Note ban Valid: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు ఇవే..

ABN , First Publish Date - 2023-01-02T12:15:32+05:30 IST

నల్లధనం (Black money), నకిలీ కరెన్సీ(Fake currency), పన్ను ఎగవేతలు, ఉగ్రవాద మూకలకు నిధులు చేరకుండా నియంత్రించడమే లక్ష్యంగా నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు (demonetisation) నిర్ణయాన్ని ప్రకటించింది.

Note ban Valid: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు ఇవే..

ల్లధనం (Black money), నకిలీ కరెన్సీ(Fake currency), పన్ను ఎగవేతలు, ఉగ్రవాద మూకలకు నిధులు చేరకుండా నియంత్రించడమే లక్ష్యంగా నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు (demonetisation) నిర్ణయాన్ని ప్రకటించింది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుతో రాత్రికి రాత్రే చలామణిలోని రూ.10 లక్షల కోట్ల విలువైన కరెన్సీ తుడిచిపెట్టుకుపోయింది. కేంద్ర ప్రభుత్వం (Central Govt) నాడు తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్ట్ (supreme court) సమర్థించిన నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్ట్‌లో జరిగిన కీలక వాదనలను ఒకసారి పరిశీలిద్దాం...

1. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రం ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌దార్లు అభ్యర్థించారు.

2. ప్రత్యక్షంగా ఏలాంటి ఉపశమనమివ్వని అంశంలో సుప్రీంకోర్ట్ నిర్ణయం సబబుకాబోదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఇలా చేయడమంటే.. గడియారాన్ని వెనక్కి తిప్పడం, పగిలిన గుడ్డును అతికించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది.

3. శీతాకాలం విరామానికి ముందు డిసెంబర్ 7న సుప్రీంకోర్ట్ ఐదుగురు సభ్యుల బెంచ్ వాదనలు విన్నది. ఈ బెంచ్‌కు జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వం వహించారు. అయితే తీర్పును వాయిదా వేసి తాజాగా సోమవారం ప్రకటించారు.

4. తగిన సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం సమర్థించుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీ, పన్ను ఎగవేతలు, ఉగ్రవాద గ్రూపులకు నిధులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

5. అయితే నకిలీ కరెన్సీ లేదా బ్లాక్ మనీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యమ్నాయ పద్ధతులను చూపలేదని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ అడ్వకేట్ పి.చిదంబరం వాదించారు.

6. పెద్ద నోట్ల రద్దుపై చట్టబద్ధ ప్రక్రియను ప్రారంభించలేదని చిదంబరం ప్రస్తావించారు. ఒక్క ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సును మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని తప్పుబట్టారు.

7. నోట్ల రద్దు ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. నవంబర్ 7న ఆర్బీఐకి రాసిన లేఖను కూడా చూపించలేదని, ఆర్బీఐ సమావేశం మినిట్స్‌ను కూడా వెల్లడించలేదని చిదంబరం తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

8. ఇక ఆర్థిక విధాన నిర్ణయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రాబోవని ఆర్బీఐ న్యాయవాది వాదించారు. అయితే ఆర్థిక విధాన నిర్ణయమనే కారణంతో చేతులు కట్టుకుని కూర్చోబోదని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. పిటిషన్లను పరిగణలోకి తీసుకుని పరిశీలించింది.

9. జనాలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆర్బీఐ... దేశ నిర్మాణంలో ఇలాంటి పరిస్థితులు సహజమేనని సమర్థించుకుంది. ఈ తర్వాత సమస్యలను పరిష్కరించినట్టు సుప్రీంకోర్టుకు వివరించింది.

10. పెద్ద నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎన్నో వ్యాపారాలు నాశనమవ్వడంతోపాటు ఎంతోమంది ఉపాధి కోల్పోయారని మండిపడ్డాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. పెద్ద నోట్ల రద్దు చేసిన ఆరేళ్ల తర్వాత 2016 నాటి కంటే 72 శాతం కరెన్సీ ఎక్కువగా చలామణీలో ఉందని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా గుర్తించాలని, లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని విమర్శించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-02T12:32:31+05:30 IST