Asaduddin Owaisi: ఆర్జేడీ 'శవపేటిక' పోలికపై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-05-28T14:19:01+05:30 IST
కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో రాష్ట్రీయ జనతాదళ్ పోల్చడాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. బీహార్‌కు సంబంధించిన పార్టీ ఈ కోణంలో పోలిక తీసుకురావడం సరికాదని అన్నారు.
నాగపూర్: కొత్త పార్లమెంటు భవనాన్ని (New parliament Building) శవపేటికతో (Coffin) రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పోల్చడాన్ని ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తప్పుపట్టారు. బీహార్‌కు సంబంధించిన పార్టీ ఈ కోణంలో పోలిక తీసుకురావడం సరికాదని అన్నారు. అయితే, పార్లమెంటు భవనాన్ని నరేంద్ర మోదీ కాకుండా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ప్రారంభించి ఉంటే మెరుగ్గా ఉండేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు.
''ఆర్జేడీకి నిర్దిష్ట వైఖరి అనేది లేదు. కొన్నిసార్లు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. బీజేపీ నుంచి వచ్చిన నితీష్ కుమార్‌ను తమ సీఎంగా చేసుకున్నారు. పాత పార్లమెటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదు. పార్లమెంటును శవపేటికతో ఆర్జేడీ ఎందుకు పోల్చింది? ఇంకేదైనా మాట్లాడి ఉండొచ్చు. ఈ కోణంలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?'' అని ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కొత్త పార్లమెంటు భవనాన్ని మోదీకి బదులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించి ఉంటే మెరుగ్గా ఉండేదని, అన్నీ తానే చేయగలనని, ఇంకెవరి వల్లా కాదని చాటుకోవాలని ప్రధాని కోరుకుంటున్నారని, వ్యక్తిగత ప్రమోషన్ కోసం ప్రధాని ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నారని ఒవైసీ నిశిత విమర్శ చేశారు.
దీనికి ముందు, ఆర్జేడీ ఆదివారం ఉదయం ఇచ్చిన ట్వీట్‌లో ఓ శవపేటిక, నూతన పార్లమెంటు భవనం చిత్రాలను పక్కపక్కనే పెట్టి, ‘ఇదేమిటి?’ అని ప్రశ్నించింది. దీనిపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ, తమ పార్టీ ఇచ్చిన ట్వీట్‌లో శవపేటిక ఉందని, ప్రజాస్వామ్యం సమాధి అవుతోందని చెప్పడమే దీని వెనుక ఉద్దేశమని చెప్పారు. దీనిపై బిహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చినవారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.