో మాట్లాడారు? ఆ జాబితాలో ఉన్న వ్యక్తులెవరు? ఈ మొత్తం వ్యవహారం ఏంటనే విషయాలపై దర్యాప్తు జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అటు బీజేపీ సైతం ఈ వీడియోపై విరుచుకుపడింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా ఆయన కుమారుడు యతీంద్రనే కీలకశక్తిగా మారారని, పాలన మొత్తం సీఎం కొడుకు చేతుల్లోనే నడుస్తోందంటూ విమర్శించింది.
అయితే.. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ఆ ఫోన్‌లో యతీంద్ర మాట్లాడింది అధికారుల బదీలల గురించి కాదని.. సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాల భవనాల నిర్మాణం గురించి తనతోనే మాట్లాడారని స్పష్టం చేశారు. దీనిపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కరెంటును దొంగలించిన కుమారస్వామి.. ఆ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు.. డబ్బులు తీసుకొని అధికారులను బదిలీ చేసినట్లు ఆధారాలు చూపిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ఛాలెంజ్ చేశారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా యతీంద్రకు మద్దతుగా నిలుస్తూ.. సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపైనే చర్చించారని క్లారిటీ ఇచ్చారు.