AIADMK Vs BJP : బీజేపీతో తెగదెంపులకు ఏఐఏడీఎంకే సిద్ధం?
ABN , First Publish Date - 2023-06-13T09:42:50+05:30 IST
దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగలబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
చెన్నై : దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగలబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కర్ణాటకలో ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చిన కొద్ది నెలల్లోనే తమిళనాడులో ఏకైక మిత్ర పక్షం ఏఐఏడీఎంకే ఆ పార్టీ చేయి విడిచే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై (K Annamalai) చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని తెలుస్తోంది. ఆయనను అదుపులో పెట్టాలని ఇప్పటికే బీజేపీ అధిష్ఠానాన్ని ఏఐఏడీఎంకే హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అణ్ణామలై అటు అధికారంలో ఉన్న డీఎంకేను, ఇటు మిత్ర పక్షం ఏఐఏడీఎంకేను సమాన స్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకేకు అత్యంత ముఖ్యమైన ‘అమ్మ’ జయలలితపై కే అణ్ణామలై చేసిన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకేకు ఆగ్రహం తెప్పించాయి. ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషి అని కోర్టు నిర్థరించిందన్నారు. ఈ కేసులో తీర్పు వచ్చేసరికి ఆమె దివంగతులయ్యారు. కాబట్టి సాంకేతికంగా ఆమెను దోషిగా తీర్పు చెప్పలేదు. అయితే ఆమె స్నేహితురాలు వీకే శశికళ, మరికొందరు దోషులుగా నిర్థరణ అయి, శిక్షలు అనుభవించారు.
ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే సీనియర్ నేత డీ జయ కుమార్ మాట్లాడుతూ, ఓ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని నిర్వహించేందుకు అణ్ణామలై తగినవారు కాదన్నారు. ఆయన మాట్లాడేటపుడు జాగ్రత్తవహించాలన్నారు. బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు కొనసాగాలని కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ గెలవాలని కానీ అణ్ణామలై కోరుకున్నట్లు కనిపించడం లేదన్నారు.
అణ్ణామలై వ్యాఖ్యలు తరచూ ఏఐఏడీఎంకే నేతలకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వానికి మౌత్‌పీస్‌గా వ్యవహరిస్తున్నారా? లేదా? అనే అనుమానంతో సతమతమవుతున్నారు.
అణ్ణామలై మార్చిలో మాట్లాడుతూ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ఏఐఏడీఎంకేలోని పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య ఘర్షణను తమకు అనుకూలంగా మలచుకుని, రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Janasena : జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి.. హరీష్ శంకర్ కీలక ప్రకటన..
Chief Minister: అమిత్‌షాపై సీఎం ఆగ్రహం.. మేం అడిగిందేంటి? మీరు చెప్పిందేంటి?