Share News

Mehbooba Mufti: 370 అధికరణపై సుప్రీంకోర్టు నిర్ణయం దేవుడి తీర్పేమీ కాదు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్య

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:26 PM

జమ్మూకశ్మీర్‌ కు స్వయం ప్రతిపత్రి కల్పించే 370వ అధికరణను కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్ధిస్తూ ఇటీవల ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నిశిత విమర్శ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం దేవుడి తీర్పేమీ కాదని అన్నారు.

Mehbooba Mufti: 370 అధికరణపై సుప్రీంకోర్టు నిర్ణయం దేవుడి తీర్పేమీ కాదు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్య

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)కు స్వయం ప్రతిపత్రి కల్పించే 370వ అధికరణను (Article 370) కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు (Supreme court) సమర్ధిస్తూ ఇటీవల ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) నిశిత విమర్శ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం దేవుడి తీర్పేమీ (God's verdict) కాదని అన్నారు. తాము ఇంకా ఆశ వదులుకోలేదని, తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.


జమ్మూకశ్మీర్ ‌నుంచి లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను తాము సమర్ధిస్తున్నట్టు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈనెల 11న ఇచ్చిన తీర్పులో పేర్కొంది. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరిపాలని భారత ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రప్రతిపత్తిని పునరుద్ధరించాలని పేర్కొంది. దీనిపై మెహబూబూ ముఫ్తీ ఆదివారంనాడు స్పందిస్తూ, కోర్టు నిర్ణయాన్ని దేవుడి తీర్పుతో సమానంగా చూడలేమన్నారు.


''మేము ఇంకా అశ వదులుకోలేదు. జమ్మూకశ్మీర్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. ఎన్నో కష్టనష్టాలు చవిచూశారు. వాళ్లు మమ్మల్ని ఆశవదులుకోమంటున్నారు. ఓటమిని ఒప్పుకుని ఇంట్లో కూర్చోమంటున్నారు. ఇది ఎన్నటికీ జరగదు. మేము చివరి వరకూ పోరాడతాం. సుప్రీంకోర్టు తీర్పు దేవుడి తీర్పు కాదు. ఇదే సుప్రీంకోర్టు గతంలో రాజ్యాంగ సభ (Constituent assembly) సిఫారసు లేకుండా 370వ అధికరణను తొలగించలేమని చెప్పింది. వాళ్లు కూడా జడ్జీలే. ఇవాళ వేరే జడ్జీలు తీర్పు చెపపారు. దీనిని దేవుడు తీర్పుగా మేము భావించలేం. మా పోరాటం కొనసాగుతుంది'' అని మెహబూబా ముఫ్తీ చెప్పారు.

Updated Date - Dec 17 , 2023 | 06:26 PM